తెలంగాణ లో భాజపా ఆట మొదలుపెడితే అధికార తెరాసకు దిమ్మతిరగడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెరాస విమర్శలు చేస్తే చేతులు కూర్చోబోమని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని కొన్నట్టు కేసీఆర్ అండ్ కో వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఏ రాజ్యాంగ ప్రకారం తెలంగాణ యంత్రాన్ని శాసిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మజ్లిస్ పార్టీతో తెరాస కుమ్మక్కై మత కలహాలు సృష్టిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. కలహాలకు కారణమైన మజ్లీస్ నేతలపై కేసులు పెట్టకుండా అధికార పార్టీ పోలీసులు చేతులు కట్టేసింది. రాష్ట్రంలో మత కలహాలు జరగడం రెండోసారి. నాలుగు నెలల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడి చేస్తే నాలుగు రోజుల పాటు కేసు పెట్టకుండా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.