Balagopal: కోస్తాంధ్ర కాపుల్లో యూపీ యాదవుల పోకడలున్నాయన్న బాలగోపాల్‌ మాటలు.. ఇప్పటికీ అర్థం కాలేదు..!

Nancharaiah merugumala senior journalist: (కోస్తాంధ్ర కాపుల్లో యూపీ యాదవుల పోకడలున్నాయన్న డా.కె.బాలగోపాల్‌ గారి మాటలు 1988లో సరిగా అర్ధం కాలేదనే ఇప్పటికీ అనుకుంటున్నా!)

=======================

పేద, బలహీన ప్రజల హక్కుల రక్షణకు, వారి మంచి కోసం పనిచేసిన ఇద్దరు గొప్ప మనుషులు 57 ఏళ్లకే కన్నుమూయడం భారతదేశానికి తీరని లోటు. ఈ విషయం ఇలా ‘సాంప్రదాయబద్ధంగా’ చెప్పకుండా కాస్త ఘనంగా వర్ణించడం నాకు తెలియడం లేదు. ఈ ఇద్దరు ఉద్ధండుల మధ్య వయసులో 42 సంవత్సరాలు తేడా ఉంది. వారెవరో కాదు– ఒకరు 1967 అక్టోబర్‌ 12న మరణించిన ప్రసిద్ధ సోషలిస్ట్‌ ఉద్యమ నేత డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా, రెండో ప్రముఖుడు 2009 అక్టోబర్‌ 8న హఠాత్తుగా చనిపోయిన డాక్టర్‌ కందాళ్ల బాలగోపాల్‌ గారు. రెండుసార్లు (1963–ఫారూఖాబాద్, 1967–కనోజ్‌) లోక్‌ సభకు ఎన్నికైన  డా.లోహియా మరణించిన 20 ఏళ్ల తర్వాత (1977) కేంద్రం, యూపీ, బిహార్‌ వంటి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు ఆయన శిష్యులమని, లోహియా సోషలిస్టులమని గర్వంగా చెప్పుకునే అనేక మంది నాయకులు. అయితే, డా.కే బాలగోపాల్‌ గారు తాను ఏ చట్టసభలోకి అడుగుబెట్టడానికి ప్రయత్నించ లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లామేకర్స్‌ గా గెలిచి వారి నాయకత్వానా నడిచే ప్రభుత్వాల జులుంను తన జీవితాంతం ప్రతిఘటించారాయన. దిక్కూమొక్కూ లేని వారని భావించే జనం కోసం మంచి గణితశాస్త్రవేత్త అయిన బాలగోపాల్‌ 40 ఏళ్లు దాటాక న్యాయశాస్త్రం చదివి వకీలయ్యారు. న్యాయస్థానాల్లో జనం కోసం వాదించారు. వీధుల్లో, జనారణ్యాల్లో పోరాటాలు మాత్రమే చాలవని నమ్మి బాలగోపాల్‌ చివరి సంవత్సరాల్లో నల్ల కోటేసుకుని కోర్టులకు పోవడం మాలాంటి సామాన్యులకు మొదట వింతగా కనిపించింది. ఇకపోతే బాలగోపాల్‌ తో నాకున్న చాలా తక్కువ పరిచయంలో కొన్ని సందర్భాలు గుర్తున్నాయి.

కోస్తా కాపులను యూపీ యాదవులతో ‘బాలన్న’ పోల్చిచెప్పడం అప్పుడు నచ్చలేదు!

