Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..

Bandisanjay: bandisanjay 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ విడత ప్రజాహిత యాత్ర  రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగుతోంది. యాత్రకు అడగుడగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సిరిసిల్ల నియోజక వర్గం గంభీరావు పేట, ముస్తాబాద్ మండలాల కేంద్రాలతోపాటు ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్థానికులతోపాటు కాషాయ సైన్యం అడుగులో అడుగు వేస్తూ సంజయ్ వెంట కదిలింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా సంజయ్ కు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని..మరోసారి ఎంపిగా తనను గెలిపించాలని సంజయ్ అభ్యర్ధించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిరిసిల్ల నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. పువ్వుకు ఓటేస్తే రాముడికి వేసినట్లే..500 ఏళ్ల నాటి కల నెరవేర్చిన మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని సంజయ్ పిలుపునిచ్చారు.

ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్.. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.కాళేశ్వరం  ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బ్రందం నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తరువాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం, క్రిష్ణా నీటి పంపకాల పేరుతో పరస్పరం దూషించుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని మాట ఎందుకు తప్పుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అటు ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి మహిళలూ, యువత ఇళ్ల ముందు వేచి చూశారు.ఆయన రాగానే కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు. భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లోని చిరు వ్యాపారులను, చేతి వృత్తి వారిని నేరుగా కలిసి యోగ క్షేమాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు వినతి పత్రం రూపంలో ఇచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సంజయ్ వారికి భరోసా కల్పించారు. ఇటు సంజయ్ యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ క్యాడర్ లో జోష్ కనిపిస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు యాత్ర బూస్టప్ లాంటిందని కాషాయ సైనికులు అభిప్రాయ పడుతున్నారు.

 

Optimized by Optimole