ప్రధాని మోదీకి ఉగ్రముప్పు!

ఉగ్రమూకలు భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేశాయా? రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని పన్నాగం పన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రజాసముహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దేశంలోని మరో పెను బీభత్సానికి పతకం పన్నాయని తెలుస్తోంది. ఈసారి ఏకంగా దేశ ప్రధానినే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.

గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ సహా అందులో పాల్గొనే ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగుతాయని నిఘా వర్గాలకు సమచారం అందినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ కు చెందిన టెర్రరిస్టులు ఈ దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు నిఘా సంస్థలకు వచ్చిన అలర్ట్‌లో ఉన్నట్లు సమాచారం. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలు, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని తెలుస్తోంది. టెర్రరిస్టులు డ్రోన్లను ఉపయోగించి కూడా దాడులు చేసే అవకాశముందని నిఘా సంస్థలకు సమాచారం అందింది.

ఇక లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్ర సంస్థలు దాడులకు కుట్రలు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. దిల్లీతో పాటు పంజాబ్‌, ఇతర నగరాల్లోనూ ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ముఠాలు తమ బృందాలను పంజాబ్‌కు సమీపంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని సభపై ఈ ఉగ్రముఠా దాడులు చేసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

అటు ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈఏడాది గణతంత్ర వేడుకలకు కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాధినేతలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో భద్రతా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Optimized by Optimole