తెలంగాణలో సర్వేల కోలాహలం .. నేతల్లో ఉత్కంఠ!

తెలంగాణలో సర్వేల కోలాహలం నడుస్తోంది.ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ బలబలాలను భేరిజు వేసుకుని ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీం..ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించి సర్వే నిర్వహించింది.మరోవైపు బీజేపీ సైతం అదే తరహాలో సర్వే నిర్వహించి..అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అటు అధికార టీఆర్ ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా అభ్యర్థుల పనితీరు.. ప్రభుత్వ సంక్షేమాల అమలుపై క్షేత్రస్థాయిలో సర్వే చేసిన పీకే టీం.. మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అటు పార్టీ అధిష్టానం సొంతంగా రెండు రకాల సర్వేలు చేస్తోంది. జిల్లాల అధ్యక్షుల సర్వే.. ఎమ్మేల్యేల ఆధ్వర్యంలో మరో సర్వే చేపట్టింది. ప్రభుత్వ పాలనతో పాటు.. కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం సేకరణ చేస్తోంది.

టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సర్వే ఈనెలఖరి వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.ఆగస్టు 15 లోగా పూర్తి నివేదికను ..అధిష్టానానికి అందజేసే అవకాశాలున్నాయి. సర్వే చేసిన సంస్థ వివరాలతో పాటు.. ఎలాంటి వాటికి తావివ్వకుండా శాంపిల్స్ వివరాలను స్పష్టంగా తెలియజేయాలని అధిష్టానం ఆదేశించడంతో పార్టీ నేతలంతా సర్వే హాడావుడిలో నిమగ్నమయ్యారు.

ఇక బీజేపీ నాయకత్వం సైతం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలను సేకరిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తునే.. అభ్యర్థుల ఎంపికపై వివరాలను ఆరా తీస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్..ఇప్పటికే పార్టీలో చేరికలతో పాటు వివిధ కమిటీలను నియమించి..పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడూతునే.. అసంతృప్త నేతల చేరికకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సర్వే చేపట్టి.. బలబలాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. విజయ సంకల్ప సభతో జోష్ మీదు కమలనాథులు.. ఎక్కడా తగ్గేదెలే తరహాలో దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాగిపోతున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ముందు నెయ్యి వెనక గొయ్యి మాదిరి తయారయ్యింది. ఆపార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నప్పటికీ..నేతల అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్,బీజేపీ ఢీ అంటే ఢీ తరహాలో దూసుకుపోతుంటే.. ఆపార్టీ నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు.అయితే పార్టీ అధినాయకత్వం మాత్రం.. సర్వే నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నేతలు భావిస్తున్నారు.

మొత్తంమీద ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సర్వేల హాడావుడి మొదలైంది. నివేదికలు అందిన తర్వాత క్రోడికరించి అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో తమకు టికెట్ వస్తుందో రాదో తెలియని ఉత్కంఠ నేతల్లో కనిపిస్తోంది