జల వివాదం పై రంగంలోకి కేంద్ర జల్ శక్తి శాఖ!

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం జరుగుతున్న క్రమంలో… కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్ను కూడా జారీ చేసింది. మరీ జల్శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదా పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుంచి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయని జల్శక్తి శాఖ తేల్చిచెప్పింది. అంతే కాక గెజిట్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ స్వాగతించగ.. తెలంగాణసర్కార్ మాత్రం నదీ జలాల అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేయటంతో పాటు గెజిట్పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా నడుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. కొంత కాలం కిందట ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపొతల పథకం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమని.. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లెవనేత్తితే.. కాదు.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. సీమ జిల్లాలను సస్యశామలం చేయాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యమని తేల్చిచెబుతోంది. దీంతో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వము కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించటంతో పాటు వెంటనే ఆపేయాలని కోరింది.
కాగా ఏపీ ప్రభుత్వం.. రాయలసీమ ఎత్తిపోతలు ఒక్కటే కాకుండా, ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించాలని కృష్ణా బోర్డుని కోరింది. ఈ పరిశీలనపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలు రాసింది.
ఇక ఇరు రాష్ట్రాల మధ్య జలగజగడం నడుస్తున్నతరుణంలో .. శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తిని కొనసాగించటం కొత్త వివాదానికి దారి తీసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. విద్యుదుత్పత్తిని చేపట్టడం సరికాదంటూ ఏపీ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై జగన్ సర్కార్ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రికి లేఖలు రాసింది.

రంగంలోకి కేంద్ర జల్ శక్తి శాఖ..
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతున్న తరుణంలో కేంద్ర జల్శక్తిశాఖ.. రంగంలోకి దిగింది. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై 71 ప్రాజెక్టులూ.. ఆయా బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయని పేర్కొంటూ గెజిట్ను విడుదల చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయని స్పష్టం చేసింది. వచ్చే అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్‌ మనీ కింద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా.. వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని తెలిపింది.
గెజిట్ పై ఏపీ సంతృప్తి .. తెలంగాణ అసంతృప్తి..

కేంద్ర జల్శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ ను ఏపీ సర్కార్ సంతృప్తిని వ్యక్తం చేసింది. జలవనరుల శాఖ గెజిట్ను స్వాగతిస్తున్నామని ఆ శాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. కాగా తెలంగాణసర్కార్ మాత్రం నదీ జలాల అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేయటంతో పాటు గెజిట్పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.