కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సంజయ్.తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని తెలిపే ప్రదేశాలతో పాటు.. స్వరాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసిన గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన విముక్తికే యాత్ర కొనసాగనున్నట్లు కమళదళపతి స్పష్టం చేశారు.

ఇక మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేసింది కమలం పార్టీ. ఈ సభ ముగిసిన వెంటనే పాదయాత్రను కేంద్రమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. యాత్రంలో భాగంగా చాళుక్యుల వైభవానికి , పోరాటాలకు సాక్ష్యంగా నిలిచిన భువనగిరి కోట.. చేనేత కళానైపుణ్యంతో తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పిన పోచంపల్లి గుండా యాత్ర కొనసాగనుంది.

కాగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటు చేసిన సభకోసం కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లా ముఖ్యనేతలంతా ఎవరికి వారు జనాల్ని సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు లక్షమందికి పైగా సభకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభకు ముఖ్యనేతలంతా హాజరవుతున్న నేపథ్యంలో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో స్వాగత తోరణాలు .. పార్టీఫ్లెక్సీలు, జెండాలతో నింపేశారు. ఇక పాదయాత్ర జరగనున్న గ్రామాల్లో కార్యకర్తలు, నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

పాదయాత్ర సందర్భంగా ఐదు జిల్లాల్లోని ప్రజాసమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని భరోసా కల్పించనున్నారు సంజయ్. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలపై అవగాహాన కల్పించనున్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ప్రాముఖ్యాన్ని తెలియజేయనున్నారు సంజయ్.