మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!

దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్‌ ఫంగస్‌ సైతం మరోసారి కలకలం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని జీఎస్‌వీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఒక కన్ను, ముక్కుకు బ్లాక్ ఫంగస్ వ్యాపించిందని, కరోనా థర్డ్‌వేవ్‌లో ఇదే తొలి కేసు అని తెలిపారు.

ఇక కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ బెంబేలెత్తించింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. ఫంగస్‌ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయారు. ఎన్నికల నేపథ్యంలో మరోసారి బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్.. తాజాగా మళ్లీ బ్లాక్ ఫంగస్‌ దడ పుట్టిస్తుండంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. వైద్య నిపుణలు మాత్రం.. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.