Ramana: ‘మిథునం’ పరిమళం మనసు దోచింది.. రమణ స్మృతిలో..!

సాయి వంశీ (విశీ): (ఒక కథ.. రెండు అద్భుతాలు ❤️❤️)

తెలుగు నేలంతా తెలిసిన కథ‌ శ్రీరమణ గారు రాసిన ‘మిథునం’. 1997లో ప్రచురితమై తెలుగు వారికి పంచిన పరిమళం గురించి ఎంత చెప్పినా తక్కువే! చదివినవారంతా బాగుందని వదిలేయకుండా మిగిలిన వారితో చదివించారు. ఆ రుచి అందరికీ పంచారు. బాపు అంతటి వారు చదివి.. ఆనందంతో స్వదస్తూరితో కథ రాశారు. 2012లో తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో చిత్రంగా రూపొంది ప్రేక్షకుల మనసు దోచింది.

అయితే ‘మిథునం’ కథ తెరపైకి తేవడంలో తొలి ఘనత మలయాళ పరిశ్రమ తీసుకుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు, రచయిత ఎం.టి.వాసుదేవనాయర్ ‘మిథునం’ గురించి తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బై, మలయాళంలో 2000 సంవత్సరంలో​ ‘ఒరు చెరు పుంచిరి(అర విరిసిన నవ్వు)’ పేరుతో సినిమా రూపొందించారు. తెలుగు కథకు దక్కిన విశేష గౌరవం అది. స్వతహాగా రచయిత అయిన వాసుదేవ నాయర్ మరో తెలుగు రచయితను సత్కరించిన తీరు అది. మిథునం కథ తెలుగుదే అయినా, దానిలోని​ అంశం విశ్వజనీనం అని నమ్మి తీసిన చిత్రం అది. ఆ తర్వాత 2012లో ‘మిథునం’ తెలుగు చిత్రం వచ్చింది.

తెలుగులో బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి గారు అప్పదాసు, బుచ్చిలక్ష్మి పాత్రలకు ఎంతగా ప్రాణ ప్రతిష్ట చేశారో, మలయాళంలో ఒడువిల్ ఉన్ని కృష్ణన్, నిర్మలా శ్రీనివాసన్ అంత అద్భుతంగా నటించారు. మలయాళంలో కథను తెరకెక్కించే క్రమంలో వాసుదేవ నాయర్ కథలో ఆ సంస్కృతికి తగ్గ మార్పులు చేశారు. తెలుగు మిథునం రెండు పాత్రలతో సాగితే, మలయాళంలో చాలా పాత్రలతో నడుస్తుంది.

తనికెళ్ల భరణి గారు మిథునం కేవలం భార్యాభర్తల అనుబంధాన్ని చూపించడంతో ఆపితే(మిథునం కథ ప్రధాన ఉద్దేశం అదే), వాసుదేవ నాయర్ తన చిత్రంలో భిన్న అంశాలను చర్చించారు. మతాంతర వివాహాలకు పెద్దల అంగీకారం, ఇరుగు పొరుగు వారి పట్ల అభిమానం, నగర జీవనంలో పెరుగుతున్న ఇబ్బందులు, ఒంటరి వృద్ధుల అవస్థలు.. ఇలా. ఇదొక్కటే రెండు చిత్రాల్లో ఉన్న ప్రధానమైన తేడా. ఆ పద్ధతిలో తెలుగు కన్నా మలయాళ చిత్రం మరింత మెరుగ్గా అనిపిస్తుంది.

అప్పదాసు(మలయాళ చిత్రంలో కృష్ణ కురుప్పు) తోట పని, బుచ్చిలక్ష్మి(మలయాళంలో అమ్మాలు కుట్టీ) వంటా వార్పు, వాళ్ల గిల్లికజ్జాలు, ఆటపాటలు, పిల్లలపై మమకారం.. అన్నీ మలయాళంలో కథ ప్రకారం చూపించారు. కథలో ‘ద్రాక్షారం సంబంధం’ అని బుచ్చిలక్ష్మి దెప్పిపొడిచే మాటను కూడా మలయాళంలో ‘ఆలూర్ సంబంధం’ అని వాడారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ గురించి. కథకు ప్రాణంగా నిలిచే ఆ అంశాన్ని రెండు భాషల్లోనూ అద్భుతంగా తెరకెక్కించారు. ఏ ప్రాంతమైనా స్త్రీ మనసు కోరుకునేది ఒకటే అని అర్థవంతంగా చూపించారు.

మిథునం సినిమా చూసిన వారు తప్పనిసరిగా కథ చదవండి. మలయాళ చిత్రం కూడా చూడండి. తెలుగు కథకు దక్కిన గౌరవాన్ని చూసి ఆనందించండి.