ఎవరి గోల వారిదే…

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ): 

తెలంగాణాలో నాలుగు నెలల్లో జరగనున్న మూడవ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని పార్టీలు వ్యూహరచనలలో తనముకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండడంతో రాష్ట్రంలో అయోమయం రాజకీయ వాతావరణం నెలకొంది. బడాబడా హామీలతోపాటు ఎదుటి పక్షాలపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. తమ అభ్యర్థులు సరైన పోటీ ఇవ్వగలరో లేదో సంశయంతో ఇతర పార్టీల నేతలను అక్కున చేర్చుకుంటున్నారు. నేడు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేసరికి ఎవరి పంచన చేరుతారో తెలియని పరిస్థితి. విజయమే లక్ష్యంగా సాగుతున్న పార్టీల తీరుతో గందరగోళం చెందుతున్న ప్రజలు ‘ఎవరి గోల వారిదే’ అని పెదవి విరుస్తున్నారు.

అనైక్యతను పెంచిన ఆత్మీయ సమ్మేళనాలు..   

వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి ‘హ్యాట్రిక్‌’ సాధిస్తామని చెబుతున్న బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా ఆందోళన నెలకొంది. ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని గుర్తించిన కేసీఆర్‌ ఐక్యత కోసం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశిస్తే ఈ కార్యక్రమాలు పార్టీలో మరింత అనైక్యతను పెంచాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా టికెట్‌ ఆశిస్తున్న నేతలు నియోజకవర్గాల్లో పోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పార్టీ అధిష్టానానికి తలబొప్పి కట్టింది. సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై మెజార్టీ నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా కేసీఆర్‌ నేతృత్వమే శ్రీరామరక్ష అని పార్టీ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం వీలైనంత త్వరలో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్‌, కేటీఆర్‌ కొన్ని చోట్ల పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తుంటే, అక్కడి ఆశావహులు పార్టీ మారుతున్నారు. పార్టీలో బంగారు తెలంగాణ (బీటీ) అంటూ ప్రచారం చేసుకునే ‘బీటీ’ టీంకు ఉద్యమకారులకు మధ్య పలు నియోజకవర్గాల్లో పొసగడం లేదు. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ నేతల వారసులు పోటీకి సిద్ధమవుతుండడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కంగారుపడుతున్నారు. 2018 ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్న కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని సంఖ్యా బలాన్ని 103కు పెంచుకోవడంతో కారు ఓవర్‌ లోడిరగై దారితప్పుతోంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు అప్పుడు వారి చేతిలో ఓడిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో యుద్ధమే జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఖర్చుతో కూడుకున్న ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చి కొత్తవారికి టికెట్‌ ఇవ్వడం కేసీఆర్‌కు పెద్ద సవాలే.


ప్రభుత్వ పథకాలపై గంపెడాశలు పెట్టుకున్న కేసీఆర్‌కు అవే గుదిబండగా మారుతున్నాయి. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఆశించిన వారందరికీ అందకపోవడం, పోడు భూముల పంపకం, దళిత బంధు, దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ వంటి ప్రధాన పథకాల వైఫల్యాలు ప్రభుత్వ వ్యతిరేకంగా మారుతున్నాయి. ఈ వైఫల్యాలను గుర్తించిన కేసీఆర్‌ ప్రధానమైన రైతు రుణమాఫీ చెల్లించాలని ఆగమేఘాలమీద ఆదేశించారు. మైనార్టీలకు లక్ష రూపాయాలు, బీసీ బంధు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది గుర్తింపు, హైదరాబాద్‌ సిటీ చుట్టూ మెట్రో ఏర్పాటు వంటి ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమరవీరుల స్థూపం, నూతన సచివాలయం నిర్మాణాలు, 125 అడుగుల భారీ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుతో హడావుడి చేసినా అదీ తాత్కాలికమే అయ్యింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ కేంద్రంలోని బీజేపీకి ‘బీ’ టీమ్‌గా మారిందనే ప్రచారాన్ని తిప్పికొట్టడం కేసీఆర్‌కు ప్రధానాంశం. వీరి లోపయికారి దోస్తీపై వస్తున్న వార్తలతో ముఖ్యంగా మైనార్టీలలో బీఆర్‌ఎస్‌కు నష్టం జరగవచ్చు. ఈ వాదనను తిప్పికొట్టేందుకే బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో మణిపూర్‌ అంశంపై మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినా అది పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతోందో వేచి చూడాలి. అభ్యర్థుల రాజకీయ, ఆర్థిక బలాలతోపాటు కేసీఆర్‌ చరిష్మా పార్టీని విజయతీరాలకు చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాజనకంగా ఉన్నారు.

 

 

 

 కాంగ్రెస్‌లో ఎవరికి వారే                                                                                                                                                                                              కర్ణాటక ఎన్నికల విజయంతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్రంలో ఒకడుగు ముందుకు, రెండడుగుల వెనక్కు అన్నట్టుంది. ఒక ‘మాణికం’ను మార్చి మరో ‘మాణిక్‌’కు పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ బాధ్యతలను అప్పగించినా పార్టీ వర్గ పోరులో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అరడజనుకుపైగా సీనియర్‌ నేతలు సీఎం కుర్చీ కోసం కర్చీఫ్‌లు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై పోరాడాల్సిన పార్టీ నేతలు స్వపక్షంలోనే యుద్దం చేస్తున్నారు. తాము అనుకున్నది సాధించకపోయినా పర్వాలేదు రేవంత్‌కు మాత్రం ప్రయోజనం చేకూరవద్దని ఆయన ప్రత్యర్థులు భావిస్తుంటే, ప్రత్యర్థులకు లాభం కలగకుండా ఉండాలని రేవంత్‌ తలుస్తునట్టు పార్టీలో పరిణామాలున్నాయి.

