హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది?

ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు మంగళం పాడారు. పాలకపక్షం బీజేపీకి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధమైనట్లు పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే సంచలన రిపోర్టు బయటపెట్టింది.ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలే అధిక సంఖ్యాకులైనప్పటికీ సుదీర్ఘ కాలంగా రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులే ఇక్కడి రాజకీయాల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొని శాసిస్తుంటారన్నది జగమెరిగిన సత్యం.పార్టీ ఏదైనా ముఖ్యమంత్రులు ఆయా వర్గాల నుండే ఎంపిక అవుతున్నారు.ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆసంప్రదాయం కొనసాగనున్నట్లు పీపుల్స్ మూడ్ సర్వే స్పష్టం చేసింది.

కమలానికి అంతర్గత విభేదాల బెడద..

బిజెపికి అన్ని నియోజకవర్గాల్లో, వివిధ స్థాయిల్లో నాయకుల, కార్యకర్తలు శ్రేణులుండటం సానుకూలాంశం. ముఖ్యమంత్రిగా జైరామ్‌ ఠాకూర్‌కు మంచి పేరుండటం, ఆయన పదవీ కాలం పెద్ద వివాదాలేమీ లేకుండా గడచిపోవడం ఈ ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూర్చే అంశమే. రాష్ట్రం మొత్తమ్మీద ప్రభావం చూపగలిగిన ప్రత్యర్థి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీరభద్రసింగ్‌, జీఎస్‌ బాలీ మరణం వల్ల ఏర్పడ్డ ఖాళీ ఇంకా అలాగే ఉండటం బీజేపీకి లాభించేదే. దానికి తోడు, పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇటీవలే, పార్టీ వరుసగా రెండో సారి అధికారం దక్కించుకోవడం పార్టీ శ్రేణులకు నైతిక బలం. నిరుద్యోగ సమస్య, ఉద్యోగస్థులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ పునరుద్దరణ హామీ నెరవేర్చకపోవడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకపోవడం వంటివి అధికార బిజెపి పార్టీకి ప్రతికూలాంశాలు. పార్టీ అంతర్గత విబేధాలు, ముఖ్యంగా జైరామ్‌ ఠాకూర్‌, పి.కె.ధూమల్‌ వర్గాల మధ్య పోరు వంటివి బిజెపి పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నాయి.

చెక్కుచెదరని కాంగ్రెస్ వ్యవస్థ…

హిమాచల్‌లో కాంగ్రెస్‌ పార్టీకీ కలిసి వచ్చే పలు సానుకూలాంశాలున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జనావాసంలోనూ పార్టీ పాదముద్రలుండటం, ఇప్పటికీ చెక్కుచెదరని కార్యకర్తల వ్యవస్థ కాంగ్రెస్‌కు బలం. ప్రతిసారీ విపక్షానికి పట్టం గట్టే రాష్ట్ర ఓటర్ల మనస్తత్వం ‘ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్‌దే’ అనే చర్చకు దారితీస్తోంది. పైగా 2021లో ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో అంతటా కాంగ్రెస్‌ గెలవటం ఆ పార్టీకి పెద్ద బూస్టింగ్‌ లాంటిదే. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీనియర్‌ నేతలు లేకపోవడం, ఇటీవలి ఎన్నికల్లో ఒక రాష్ట్రంలోనైనా గెలువకపోవడం వంటివి పార్టీ శ్రేణుల నైతిక స్థయిర్యాన్ని బాగా కృంగదీస్తోంది. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి ప్రతిభాసింగ్‌కు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వకపోవడం తదితర అంశాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆమ్‌ఆద్మీ పార్టీ విస్తరణ కూడా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ విజయావకాశాలను ఎంతో కొంత గండికొట్టేదే కావడం పార్టీకి ప్రతికూలాంశం.

68 అసెంబ్లీ నియోజకవర్గాలకు అన్నీ రాజకీయపార్టీల అభ్యర్థులు ఖరారై, అన్ని ప్రధాన పక్షాల ప్రచారాస్త్రాలన్నీ బయటకు తీసి, తమ తమ ఎత్తుగడలతో పోటీదారులు బరిలో నిలిచాక వాస్తవిక రాజకీయ చిత్రం క్రమంగా ఆవిష్కృతం అవుతోంది. పోలింగ్‌ తదనంతర పరిణామాల్లోనూ, ప్రభావాలు ఏవో మరింత స్పష్టత వస్తుంది. పోల్‌ అనంతరం పోస్ట్‌పోల్‌ సర్వే నిర్వహించి, ఫలితాలను, అందుకు కారణమైన అంశాలను లోతుగా ‘పీపుల్స్‌ పల్స్‌’ సంస్థ విశ్లేషించనుంది.