BJPTELANGANA:
ఆచార్య చాణక్యుడి రాజనీతి శాస్త్ర ప్రకారం ఏ వ్యవస్థలో అయినా విజయవంతం కావాలంటే కచ్చితంగా క్రమశిక్షణతో పాటు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే లక్షణాలు కలిగుండాలి. ఈ రాజనీతి సూత్రాన్ని ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నా, సరైన మార్గదర్శం లేక అంతర్గత కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికలతో బీజేపీ అధిష్టానం బిజీగా ఉండడంతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతుందని చెబుతూ ఎప్పటికప్పుడు వాయిదాలతో తెలంగాణలో పార్టీని పట్టించుకోవడం లేదు. హర్యానా, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో బీజేపీ హైకమాండ్ ఇప్పటికైనా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సరైన నిర్ణయాలు తీసుకుంటుందని పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నా పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయలోపంతో 8 స్థానాలకే బీజేపీ పరిమితమయ్యింది. అనంతరం ఐదు నెలల వ్యవధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ చరిష్మాతో 8 నియోజకవర్గాల్లో గెలవడంతో రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందనే ఆశలు రేగాయి. తెలంగాణలో 8 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్తులో 88 సీట్లతో అధికారం చేపడుతుందని రాష్ట్ర నేతలు చేసిన ప్రకటనలు గాలిమేడలుగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో ఎనిమిది ప్లస్ ఎనిమిది 16 స్థానాలైనా గెలుస్తుందా..? లేక ఉన్న స్థానాలనే కోల్పోతుందా..? త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో 8 జడ్పీటీసీలైనా గెలుస్తుందా..? అనే సందేహాలొస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు పలు ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయానికి అప్పటి అధికార బీఆర్ఎస్కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగినట్టు వాతావరణం ఎర్పడింది. అయితే ఇతర పార్టీ నేతలు బీజేపీలోకి వలసలు రావడంతో కొత్త, పాత నేతల మధ్య అంతర్యుద్ధం మొదలై సరిగ్గా శాసనసభ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో సీనియర్ నేత కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని పార్టీ చెప్పగా, ఆ ప్రకటనతో మరింత గ్రూపు రాజకీయాలు పెరిగాయి. దీనికి తోడు పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండడం, అదే సమయంలో కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉండడంతో ప్రజలు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీకి బదులు కాంగ్రెస్ను ఆదరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైనా రాష్ట్ర బీజేపీలో ఆత్మవిమర్శ చేసుకొని మార్పు చెందాల్సిన బదులు అంతర్గత కలహాలు మరింత పెరిగాయి.
బీజేపీలో కుమ్ములాటలు పెరిగినా జాతీయ స్థాయి అంశాలు, మోదీ చరిష్మాతో తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి కాంగ్రెస్తో సమానంగా 8 స్థానాలు కట్టబెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానమే ఇచ్చిన రాష్ట్ర ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదిరిస్తున్నా, పార్టీ రాష్ట్రంలో బలోపేతం కాకపోవడం స్వయంకృతాపరాధమే. పార్టీ అధిష్టానం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్రెడ్డి పదవి తాత్కాలికమే అని, త్వరలో మరొకరిని నియమిస్తారని పార్టీలో ప్రచారం ఉన్నా, పదిహేను నెలలు గడిచినా రాష్ట్రంలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ అధిష్టానం మరొకరిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించలేకపోయింది. కేంద్ర కేబినెట్ మంత్రిగా బిజీగా ఉండడంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో కిషన్రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ముళ్లకుర్చీగా భావిస్తున్నా, అధిష్టానం తాత్సారంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంటుంది.
పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికివారే అధ్యక్ష పదవిపై కన్నేసి పార్టీలో ఐక్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, రామచంద్రారావుతో పాటు మరిన్ని పేర్లు వినిపిస్తున్నా, తాను కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నానని ఇటీవల బండి సంజయ్ ప్రకటించినట్టు మీడియాలో వైరల్ అయ్యింది. పార్టీ చీఫ్ పదవికి అరడజనుకు మందికి పైగా ప్రయత్నిస్తున్నా, అదే సమయంలో పార్టీ బలోపేతానికి ఐక్యంగా కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. పార్టీలో ప్రముఖ నేతలు ఇటీవల కొన్ని ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టినా వాటిలో కూడా గ్రూపు రాజకీయాలు నడిచాయి. నిరుద్యోగుల సమస్య, దేవాలయాలపై దాడులు, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు విడివిడిగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానమైన ఇలాంటి సమస్యలపై అందరూ కలిసికట్టుగా పోరాడితే పార్టీకి మైలేజీ వచ్చేదని కిందస్థాయి నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నా పార్టీలో పట్టించుకునేవారే లేరు. అంతేకాక పార్టీ పేరున నిర్వహించిన కొన్ని నిరసన కార్యక్రమాలను పార్టీలో పాత నేతలు, పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు అంటూ ఒక గీతను గిరి గీసుకొని గ్రూపుల వారీగా నిర్వహించారు. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ‘మూసీ’ నదిపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిలుపిచ్చిన నిరసన కార్యక్రమాల్లో నేతలందరూ పాల్గొన్నట్టు పైకి కనిపించినా, మొక్కుబడిగానే నిర్వహించినట్టు పార్టీలోనే గుసగుసలు వినిపించాయి.
‘మూసీ’ అంశంలో హైదరాబాద్ కీలకమైనా నగరానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలున్నా వారందరూ కలిసికట్టుగా ఉండరు. శాసనసభ పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కలేదని హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం అసంతృప్తిగానే ఉంటారు. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, అంశాలు రాజకీయంగా ఇబ్బందులు కలిగిస్తాయనే భావనతో పార్టీ ఉంటే, ఆయన మాత్రం పార్టీ అంతర్గత విషయాలపై ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుంటారు. మరోవైపు ఏదో సమస్యతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చూసే ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా అంతా తానే అంటూ వ్యవహరిస్తారని, ఎమ్మెల్యేలను కానీ, పార్టీ ఇతర నేతలను కానీ సంబంధిత అంశాల్లో జోక్యం చేసుకోకుండా ప్రవర్తిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఎంపీలు కూడా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు కూడా తక్కువే. పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వ్యవహరిస్తారనడానికి ఉదాహరణగా ‘హైడ్రా’ అంశాన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి సున్నితమైన అంశాలపై పార్టీ హైకమాండ్ నుంచి కూడా స్పష్టమైన దిశా నిర్ధేశం లేకపోవడంతో పార్టీలో మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా, వారిచ్చిన పలు హామీలను ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోయింది. మరోవైపు రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ నిర్ణయాలను వెలికితీస్తూ బీఆర్ఎస్ను ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనిని అవకాశంగా మలుచుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలపై, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ను నిలదీయాల్సిన బీజేపీ పార్టీలో ఉన్న అనైక్యతతో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టలేకపోతోంది. చివరికి పార్టీలో నేతల నిర్లక్ష్యం ఎంతకు చేరుకుందంటే, పార్టీ నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమం ఒక ప్రహసనంగా సాగింది. పార్టీ అధిష్టానం పెట్టిన లక్ష్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ కీలక నేత అందుకోలేకపోయారు.
తెలంగాణలో తర్వలో జరగనున్న స్థానిక ఎన్నికలు బీజేపీకి ఒక చాలెంజ్తో పాటు అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో పలువురు కీలక నేతలున్నా క్షేత్రస్థాయిలో కేడర్ బలహీనంగా ఉందనేది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను ఒక అస్త్రంగా మల్చుకుంటే నాలుగేళ్ల అనంతరం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలుంటాయి. దీనిని జారవిడ్చుకోకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీలో కష్టపడే వారిని, సానుభూతిపరులను ప్రోత్సాహించి సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మేయర్లుగా గెలిపించుకుంటే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపర్చుకోవచ్చు.
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పార్టీని ఆదరిస్తున్నా, తెలంగాణలో పార్టీ పటిష్టంగా లేకపోవడానికి అధిష్టానం ఉదాసీనతే ప్రధాన కారణం. బీజేపీ హైకమాండ్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీలో క్రమశిక్షణకు చర్యలుతీసుకోవడంతోపాటు వీలైనంత త్వరగా పార్టీ రాష్ట్ర చీఫ్ను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీ గాడీన పడే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి షరామాములుగానే తయారవడం ఖాయం.