దాదాపు అన్ని నియోజవర్గాల్లో పార్టీ గ్రూపులున్నాయి. పార్టీలో చేరికలు అధిష్టానానికి ఉత్సాహాన్ని ఇస్తున్నా ఆయా నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య వర్గపోరుతో నష్టం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. పార్టీలో చేరికలు, ఢిల్లీ పెద్దలతో సమావేశాల సమయంలో అందరూ ఐక్యతగా ఉన్నట్టు కనిపిస్తూన్నా పార్టీలో వాతావరణం నివురు గప్పిన నిప్పులా ఉంది. తాను పార్టీ మారుతున్నానని పార్టీలోని కీలక నేతలే ప్రచారం చేస్తున్నారని సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడమేపార్టీలో అనైక్యతకు నిదర్శనం.
రాష్ట్ర పార్టీకి సంబంధించి ఒక కమిటీ వేసినా, సమావేశం నిర్వహించినా సజావుగా సాగడం గగనమే. ఇటీవల ప్రకటించిన ఎన్నికల కమిటీపై, మండలాల కమిటీలపై అసంతృప్తితో చేపట్టిన నిరసనలతో గాంధీభవన్‌కు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందంటే, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన సమయంలో యుద్ధ రంగానే తలపించవచ్చు.
పార్టీ వ్యూహకర్త సునీల్‌ కొనుగోలు ఇటీవల సమర్పించిన నివేదికలో దాదాపు 45కు మించి స్థానాలు రావడం కష్టమేనని తేల్చడంతో పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.2009 నుండి ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లోని 51 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయానే మర్చేపోయంది. కర్ణాటక ఫార్ములాను అమలు చేస్తామంటున్నా అక్కడ ఎన్నికల ముందు పాటించిన ఐక్యత సూత్రాని ఇక్కడ విస్మరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా దాదాపు 80 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటికే ఒక స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ప్రకటన పార్టీలో మరింత వేడిని పుట్టించడం ఖాయం.


గందరగోళంలో బీజేపీ
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ రాష్ట్రంలో దారితప్పి గందరగోళంగా తయారయ్యింది. కిషన్‌రెడ్డి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు ప్రసంగించిన తీరు పార్టీలో అంతర్గత నిప్పు ఇంకా చల్లరలేదని నిరూపిస్తోంది. కిషన్‌రెడ్డిపై కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేయకండి అని బండి సంజయ్‌ అనడంతోనే తనపై కొందరు ఫిర్యాదులు చేశారని చెప్పకనే చెప్పారు. కేసీఆర్‌ ఈడీని మేనేజ్‌ చేశారని రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారంటే, కేంద్రం ఆధీనంలో ఉండే ఈడీని బీజేపీ పెద్దల సహకారంతోనే కేసీఆర్‌ అనుకూలంగా మల్చుకున్నారా అనే సందేహాలను లేవనెత్తారు. కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పాల్గొంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి అంటూ విజయశాంతి గైర్హాజరయ్యారు. పార్టీ బలోపేతం దిశగా అధిష్టానం అధ్యక్షుడిని మారిస్తే అదే కార్యక్రమంలో భిన్నస్వరాలు రావడం పార్టీలో అనైక్యతకు నిదర్శనం.
రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులే లేరు. నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మంట్లపై పార్టీకి పట్టుందా అంటే ప్రశ్నార్థకమే. పార్టీకి కొంత పట్టున్న కొన్ని నియోజకవర్గాలలో గ్రూపులు పెరిగాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ను ఎంపిక చేయలేదంటనే రాష్ట్ర బీజేపీపై అధిష్టానానికి ఎంత పట్టుందో తెలుస్తోంది.


కండువాలు కప్పడమే లక్ష్యంగా…
అన్ని పార్టీలు వలస రాజకీయాలకు ప్రాధాన్యతిస్తున్నాయి. పార్టీలో చేరేవారికి కండువాలు కప్పడమే లక్ష్యంగా రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన నేతలను చేర్చుకోవడంతో ప్రయోజనం ఉంటుంది. ఇదే సమయంలో బలమైన చోట్ల వలస నేతలతో మొదటికే మోసం ఏర్పడే అవకాశాలున్నాయి. మరోవైపు తాము చేసిన, చేబోయే పనుల గురించి పాజిటివ్‌ అంశాలతో కాకుండా, ఎదుటి పక్షంపై బురద చల్లడమే లక్ష్యంగా నెగెటివ్‌ ప్రచారంతో కూడా పార్టీలకు నష్టం చేకూర్చవచ్చు. ఇటీవల వరదలతో రాష్ట్రంలో బురద రాజకీయం మొదలైంది. ఏ పార్టీ వారైనా ఆపదలో ఉన్న ప్రజలకు మంచి చేస్తే స్వాగతించాల్సిందే. కానీ ఎదుటివారిని ఎండగట్టడమే లక్ష్యంగా వైరి పక్షాలు విమర్శిస్తుంటే ఈ రాజకీయాల్లో ఎవరి గోల వారిదే అని సరిపుచుకుంటున్న ఓటర్లు సరైన సమయంలో సరైన తీర్పు ఇవ్వడం ఖాయం.

=========================

(ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ): 

Related Articles

Latest Articles

Optimized by Optimole