తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రచ్చ.. రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి ఫైర్!

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ ద్రోహి అంటూ ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వెంకట్ రెడ్డి మాకుటుంబ సభ్యుడేనని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు.ఎంపీ వెంకట్ రెడ్డి ప్రధానినీ కలవడంపై భిన్నంగా స్పందించారు. ఇక వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ ముఖం చూసే ప్రసక్తే లేదంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.

కోమటిరెడ్డి మావాడే..

కాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ ప్రస్తావించే బ్రాండ్ కాంగ్రెస్ దని.. వెంకట్ రెడ్డి మాకుటుంబ సభ్యుడు అంటూ తేల్చిచెప్పారు.రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డికి సంబంధంలేదన్నారు. మునుగోడులో నిర్వహించబోయే సభకు కోమటిరెడ్డి హాజరవుతారని స్పష్టం చేశారు. రాజగోపాల్ సవాల్ పై నియోజకవర్గంలోనే సమాధానామిస్తానని రేవంత్ వెల్లడించారు.

రేవంత్ ముఖం చూడను..

ఇక రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తనను ఓడించడానికి ప్రయత్నించిన చెరకు సుధాకర్ ను రేవంత్ ఎలా చేర్చుకున్నారంటూ దుయ్యబట్టారు. రేవంత్ పెద్ద తప్పుచేశాడని.. ఇకపై ఆయన ముఖం చూడనన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే.. మునుగోడుకు వెళ్తానని తేల్చిచెప్పారు.

అభివృద్ధి పనులపై భేటి..

వెంకట్ రెడ్డి ప్రధాని మోడీ కలవడంపై భిన్నంగా స్పందించారు సంజయ్. ఎవరూ అపాయిట్ మెంట్ అడిగినా కాదనకుండా ప్రధాని కలుస్తారని అన్నారు. బహుశా వెంకట్ రెడ్డి కలిసింది అభివృద్ధి అంశాలకు సంబంధించి అయ్యిండొచ్చని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం ఖాయమని.. టీఆర్ఎస్ గుణపాఠాం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సంజయ్ పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుండగా.. బీజేపీ నేతల చేరికలు. యాత్రలతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కసరత్తు చేస్తూనే.. గెలిచేందుకు వ్యూహాలను రచిస్తోంది