బాలగోపాల్‌ సహచరి వేమన వసంత లక్ష్మి గారు 1980ల చివర్లో నాతోపాటు బెజవాడ ఉదయం దినపత్రికలో కలిసి పనిచేశారు. 1988లో అనుకుంటా.. బందరు రోడ్డు ఉదయం ఆఫీసు పక్క సందులో ఉన్న వసంత గారింటికి నేను వెళ్లాను. అక్కడ ఆమెతో నేను మాట్లాడుతుండగా..అప్పుడే స్నానం చేసి వచ్చిన బాలగోపాల్‌ గారికి నన్ను వసంత గారు పరిచయం చేశారు. సమకాలీన రాజకీయాలు, కులం వంటి అంశాలపై నాకు ఆసక్తి ఎక్కువ అని ఆయనకు చెప్పారామె. అప్పటికే ఆయన ఉద్యమ జీవితం వల్ల మంచి పేరుంది. నాకు గౌరవంతో కూడిన ఓ రకమైన జడుపు కూడా ఆయనపై ఉండేది. అయినా, ధైర్యం కూడదీసుకుని, ‘ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాజకీయాలను శ్రద్ధగా గమనిస్తున్నాను. యూపీ యాదవులు రాజకీయంగా ఎలాంటి వారు?’ అని బాలగోపాల్‌ ను అడిగాను. ‘యూపీ యాదవులు ఒకరకంగా సామాజిక ప్రవర్తనలో–కోస్తా కాపుల్లాంటి వారు,’ అని క్లుప్తంగా జవాబిచ్చారాయన. నాకేమో ఆయన ఇచ్చిన సమాధానం నచ్చలేదు. కాని, ఈ విషయంపై మరి కాస్త వివరణ ఇవ్వాలని ఆయనను కోరే ధైర్యం లేకపోయింది ఆ క్షణాన. మొదట ఆర్యసమాజిస్టులతో సంపర్కం, డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా వంటి సోషలిస్టులు, చౌధరీ చర ణ్‌ సింగ్‌ వంటి మహానేతల రాజకీయ సమీకరణలో భాగస్వాములు అయిన యాదవులు మొదట కొంత ‘హైందవీకరణ’కు కూడా గురి అయ్యారు. అక్కడి సర్కారీ జాబితాలో అవడానికి యాదవులు (అహీర్, గోలా, గ్వాలా ఇతర ఒరిజినల్‌ పేర్లు) ఓబీసీలేగాని రాజకీయ చైతన్యం విషయంలో ఆంధ్రా కాపులతో పోల్చితే బలిజ–తెలగ సోదరుల కన్నా చాలా చాలా ముందుంటారు. అలాంటిది అన్ని సామాజిక, రాజకీయాంశాలూ తెలిసిన బాలగోపాల్‌– యూపీ యావులను ఆంధ్రా కాపులతో పోల్చి, ఈ రెండు కులాల జనం సామాజిక ప్రవర్తన దాదాపు ఒకే తీరున ఉంటుందనడం 30 ఏళ్ల వయసులో నాకు అప్పుడు ఏ మాత్రం మింగుడు కాలేదు. ఇప్పుడు ఆరు పదుల ఆరేళ్లు నిండినాక… బాలగోపాల్‌ ఏక వాక్య వ్యాఖ్య భావం ఏమిటో చాలా వరకు అర్ధమైందనే అనుకుంటున్నా.

1986లో పత్రికా స్వాతంత్య్రంపై బాలగోపాల్‌ మాటలు గుర్తున్నాయ్‌..

