దేశంలో కరోనా థర్డ్ వేవ్ పై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. వైరస్ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. థర్డ్ వేవ్ పరిస్థితులును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
థర్డ్ వేవ్ వైరస్ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టామని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా పిల్లలకు వైరస్ సోకితే లక్షణాలు కనిపించవు. ఇన్‌ఫెక్షన్ సోకినా లక్షణాలు తక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు పిల్లల్లో వైరస్ సంక్రమణ అంత ప్రమాదకరంగా ఏమీ లేదు’ అని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. అయితే, ఒక్కోసారి వైరస్ స్వభావంలో మార్పులు సంభవిస్తే.. పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు.
ఎలాంటి పరిస్థితులను అయినా.. ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని వీకే పాల్ స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో.. పిల్లలో వైరస్ కేసులు పెరుగుతున్నాయని వస్తోన్న నివేదికలపై కేంద్ర ఆరోగ్యరంగ నిపుణులు దృష్టి సారించారు. చిన్నారుల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని రెండు విధాలుగా గుర్తించవచ్చని వివరించారు. కొందరిలో నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇక వైరస్ నుంచి కోలుకున్న చిన్నారుల్లో కొందరిలో రెండు, మూడు వారాల తర్వాత మల్టీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను గుర్తించామన్నారు. ఇన్‌ఫెక్షన్ సోకినప్పటికీ ప్రమాద తీవ్రత తక్కువేనని తెలిపారు. ఇలాంటి సమయంలో చిన్నారులు వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.