TripleTalaq: మూడుసార్లు తలాఖ్ అంటే.. మూడేళ్లు జైల్లోనే..!

Talaq:

హైదరాబాద్ నగరం టోలిచౌకికి చెందిన మంజూర్‌ అహ్మద్‌కు పెళ్లయ్యి 16 ఏళ్లు అయ్యింది. వారిది ప్రేమ వివాహం. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకొని అందరి అంగీకారంతో పెళ్లి చేశారు. ఇన్నేళ్లు బాగానే ఉన్న అతను ఉన్నట్లుండి మరో మహిళతో తిరగడం మొదలుపెట్టాడు. ఈ విషయం అతని భార్య గుర్తించింది. వారి మధ్య గొడవ జరిగింది. అలిగి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. నిన్న తన భర్తకు ఫోన్ చేసి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంది.

భర్త భగ్గుమన్నాడు. భార్య తనతో సర్దుకుపోవాలి గానీ, తనను ఎదురించి ప్రశ్నించడం ఏంటి అని మండిపోయాడు. ఆమెను చెడామడా తిట్టాడు. ఆమెకూడా అతని మీద తన కోపాన్ని చూపించింది. దీంతో అతనికి మరింత కోపం వచ్చి ‘తలాఖ్..తలాఖ్..తలాఖ్’ అని మూడుసార్లు చెప్పాడు. ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఫోన్‌ కట్‌ చేశాడు.

2019 కంటే ముందు పరిస్థితి ఎలా ఉండేదో కానీ, ఇప్పుడు ఆ స్థితి మారింది. ఆ విషయంలో కేంద్రాన్ని మెచ్చుకోవాలి. Muslim Women(Protection of Rights on Marriage) Act, 2019 అనేదాన్ని తీసుకురావడం వల్ల ముమ్మారు తలాఖ్ అనేది నేరంగా మారింది. దీంతో మంజూర్‌ అహ్మద్‌ భార్య ఏడుస్తూ కూర్చోకుండా పోలీసుల దగ్గరకు వెళ్లింది. ఆమె ఫిర్యాదుతో వారు అతనిపై కేసు నమోదు చేశారు.

ముమ్మారు తలాఖ్ చెప్పడం ద్వారా ఒక స్త్రీకి విడాకులు ఇవ్వడమనేది మానవహక్కులకు భంగం అని 2017లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ‘మా మతాచారాల్లో మీరు వేలు పెట్టొద్దు’ అని ముస్లిం మతపెద్దలు, కొందరు రాజకీయవేత్తలు తీవ్రంగానే స్పందించారు. వేలాది మంది ముస్లిం మహిళలు సైతం ఇదే రీతిలో ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత చూపించారు. అయితే అదే స్థాయిలో సానుకూలత కూడా వచ్చింది. ‘మీ సొంత కూతురికి మూడుసార్లు తలాఖ్ చెప్పి మీ అల్లుడు వదిలేస్తే మీరు ఊరుకుంటారా?’ అని కొందరు వారిని ప్రశ్నించారు. ఖురాన్‌లో ఎక్కడా ముమ్మారు తలాఖ్ ప్రస్తావన లేదని, ప్రపంచంలో చాలా ఇస్లాం సంస్థలు ట్రిపుల్ తలాఖ్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.

2019లో పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సైతం ఎంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. మైనారిటీల ఆచారాలపై ఎన్‌డీఏ పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శించాయి. అలా వారు చెప్పుకున్న కారణాలు వారికున్నాయి. కానీ లోక్‌సభలో మెజార్టీ ఉండటం ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది. అయితే రాజ్యసభలో తగిన మెజార్టీ లేకపోవడం వల్ల అక్కడ ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరకు బిల్లు పాసై, చట్టం అమల్లోకి వచ్చింది.

ఈ చట్టప్రకారం మాట, రాత, మెసేజ్, సైగ, వర్తమానం వంటి ఏ అంశాల ద్వారానైనా తలాఖ్ చెప్పి విడిపోవడం నేరం. ఇలా చేస్తే ఆ పురుషుడికి మూడేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తన భార్యతో విడిపోవాలంటే తప్పకుండా చట్టం ఏర్పరిచిన విధానాలు పాటించాలి. భార్య, పిల్లలకు తప్పకుండా భరణం, పోషణ ఖర్చులు ఇవ్వాలి. ప్రస్తుతం మన దేశంతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర 23 దేశాలు ట్రిపుల్ తలాఖ్ విధానానికి స్వస్తి పలికాయి. ఇప్పుడెవరైనా ఒకేసారి ట్రిపుల్ తలాఖ్ అంటే జైలుకే!

– విశీ(వి.సాయివంశీ)

You May Have Missed

Optimized by Optimole