1986 శీతాకాలానికి ముందు బెజవాడ దుర్గాకళామందిరం దగ్గరున్న విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ లో పత్రికా ‘స్వేచ్ఛ–యాజమాన్య స్వాతంత్య్రం’ అనే అంశంపై జరిగిన సదస్సులో బాలగోపాల్‌ ఓ రోజు సాయంత్రం ప్రసంగించారు. ఈ మీటింగుకు నాటి ఉదయం అసిస్టెంట్‌ ఎడిటర్‌ కొండుభట్ల రామచంద్రమూర్తి గారు, నా సీనియర్‌ కలీగ్‌ ఎంఏ ఖాదర్‌ మొహియుద్దీన్‌ గారితో కలిసి నేను కూడా హాజరయ్యాను. బాలన్న తన ప్రసంగం చివర్లో, ‘ఇటీవల ఓ ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌ ను సంస్థ యాజమాన్యం బలవంతంగా బయటకు పంపించిన సందర్భంలో ఈ పత్రికలో పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టులు ఏ మాత్రం తమ అసమ్మతిని గాని, అభ్యంతరాలను గాని నోటితోనో, రాత ద్వారానో చెప్పకపోవడం ఆందోళన కలిగించే విషయం,’ అని గంభీర స్వరంతో అన్నారు. ఆయన పేరు చెప్పకపోయినా…ఆయన ప్రస్తావించింది ఉదయం పత్రిక ఎడిటర్‌ అన్నే భవానీ కోటేశ్వర (ఏబీకే) ప్రసాద్‌ గారి గురించి.  దివంగత పెద్దలు దాసరి నారాయణరావు గారు చైర్మన్‌ గా, కొండపల్లి రామకృష్ణ ప్రసాద్‌ గారు మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఉదయం సంస్థను నడుపుతున్నారు అప్పుడు. యాజమాన్యం తన పనితీరుపై అసంతృప్తితో, అసమ్మతితో ఉందనే విషయం గమనించిన ఏబీకే ప్రసాద్‌ గారు 1986 ఏప్రిల్‌ లో ఉదయం సంపాదక పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలల్లో హైదరాబాద్‌ ఎడిషన్‌ ప్రారంభించే ఆంధ్రజ్యోతిలో ఏబీకే గారు అసోసియేట్‌ ఎడిటర్‌ గా చేరిపోయారు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని బాలగోపాల్‌ అలా తన ప్రసంగంలో మాట్లాడడం కె.రామచంద్రమూర్తి గారి మనసుకు బాధ కలిగించింది. మీటింగు పూర్తయ్యాక, బయటికి వచ్చి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మూర్తి గారు ఈ విషయం మా ఇద్దరితో  పంచుకున్నారు. వెంటనే, ‘‘ పౌర హక్కుల కార్యకర్తగా, బడుగు, బలహీన వర్గాల జనం క్షేమం కోసం, భద్రత కోసం కాపు కాసే ఉద్యమకారుడుగా బాలగోపాల్‌ అలా సభలో మాట్లాడారు. మనం బతుకుతున్న పరిస్థితుల్లో ఆయన కోరుకున్నట్టు మనం మన సంస్థల్లో ఎలా ప్రవర్తించగలం? జనం కోసమే ‘పౌర పోరాట మార్గం’ ఎంచుకున్న బాలగోపాల్‌ గారు ఆయన చెప్పినట్టు బతకగలరు. మనకెట్లా కుదురుతుంది?’’ అంటూ రామచంద్ర మూర్తిగారిలో ఆందోళనను, అశాంతిని తొలగించే ప్రయత్నం చేశారు ఖాదర్‌ గారు.

బాలగోపాల్‌ ‘అదృశ్యమైనప్పుడు’ డీటీ నాయక్‌ పీసీ వార్త రాయడానికి వెళ్లాను..

