‘మిస్సైల్ మ్యాన్’ స్మృతిలో..!!

‘మిస్సైల్ మ్యాన్’ స్మృతిలో..!!

శాస్త్రవేత్త..తత్వవేత్త..సాహితీవేత్త..ప్రకృతి ప్రేమికుడు..మార్గదర్శకుడు..అన్నిటికి మించి గొప్ప మానవతావాది..’మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ‘ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను యావత్ భారతావని స్మరించుకుంటుంది.

1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు.1958 మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తాను కలలు కన్న పైలట్ కల త్రుటిలో చేజారి పోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరారు. 1969 భారతదేశం తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్ ఏల్వీ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ నియమితులయ్యారు. అనంతరం పిఎస్ఎల్వీ రూపకల్పన కోసం శ్రమించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ లో భాగంగా అగ్ని పృథ్వి మిస్సైల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి..దేశానికి తొలి మిస్సైల్ అందించారు. దీంతో వారికి ‘మిస్సైల్ మ్యాన్’ బిరుదు లభించింది.

1922 లో భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు కలాం. 1998లో వారి కృషి ఫలితంగా పోఖ్రాన్_2 అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంతో భారత్ అణ్వస్త్ర దేశాల సరసన నిలిచింది. 2002 అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం..ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగిపోయింది.ప్రథమ పౌరుడి హోదాలో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన ఘనత కలాందే.

రాష్ట్రపతి పదవి కాలం పూర్తయిన తర్వాత నిత్య బోధకుడిగా.. ‘కలలు కనండి ..కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతకు మార్గనిర్దేశనం చేశారు. విశేష సేవలకు గాను దేశంలోని అత్యున్నత పురస్కారాలు 1990లో పద్మ విభూషణ్ 1997 లో భారతరత్న కలాంను వరించాయి .దేశంలోని 30కిపైగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి.

సామాన్యుడిగా మొదలైన కలాం ప్రస్థానం అనంతమైన విశ్వాన్ని సృజించి..దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించి తిరిగి సామాన్యుడిగా జీవించిన కలాం వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం మరెందరికో స్ఫూర్తి దాయకం.