Kollywood: ‘సంపాదన ఉంటేనే మనకు మర్యాద’.. హీరోయిన్ అనుభవం..!

Kollywood :

శ్రీలేఖ ప్రఖ్యాత తమిళ నటి, డబ్బింగ్ కళాకారిణి, డబ్బింగ్ సహ రచయిత్రి. తమిళంలో అనేకమంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించారు. శ్రీలేఖగా ఉన్న ఆమె నాటక నటుడు, డబ్బింగ్ కళాకారుడు రాజేంద్రన్‌ని పెళ్లి చేసుకుని శ్రీలేఖ రాజేంద్రన్ అయ్యారు. తన జీవితంలో పెళ్లి, దాని అనంతర పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి..

మా ఆయన రాజేంద్రన్‌కు, నాకు పరిచయం విచిత్రంగా జరిగింది. నేను నాటకాల్లో నటిస్తున్నప్పుడు ఆయన కూడా నాటకాల్లో నటించేవారు. అప్పుడప్పుడూ కలిసి పలకరించుకోవడం తప్ప వేరే మాటలేవీ లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత నా నాటకరంగ స్నేహితులు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. వారితోపాటు ఆయన కూడా వచ్చారు. అందరూ వెళ్లిపోతున్న టైంలో నేను ఆయన్ని పిలిచి ‘అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉండండి’ అన్నాను. అలా ఎందుకున్నానో నాకు నిజంగా తెలియదు.

ఆ తర్వాత ఆయన మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. మా నాన్న ఉన్నకాలంలో నేను సంపాదించినదంతా అమ్మకే ఇచ్చేదాన్ని. నాకోసం ఏమీ దాచుకునేదాన్ని కాదు. ఇల్లు కూడా నేను కొన్నదే. మా నాన్న చనిపోయాక మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. నేను నాటకాలు, సినిమాల్లో నటిస్తూ ఉన్నా, వచ్చేది సరిపోయేది కాదు. మా నాన్న చాలామందికి అప్పులిచ్చారు. వాటిని వసూలు చేసుకోవాలంటే నేరుగా వెళ్లాలి. అమ్మ, అమ్మమ్మ వెళ్లలేరు. ఇంటికి నేనే పెద్దదాన్ని. కానీ అమ్మ నన్ను పంపదు. నా తర్వాత తమ్ముడు, చెల్లెలు చిన్నవాళ్లు. వాళ్లకేమీ తెలియదు. ఎలా అని అనుకుంటూ ఉండగా, రాజేంద్రన్ వచ్చి ‘ఆ వివరాలు నాకు చెప్పండి. నేను వసూలు చేసుకొస్తాను’ అన్నారు.

ఆయనది చాలా పేద కుటుంబం. అమ్మ మాత్రమే ఉంది. అప్పటికి ఆయనకు ఉద్యోగం లేదు. వచ్చిన ఉద్యోగాలు కూడా నాటకాల కోసం వదిలేసుకుని చెన్నైలో ఉంటున్నారు. మా అమ్మను ఆయన ‘అక్కా’ అని పిలిచేవారు. సరే అని మా అమ్మ ఆయనకు అన్ని వివరాలూ చెప్పింది. ఆయన వెళ్లి అందరి దగ్గరా డబ్బు వసూలు చేసుకొని వచ్చారు. మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఇలాంటి వ్యక్తినే నాకిచ్చి పెళ్లి చేసి, ఇంట్లోనే అల్లుడిగా పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని అమ్మ, అమ్మమ్మ అనుకున్నారు. మా ఇద్దరికీ ఆ ఆలోచనే లేదు. మొత్తానికి పెద్దలు మమ్మల్ని ఒప్పించి పెళ్లి చేశారు.

పెళ్లయ్యాక మా ఇద్దరికీ ఇబ్బందులు మొదలయ్యాయి. నాకు నాటకాలు, సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. ఆయనకు ఏ ఆదాయమూ లేదు. అప్పుడప్పుడూ వచ్చింది ఏదో బొటాబొటీగా సరిపోతోంది. దీంతో మా అమ్మకు విసుగు మొదలైంది. మా ఆయన వల్లే నాకొచ్చే అవకాశాలు, డబ్బు పోయాయని అనుకోవడం మొదలుపెట్టింది. మెల్లగా ఆయన్ని మాటలనడం, అవమానించడం మొదలుపెట్టింది. నన్ను ఎన్ని మాటలన్నా నేను తీసుకోగలను. కానీ నా భర్తను మాటలంటూ ఉంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. అయినా భరించాను. అవన్నీ చూసి మా అమ్మను అమ్మమ్మ తిట్టేది. అయినా అమ్మ మారలేదు.

