కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్ బై.. నెక్ట్స్ వికెట్ ఎవరూ?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నేతల పార్టీ మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది.ముఖ్యంగా హస్తం పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటీకే రాజగోపాల్ పార్టీ, పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో అగ్రకుల దురహాంకారం పెరిగిపోయిందని.. పార్టీ కోసం కష్టపడ్డ మాలాంటి నేతలకు గుర్తింపు లేదని ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.అటు రాజగోపాల్ తనతోపాటు మరికొంతమంది పార్టీని వీడుతారని కామెంట్స్ చేయడంతో నెక్ట్స్ వికెట్ ఎవరన్న చర్చ నడుస్తోంది.
రేవంత్ ఒంటెత్తు పోకడే కారణమా..?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్ పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సైతం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాకా కులం,ధనమే కీలకమయ్యాయని.. ప్రశ్నించే వాళ్లపై అధిష్టానానాకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, వ్యూహకర్త సునీల్ తో కలిసి రేవంత్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ లో పార్టీసిద్దాంతాలకు వ్యతిరేకంగా పరిస్థితి ఉందని .. రాహుల్ ఆశయాలను తుంగలో తొక్కారని దాసోజు ఆవేదన వ్యక్తం చేశారు.

విజయా రెడ్డి చేరికతో మనస్తాపం చెంది…
కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత పీజేఆర్‌ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్ లో చేరిననాటినుంచి దాసోజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటిచేసి ఓడిపోయిన ఆయన.. ఈసారి సీటు విజయారెడ్డికి ఇస్తారని ప్రచారం జరగడంతో పార్టీని వీడినట్లు తెలుస్తోంది.ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో వచ్చిన శ్రవణ్… ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా పేరు సంపాదించారు. పార్టీలోనూ కీలక వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కై గుడ్ బై చెప్పి… కాంగ్రెస్ లో చేరారు.

పార్టీ మారితే చెప్పే వెళ్తా..భయపడను!

ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం రేవంత్ తీరుపై మండిపడ్డారు. స్టార్ క్యాంపెయినర్ అయినా నాకు చెప్పకుండా.. నియోజకవర్గంలో సభ పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పీసీసీ ప్రెసిడెంట్ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ నిఎందుకూ వీడుతున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పాత కాంగ్రెస్ నేతలందరీని వెళ్లగోడుతున్నారని.. పార్టీ టికెట్లను పాత టీడీపీ నేతలకు ఇస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.పార్టీ మారితే చెప్పే వెళ్తానని .. దేనికి భయపడనని వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

నాతోపాటు చాలామంది వస్తారు..

అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనతోపాటు చాలామంది బీజేపీలో చేరుతున్నారని బాంబ్ పేల్చారు.ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందే పరిస్థితి నెలకొందని.. కేసీఆర్ దిమ్మతిరిగేలా మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ వెంకట్ రెడ్డి కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ లో కష్టపడిన వాళ్లకు తగిన గుర్తింపు లేదని..తమకు పదవులు ముఖ్యం కాదని..ప్రజాసమస్యల పరిష్కారమే ముఖ్యమని రాజగోపాల్ తేల్చిచెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటం పెద్దదెబ్బని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు బీజేపీలోకి వలసలు కొనసాగుతుండటంతో కమలం పార్టీలో జోష్ కనిపిస్తోంది.ఇదే ఊపులో మునుగోడులో గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లాపై పట్టుసాధించాలని కమలనాథులు ఊవిళ్లుఉరుతున్నారు.

Optimized by Optimole