Nancharaiah merugumala senior journalist:
‘స్త్రీల శరీర భాగాలు మగాళ్లకు బిగించిన’ రాజకీయ కార్టూన్లు ఇప్పుడు ‘ఈనాడు’లో కనపడకపోవడం ‘పాత తరం’ పాఠకులకు లోటేనా?
‘ఈనాడు’లో క్రమం తప్పకుండా మొదటి పేజీలో దర్శనమిచ్చిన ‘స్త్రీల రొమ్ములతో’ వేసిన పురుష నేతల కార్టూన్లు ఇప్పుడు కనపడడం లేదు! మూడు దశాబ్దాలకు పైగా బర్రె లేదా దున్నపోతుపై స్వారీ చేసే బిహార్ యాదవ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్‌తో 1990–2020 మధ్య 30 ఏళ్ల పాటు గీసిన బొమ్మలూ అగపడవు. ప్రసిద్ధ తెలుగు కార్టూనిస్టు పోచంపల్లి శ్రీధర్ రావు గారు వేసిన ఇలాంటి వ్యగ్యచిత్రాలు గత రెండేళ్ల ఈనాడు సంచికలు ఎంత వెతికినా కనపడవు. శ్రీ«ధర్ గారు 2020ల మొదట్లో ఈనాడు నుంచి నిష్క్రమించడం వల్ల జరిగిన నష్టం ఇది. అయితే, ఈ పరిణామం లక్షలాది మంది తెలుగు పాఠకులకు పెద్ద లోటుగా అనిపించడంలేదు. కిందటి శనివారం 50 పేజీల ‘ఈనాడు స్వర్ణోత్సవ సంచిక’ చదివినప్పుడు ‘గేదెపై లాలూ’, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, ఇంకా మాజీ ప్రధానులు ఎచ్.డి.దేవెగౌడ, ఐకే గుజ్రాల్, ఏబీ వాజపేయి, డా.మన్మోహన్ సింగ్, మాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్,కిరణ్‌కుమార్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖ నేతల బొమ్మలకు స్త్రీల శరీర భాగాలు తగిలించి కార్టూనిస్టు శ్రీధర్ గారు గతంలో వేసిన బొమ్మలు కళ్ల ముందు కదలాడాయి. ఇలాంటి శ్రీధర్ గారి బ్రాండు వ్యంగ్యచిత్రాల ప్రస్తావన లేని ఈనాడు ప్రత్యేక సంచిక చూశాక ఆయన అభిమానులైన పాత తరం పాఠకులకు ఈ వింత బొమ్మల విషయం గుర్తుకొచ్చింది. కనీసం ‘పాకెట్ కార్టూన్’ కూడా మొదటి పేజీ ఎడమ దిగువ మూలన వేయడానికి ప్రముఖ దినపత్రికాధిపతులు వెనకాడుతున్న రోజులివి. పురుష రాజకీయవేత్తల బొమ్మలకు వక్షోజాలు, అందరినీ ఆకట్టుకునే స్త్రీల ఇతర శరీర భాగాలు బిగించి వేయడంలో అందెవేసిన చేయి అయిన శ్రీధర్ గారిని అనుకరించే సాహసం ఇప్పటి తరం కార్టూనిస్టులు చేయడం లేదు. ఈవిధంగా వారు– ఈనాడులో నాలుగు దశాబ్దాలుగా తన బొమ్మలతో పాఠకుల కళ్లకు విందు చేసిన విశ్రాంత వ్యంగ్య చిత్రకారుడి పేరుతో నమోదైన ‘పేటెంట్’ను గౌరవించడం ద్వారా ఆయన ‘ఇంటెలెక్చ్యుల్ ప్రాపర్టీ రైట్స్’ను తెలుగు రాజకీయ కార్టూనిస్టులు కాపాడడం శుభ పరిణామం.