Telugu literature:
తెలుగునాట రాజకీయ పుస్తక రచన తక్కువ. సమకాలీన రాజకీయ పరిణామాల మీద విశ్లేషణాత్మకమైనవి మరీ తక్కువ. అధీకృత డాటా, సాధికారిక సమాచారం, తెరవెనుక సంగతులను సమ్మిళితం చేసి వెలువరించిన… వ్యాఖ్యాయుతమైన పుస్తకాలు దాదాపు లేవనే చెప్పాలి. ఒకటీ, అరా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తెలుగు రాజకీయాలకు సంబంధించి తెలుగులోనే కాక ఇంగ్లీషులోనూ లేవు ఎందుకో! సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు వంటి ఒకరిద్దరు రాసిన కొన్ని పుస్తకాలున్నా అవి డాటా ప్రధానమైనవి మాత్రమే! సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ఎన్.వేణుగోపాల్ (వీక్షణం) వంటి వారి పుస్తకాలున్నా… అవి రాజకీయంగా కన్నా సామాజికార్థిక ప్రాధాన్యమైనవే! అందుబాటులోని ఇతర రాజకీయ పుస్తకాలు ప్రమోషన్ కోసం రాసినవో, బయోగ్రఫీ/ఆటో బయోగ్రఫీ వంటివో, వ్యాస సంకలనాలో ఉన్నాయి. వాటికి అంతగా సార్వజనీనత, సార్వకాలీనత ఉండదనిపిస్తుంది.
దేశంలోని ఇతర భాషా రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలపై పుస్తకాలు చాలానే ఉన్నట్టున్నాయి. కనీసం ఇంగ్లీషులోనైనా దొరుకుతాయి. రాజకీయ రచనా వ్యాసంగం, జర్నలిజం నేపధ్యం ఉన్నవాళ్లు రాసినవే అందులో ఎక్కువ. కొన్ని విషయాల్లో పునరుక్తి సమస్య ఉన్నా చాలా వరకు ఉపయోగకర సమాచారం వాటిల్లో దొరుకుతుంది.
‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థలో మాకు ఇటువంటి పుస్తకాల సహాయం ఎంతో ఉపయోగకరం. గత కొన్నేళ్ళుగా వివిధ ఎన్నికల సర్వేలప్పుడు మేం గమనిస్తే… ఆయా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, ప్రతి రాష్ట్రానికీ సంబంధించి అయిదారు నుంచి పదేసి పుస్తకాల వరకు మాకు తేలిగ్గానే దొరికాయి. క్షేత్రంలో మా పరిశోధకులు సేకరించే సమాచారం, ముఖ్యంగా ప్రామాణిక గణాంకాలు మా విశ్లేషణలకు ప్రధాన భూమికనిస్తాయి. దానికి తోడు… మేం స్వయంగా పర్యటనలకు వెళ్లినపుడు గమనించే అంశాలు, తెలిసే విషయాలు పరిపుష్టినిస్తాయి. అదనంగా ఆయా పుస్తకాల్లోని దృవపడిన విషయాలకు పాతిక, ముఫ్పై సంవత్సరాలకు పైబడిన మా జర్నలిజం అనుభవాన్ని జోడించడం వల్లే…. సమగ్రమైన నివేదికలు, వ్యాసాలు, కథనాలు, వ్యాఖ్యలు మాకు సాధ్యపడుతాయి.
నిన్నటి వరకు మా చేతుల్లో నలిగిన ‘మహారాష్ట్ర’ పుస్తకాలు ఇక షెల్ఫుల్లోకి వెళ్లి, త్వరలో ఎన్నికలు జరుగనున్న ‘ఢిల్లీ’ పుస్తకాలు, డాక్యుమెంట్లు, నివేదికలు మా టేబుల్ పైకి వచ్చేశాయి. ఇదీ వరస!
35 యేళ్లకు పైగా జర్నలిజం, అదీ ప్రధానంగా ‘పొలిటికల్ ఫీల్డ్’ లో ఉండి, వార్తలు, వార్తా కథనాలే తప్ప… నేనేం పుస్తకాలు రాయలేదు. అలా రాయకపోవడం, అందుకు చొరవ తీసుకోకపోవడం నా తప్పేనని, అపరాధ భావంతో అంగీకరిస్తున్నా! త్వరలో ఒక ప్రాజెక్ట్ కింద, సామాజిక-రాజకాయార్థిక అంశాలతో పుస్తక రచన చేపట్టాలనే గట్టి సంకల్పంతో ఉన్నానని మాత్రం చెప్పగలను.