బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?

Nancharaiah merugumala senior journalist:  బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?రాజకీయ పరిశోధకుడు అసీం అలీ అంచనా!

తెలంగాణలో పాలకపక్షం భారత రాష్ట్ర సమితికి (బీఆరెస్‌) ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలనుకున్న హిందుత్వ రాజకీయపక్షం బీజేపీ అంచనాలు తారుమారవుతున్నాయని దిల్లీ రాజకీయ పరిశోధకుడు అసీం అలీ భావిస్తున్నారు. అడపాదడపా ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాసే అసీం అలీ విశ్లేషణలు ‘అతి సెక్యులర్‌’ భావాలతో కాస్త వాస్తవ విరుద్ధంగా కనిపిస్తాయి. హిందుత్వ బీజేపీని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు 2024లో విజయవంతంగా ఎదుర్కొనడానికి ఏం చేయాలో వివరిస్తూ కలకత్తా కేంద్రంగా వెలువడే ఇంగ్లిష్‌ దినపత్రిక ‘ద టెలిగ్రాఫ్‌’లో వ్యాసం రాశారు అసీం అలీ. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో బీజేపీ ఉనికి, భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూ కొన్ని వాక్యాలు రాశారు. వాటిని తెలుగులోకి తర్జుమా చేసే ప్రయత్నం చేస్తున్నా.

తెలంగాణలో బలీయమైన శక్తిగా ఎదగడానికి రెడ్లపైనే బీజేపీ ఆశలు

‘‘ తెలంగాణలో రెండో బలమైన రాజకీయ శక్తిగా అవతరించడానికి బీజేపీ ఆశలన్నీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఆధిపత్య కులమైన రెడ్లపైనే ఉన్నాయి. రెడ్లు మూకుమ్మడిగా కాంగ్రెస్‌ వైపు నుంచి తమ దారిలోకి వస్తారని కాషాయపక్షం అంచనావేసింది. అయితే, ఇటీవల కొంత మంది మోతుబరి రెడ్డి నేతలు కాంగ్రెస్‌ గూటిలో దూరడానికే తాము మొగ్గుచూపుతున్నామని ‘సిగ్నల్స్‌’ పంపించారు. దీంతో తెలంగాణలో వేగం పుంజుకుంటున్నట్టు «భ్రమలు కల్పించిన హిందుత్వ పవనాల ఊపు తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ రెడ్లకు కాంగ్రెస్‌ పార్టీపై కొత్తగా ప్రేమ పొంగుకు రావడానికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ జాతీయ అగ్రనేత రాహుల్‌ గాంధీ జరిపిన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ‘సాంప్రదాయ మద్దతుదారులైన దళితులు, ముస్లింలు హస్తంపార్టీకి దగ్గరగా ఉన్నారనే భావన రెడ్లను మళ్లీ తమ పాత దారిలోకి మళ్లించింది. కాంగ్రెస్‌ పార్టీకి  బడుగుల సామాజిక పునాది బలంగా ఉందనే అంచనా రెడ్లలో ఏర్పడడానికి పురికొల్పింది. ’’

  ఇది ఉత్తరాదికి చెందిన రాజకీయ విశ్లేషకుడు అసీం అలీ అంచనా. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు కాంగ్రెస్‌ పక్షానే బలంగా నిలబడతారనే నమ్మకం కలగడంతో తెలంగాణ రెడ్లు కొందరు తోకముడుచుకుని ‘డైనమిక్‌ లీడర్‌’ ఏ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ను హైదరాబాద్‌ లో గద్దెనెక్కించాలనే నిర్ణయానికి వచ్చారనే భావన కలిగించారు అలీ. అలీ సాహబ్‌ చెప్పినట్టు ఎస్టీ–ఎస్టీలు, ముస్లింల పునాది స్థాయి మద్దతుతో రెడ్ల సమర్ధ నాయకత్వంతో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా? అనేది ఈ ఏడాది ఆఖరులో తేలే అంశం. 2023 డిసెంబర్‌ మాసంలో అదే జరిగితే–33 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ మహానగరంలో తెలంగాణ రెడ్డి నేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే మహదవకాశం వస్తుంది. ఎందుకంటే 1989 డిసెంబర్‌ 3న మాజీ రాష్ట్రపతి, రెడ్డి జన నాయకుడు నీలం సంజీవరెడ్డి గారి సమక్షంలో లాల్‌ బహదూర్‌ స్టేడియంలో చివరిసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మర్రి చెన్నారెడ్డి గారు ఏడాది తర్వాత అంటే 1990 డిసెంబర్‌ 17న నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ ఆదేశానుసారం గద్దెదిగి ఇంటికిపోయారు. పోనీ ఏదో ప్రాంతం రెడ్డి అనుకుంటే–హైదరాబాద్‌ నగరంలో చదువుకుంటూ పెరిగిన చిత్తూరు రెడ్డి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి 2014 మార్చి ఒకటి వరకూ సీఎంగా పనిచేసి రాజీనామా చేశాక మరో రెడ్డి నేత ఎవరూ తెలంగాణ రాజధాని హైదరాబాదులో ముఖ్యమంత్రి కాలేదు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ లో సైతం రెడ్డి ముఖ్యమంత్రి లేకుండా తొమ్మిదిన్నరేళ్లు ఎన్నడూ గడవలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌ పంచన చేరాలని తీసుకున్న తెలంగాణ బడా చోటామోటా రెడ్ల తెలివైన నిర్ణయం ఫలితంగా హస్తం పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అనుకోవాలి. లేదా కొన్ని మాసాలు ఇలాంటి భ్రమల్లో బతకాలి. అలీ గారి అంచనాలకు తోడు ఈమధ్య తెలుగు దినపత్రికలన్నీ వాటి యాజమాన్యాల కులాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌ అనుకూల రాగం బాగా ఎత్తుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి సమీప భవిష్యత్తులో వలసలు విపరీతంగా పెరగబోతున్నాయనే ఇంప్రెషన్‌ కలగజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న పెద్ద పద్మనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేస్తారో?

 

Related Articles

Latest Articles

Optimized by Optimole