నా ‘పాత్రికేయ వృత్తిలో’ 60 శాతం డెస్కుల్లో, 40 శాతం జర్నిలిజం విద్యార్థులకు పాఠాలు చెప్పే పని చేసిన నాకు కేవలం నాలుగుసార్లే రిపోర్టురు పాత్రలో వార్తలు రాసే అవకాశం నేను ఎప్పటికీ మరవని మంచి జ్ఞాపకం. 1990కు ముందో, వెనకో తెలీదు కాని బాలగోపాల్‌ కలకత్తాకు బయల్దేరి ఎవరితోను సంబంధం లేకుండా అయ్యారు. ఏపీలో అప్పటి పరిస్థితుల్లో బాలగోపాల్‌ ను పోలీసులే శాశ్వతంగా మాయం చేసి ఉంటారనే అనుమానం పౌరహక్కుల కార్యకర్తలకేగాక, ప్రగతిశీల ప్రజాస్వామికవాదులందరికీ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనంలో అలజడి, అశాంతి వ్యక్తమయ్యాయి. కొద్ది రోజులకే బాలగోపాల్‌ తాను స్వేచ్ఛగానే ఉన్నానని కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులను కాంటాక్ట్‌ చేయలేకపోయానని ప్రకటించారు. ఆయన ప్రకటన వెలువడిన తర్వాత అప్పట్లో విజయవాడ నగర పోలిస్‌ సూపరింటిండెంట్‌ డీటీ నాయక్‌ తన ఆఫీసులో ప్రెస్‌ మీట్‌ పెడితే ఉదయం తరఫున నేను అక్కడి వెళ్లి వార్త రాశాను. అప్పటికే సీపీఐ ఎం.ఎల్‌ (పీపుల్స్‌ వార్‌) నక్సల్స్‌ ను తన తరహాలో ఖతం చేసిన పెద్ద పోలీసుగా నాయక్‌ గారికి మంచి పేరుంది. ఏపీలో మాత్రమే ఎస్టీ జాబితాలో ఉన్న కులంలో పుట్టిన నాయక్‌ ఆరోజు ఎంతో దూకుడుగా మాట్లాడారు. సీనియర్‌ రిపోర్టర్లు సైతం ‘సార్, సార్‌’ అనే రీతిలో నాయక్‌ ప్రసంగం పరుగులెత్తింది. ఆ తర్వాత బెజవాడలోనే బాలగోపాల్‌ ‘అదృశ్యం’ వ్యవహారం, జనంలో ఆందోళన విషయంపై జరిగిన పౌర హక్కుల సంఘం సమావేశానికి దిల్లీ నంచి పెద్ద లాయర్‌ నందితా హక్సర్‌ వచ్చారు. దాదాపు ఆరడుగుల ఎత్తు ఉన్నట్టు కనిపించే నందిత ఎవరో కాదు, ప్రధాని ఇందిరా గాంధీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా పనిచేసిన(1971–73) పరమేశ్వర్‌ నారాయణ్‌ (పీఎన్‌) హక్సర్‌ కూతురు. బాలగోపాల్‌ కారణంగా నేను బెజవాడలో నందితను చూడడం అదృష్టంగా భావించాను.

 

23 ఏళ్ల వయసులో మార్క్సిస్టు కాని బాలగోపాల్‌ మార్క్సిస్టులకే పాఠాలు చెప్పారు..

దేశంలో చీకటి రోజులుగా చరిత్రకెక్కిన ఎమర్జెన్సీ కాలంలో (1975–77) వరంగల్‌ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో (నాటి ఆర్యీసీ నేటి ఎనైటీ)లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న బాలగోపాల్‌ అప్పటికి మార్క్సిస్టు కాదు. కాని, తొలితరం విప్లవ విదార్థి నేత, సూరపనేని జనార్దన్‌ తో మంచి సాన్నిహిత్యం ఉన్న బాలగోపాల్‌ అప్పటికి మర్క్సిస్టును కాలేదని, ఎమర్జెన్సీ తర్వాత అత్యవసర పరిస్థితిలో జరిగిన దుర్మార్గాలు, ప్రధాని ఇందిరమ్మ రాజకీయ స్వభావం తెలిశాయని తర్వాత కొన్నేళ్లకు చెప్పారు. ఆరు పదులు నిండకుండానే ఈ లోకం విడిచిపోయిన బాలగోపాల్‌ కు నోబెల్‌ శాంతి బహుమతి కన్నా ఇంకా పెద్ద అవార్డు స్థాపించి, ఇప్పుడు ఇస్తే..ఆయన స్మృతికి కీడు చేసినట్టే అవుతుంది.