మాకు సంపాదన లేకపోవడం వల్ల నా పుట్టింట్లో నాకు తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఆయనే ఉదయం నాకు వడ, పొంగల్ తీసుకొచ్చేవారు. ఉదయం, మధ్యాహ్నం అదే తిని, రాత్రి బ్రెడ్ తెచ్చుకుని తిని కడుపు నింపుకునేవాళ్లం. అది చూసి మా అమ్మమ్మ బాధపడేది. ఓసారి అమ్మమ్మ చెప్పిందని, స్టవ్ వెలిగించి కూర చేశాను. కాసేపటికే మా అమ్మ వచ్చి, గ్యాస్ సిలిండర్ డబ్బులు అడిగింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. సిలిండర్ గ్యాస్ వాడుకున్నందుకు డబ్బులు కట్టమని గట్టిగా అడిగింది. చేతిలో ఉన్న డబ్బులు తనకు ఇచ్చేశాను. సినిమాల్లో ఉన్నాను కాబట్టి, ప్రొడక్షన్ కంపెనీల నుంచి నాకు ఫోన్లు వస్తాయి. కానీ ఇంట్లో ఫోన్ తను వాడటం లేదని, దాని బిల్లు నన్నే కట్టమంది అమ్మ. నా దగ్గర డబ్బు లేదనేసరికి ఫోన్ కనెక్షన్ తీసేయించింది.

ఇవన్నీ చూసి మా ఆయన చాలా బాధపడేవారు. ‘నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నీకు ఇన్ని కష్టాలు’ అని అనేవారు. నేను ఆయనను ఓదార్చేదాన్ని. చెడ్డ రోజులు పోయి, మంచి రోజులు వస్తాయని చెప్పేదాన్ని. ఇక ఇంట్లో ఉంటే ఈ ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయని అనిపించింది. వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. బయటికి వెళ్తే ఎలా బతకాలని, నిన్ను ఎలా చూసుకోవాలని ఆయన చాలా భయపడ్డారు. అడ్డుక్కొని అయినా బతుకుదాం అని ఆయనకు నేను ధైర్యం చెప్పాను. వచ్చేటప్పుడు బట్టలు, నాటకాల్లో నేను సాధించిన కప్పులు, షీల్డులు మాత్రం తీసుకున్నాను. ఆ తర్వాత రోజే ఊటీలో ఓ నాటకానికి మేం వెళ్లాలి. బయటికి వచ్చేశాం. ఇప్పుడేం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు.

తెలిసినవారి ఇంట్లో కప్పులు, షీల్డులు పెట్టి, నాటకానికి వెళ్లి చెన్నైకి వచ్చేశాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి, ఎలా ఉండాలి అని ఆలోచించి, చివరకు డబ్బింగ్ ఆర్టిస్టు రాజేశ్వరి, వాళ్లాయన ప్రభాకర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ల ఇంటికి రమ్మని పిలిచారు. వాళ్ల ఇంట్లోనే మమ్మల్ని మూడు నెలలు పెట్టుకున్నారు. ఆ సమయంలో నాకు పెద్దగా సినిమా, డబ్బింగ్ అవకాశాలు లేవు. మా ఆయనకు కూడా ఏ పనీ లేదు. మా భోజనం కూడా రాజేశ్వరి, ప్రభాకర్‌ దంపతులే చూసుకున్నారు. దీంతో ఆయన కొంచెం మొహమాట పడి, పొద్దున్నే బయటకు వెళ్లిపోయి, రాత్రికి వచ్చేవారు. వాళ్లు ఈ విషయం గమనించి, ఆయన్ని మందలించారు.

ఆ తర్వాత, అదే కాలనీలో ఓ చిన్న ఇల్లు చూశాం. నెలకు రూ.350 అద్దె. అందులో చేరాం. చేతిలో డబ్బు లేదు. అవకాశాలు కూడా అంతంతే. కానీ ఆ ఇంటి ఓనర్ ఏ రోజూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. డబ్బులివ్వండి అని దబాయించలేదు. ఒక్కోసారి మూడు, నాలుగు నెలలు అద్దె కట్టకపోయినా మొత్తం కలిపి ఒకేసారి కట్టొచ్చులే అనేవారు. అలా మంచి మనుషులంతా మాకు దొరికారు. అదే సమయంలో మా ఆయనకు కూడా డబ్బింగ్ అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత మెల్లగా నిలదొక్కుకున్నాం. కొన్నాళ్లకి అమ్మ మళ్లీ మమ్మల్ని పిలిపించి, నాకు రావాల్సిన డబ్బు, నగలన్నీ ఇచ్చి, మళ్లీ మాతో మామూలుగా ఉండటం మొదలుపెట్టింది. ఈ విషయంలో ఆమె తప్పు ఉందని చెప్పలేం. భర్త పోయాడు. కూతురికి సంపాదన లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియని స్థితిలో ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చు. అంతే!

మా పెళ్లయ్యాక మేం తొలి సంక్రాంతి, తొలి దీపావళి లాంటివేవీ చేసుకోలేదు. మా పెళ్లయిన కొత్తలో మాకంటూ మిగిలిన ఆనందకరమైన విషయాలేవీ లేవు. అన్నీ ఇబ్బందులే. కానీ వాటన్నింటినీ తుడిచేసేలా మా ఆయన నాకు తోడుగా నిలిచారు. నాకు ఏ చిన్న అవకాశం వచ్చినా, ఎక్కడ గుర్తింపు లభించినా నాకన్నా ఎక్కువ సంతోషపడతారు. నాటకాల రోజుల నుంచి ఈరోజు దాకా నన్ను ఆయన ‘రండి’, ‘వెళ్లండి’ అని మర్యాదతోనే పిలుస్తున్నారు.

* * *

విశీ(వి.సాయివంశీ)

Optimized by Optimole