సూర్యాపేట జిల్లాల్లో మైనింగ్ అక్రమాలు యథేచ్చగా సాగుతున్నాయి. 20 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ తీసుకున్న ఓ సంస్థ 40 ఎకరాలకు తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని పరిస్థితి ఉందని..అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నామని స్ధానికులు వాపోతున్నారు. చిత్రం ఏంటంటే పర్మిషన్ లేని భూములకు కూడా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతుబంధు అందుతుండడం అధికారుల నిర్లక్ష్యంగా అద్దం పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం పరిధిలోగల మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీ వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. గ్రౌండ్ వాటర్ కలుషితమై అక్కడి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని..మైనింగ్ పర్మిషన్ 20 ఎకరాలకు తీసుకొని 40 ఎకరాలలో తవ్వకాలు జరుపుతున్నారని.. 200 మీటర్లు లోతు దాటి ఆయిల్ బ్లాస్టింగ్ చేస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ చేసే సమయాలలో.. ముందస్తు హెచ్చరికలు లేకుండానే బ్లాస్టింగ్ చేయడంతో చుట్టుపక్కల రైతులతో పాటు అటుగా వెళ్ళే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కొన్ని సందర్భాల్లో బ్లాస్టింగ్ చేసే టైంలో అటు నుంచి వెళ్లే ప్రజలకు గాయాలైన రోజులు కూడా ఉన్నాయంటున్నారు.
ఇక గ్రానైట్ క్వారీ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు దారులపై గ్రానైట్ యాజమాన్యం దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డీవో, ఎంఆర్ఓ,ఇతర ఉన్నత అధికారులకు స్థానిక గ్రామస్తులు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు.అధికారులు మాముల మత్తులో తుగడం వలన తమకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రానున్న రోజుల్లో అయినా తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో భారీ ఉద్యమం చేపడతామని స్థానిక గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.