యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి!

స్వయంభు పంచ నారసింహుడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఇప్పటికే ప్రముఖుల ఆహ్వానాలు పంపారు. యాత్ర జనుల సౌకర్యార్థం మంచి నీరు తదితర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సువర్ణ ప్రతిష్ట అలంకార కవచమూర్తులు కొలువైన బాల్ ఆలయంలో విద్యుద్దీపాలంకరణ, తోరణాలతో పాటు వివిధ రకాల పూలతో ఆలయాన్ని అలంకరిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న ప్రధానాలయ ఉద్ఘాటన జరగనందుకు పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారం, బాల్ ఆలయంలో ఉత్సవాలు జరగనున్నాయి.

యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం నుంచి పదకొండు రోజులపాటు భక్తులు స్వామిని దర్శించుకుని నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు దేవస్థాన అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రిషుడికి సమర్పించే పట్టు వస్త్రాలను భూదాన్ పోచంపల్లి లో పద్మశాలి యువజన సంఘం తయారు చేస్తుండగా వాటిని ఆలయ ఈవో గీతారెడ్డి శనివారం పరిశీలించారు.