Sambashivarao:
జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు.
శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం కోసం పరితపిస్తారు . అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. దీనికి సమాధానం సాక్షాత్తూ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు.
పూర్వం క్రూరమైన మనసు కలిగిన ఓ బోయవాడు ఉండేవాడు. అతను రోజు వేటకి వెళ్లి జంతువులను వధించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజున ఎప్పటిలానే అడవికి వెళ్లిన అతడికి ఒక్క వణ్యప్రాణి కూడా కనిపించలేదు. పొద్దపోయే దాకా ఎదురుచూసినా ఫలితం దొరకపోవడంతో బోయావాడు తీవ్ర నిరాశతో ఇంటిదారి పట్టాడు. అతని దారి మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీటి కోసం సరస్సు దగ్గరికి వస్తే సంహరించవచ్చని భావించి అక్కడే ఉన్న ఓ చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. చెట్టుపైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు.
ఇంతలో అటుగా ఓ ఆడజింక నీటి కోసం వచ్చింది. ఇదే అదునుగా భావించిన బోయవాడు జింకను వేటాడలని నిర్ణయించాడు. అది గమనించిన ఆడజింక మానవ గొంతులో తనను వధించవద్దని ప్రాధేయపడింది. తనను చంపటం ధర్మంకాదంటూ, ప్రాణభిక్షణ పెట్టమని వేడుకుంది. ఎంతో క్రూరంగా ఉండే అతడి మనస్సు.. జింక మానవ భాషలో మాట్లాడేసరికి దానిని చంపకుండా వదిలేశాడు.
అలా రెండో జాము కూడా గడిచింది. ఎంతకీ వేట దొరకపోవడంతో నిరాశకు గురయ్యాడు. ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని కూడా చంపాలని అతడు భావించగా.. తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరికాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగివస్తానని వేడుకొంది. దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు.
ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. ఆ వేటగాడితో రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయాని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఓ సారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్లింది.
దానితో నాలుగో జాము కూడా గడిచింది. తరువాత రోజు సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన మూడు జింకలు తిటిగొస్తాయని వాటి కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు వేటగాడు.
ఇంతలో మరోక జింక.. దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని పలికి చెప్పి వెళ్లింది.
మరికొద్ది సేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది.
అతనికి తెలియకుండానే రాత్రంతా మారేడు చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆరోజున శివ నామస్మరణం కూడా చేశాడు. వేటకు కోసం తనకు అడ్డువచ్చిన మారేడు చెట్టు ఆకులు కోసి కిందపడేటం చేశాడు. ఆ చెట్టుకిందనే ఉన్న ఓ శివలింగంపై మారేడు దళాలు పడ్డాయి. దీంతో అతనికి తెలియకుండా మారేడు దళ పూజా ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు వేటగాడు కంటికి నిద్ర లేకుండా మెలకువతో ఉన్నాడు కాబట్టి అతని జాగరణ ఫలించింది.
శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా.. అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడు. జింకలు తమ సత్యనిష్ఠతో శివుని అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. ఇక ఆబోయావాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో పిలువబడుతున్నడు. అని ఈ కథను మహేశ్వరుడు పార్వతి దేవికి చెప్పాడు. అందుకే శివరాత్రి రోజు చేసే వ్రతం, జాగరణ ఎంతో విశిష్టమైనదని చెబుతారు. హిందూ ధర్మంలో మనిషికి ఏడు జన్మల అని నమ్ముతారు. ఎంత క్రూరుడైన శివరాత్రి రోజు జాగరన, శివ నామ పారాయణం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. శివ సన్నిధీకి చేరతారని భావిస్తారు.