Nancharaiah merugumala senior journalist:
చంద్రబాబుకు ‘అనారోగ్య’ కారణాలపై బెయిలు–అని ‘ఈనాడు, జ్యోతి’ చెబుతుంటే…‘ఆరోగ్య’ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిలు మంజూరైందని ‘సాక్షి’ వెల్లడించింది!ఒక్కో కులం పత్రిక ఒక్కో రకంగా చెబితే మామూలు తెలుగోళ్లు ఏమైపోవాలి?
గత 52 రోజులుగా రాజమహేంద్రి జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిందని ఆంధ్రా మూలాలున్న మూడు తెలుగు దినపత్రికల వెబ్‌సైట్లు తెలిపాయి. అయితే, రెండు ‘వ్యవసాయధారిత’ కులాలకు చెందిన యాజమానులు నడిపే ఈ మీడియా సంస్థలు బెయిలుకు కారణాలను రెండు రకాలుగా చెప్పాయి. చంద్రబాబుకు ‘అనారోగ్య’ కారణాల రీత్యా ఏపీ హైకోర్టు జడ్జీ తల్లాప్రగడ మల్లికార్జునరావు నాలుగు వారాల మధ్యంతర బెయిలు ఇచ్చారని ఈనాడు, ఆంధ్రజ్యోతి చెబుతుంటే, సాక్షి దినపత్రిక మాత్రం ‘ఆరోగ్య’ కారణాలపై బాబుకు బెయిలు మంజూరైందని తెలిపింది. కోర్టు లేదా న్యాయ వ్యవహారాలపై తలా ఒక తీరున వార్తను రాసి పాఠకులను తమ పద్ధతిలో ప్రభావితం చేసే అలవాటు మొదట్నించీ తెలుగు దినపత్రికలకు ఉంది. అందుకే, చంద్రబాబు గారికి అసలు ఏ కారణాల వల్ల బెయిలు లభించిందో తెలుసుకుందామని ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్‌లు చూస్తే–‘మెడికల్ / హెల్త్ గ్రౌండ్స్ (Medical/health grounds) పై బెయిలు గ్రాంటయిందని రాశారు. మరి 73 ఏళ్ల ఆరు నెలల వయసులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిలు వచ్చింది ఆరోగ్య కారణాలపైనా లేక అనారోగ్య కారణాల రీత్యా ఇచ్చారా? అనే అనుమానం నాలాంటి తెలుగు జర్నలిజం ‘నేపథ్యం’ ఉన్న వారికే కాదు, మామూలు పత్రికల చదువర్లకూ వస్తుంది. మెడికల్ లేదా హెల్త్ అనే మాటలు ఇలాంటి సందర్భాల్లో కోర్టుల్లో వాడినప్పుడు తెలుగు మీడియాలో ఈ పదాలకు ఆరోగ్యమనాలా? అనారోగ్యమనాలా? ఇప్పటికైనా తెలుగు పాత్రికేయ పండితులు ఈ విషయం తేలిస్తే బాగుంటుంది. నూరేళ్ల క్రితం ఇంగ్లిష్ కన్నా సంస్కతం బాగా తెలిసిన తెలుగు బ్రాహ్మణులు ఎక్కువ మందితో మొదలైన తెలుగు పత్రికల్లోనే అసలు లోపం లేదా దోషం ఉందని కొందరు భాషాశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాపీ ధర్మారావు గారు (1887–1973), నార్ల వెంకటేశ్వరరావు గారు (1908–1985) వంటి కాపు, కమ్మ కుటుంబ నేపథ్యం ఉన్న ప్రఖ్యాత తెలుగు జర్నలిస్టులు కూడా పత్రికల్లో రాసే తెలుగును చక్కటి దారిలో నడిపించలేకపోవడం తెలుగోళ్ల దురదృష్టం. తెలుగు పత్రికల్లోగాని, తెలుగు న్యూజ్ టెలివిజన్ చానళ్లలో గాని పాత్రికేయులు వాడే తెలుగు– మనం రోజూ మాట్లాడే తెలుగుకు పోలిక లేకుండా, చాలా తేడాగా ఉండడానికి తొలి తరం తెలుగు బ్రాహ్మణ పాత్రికేయుల అనారోగ్య కారణాలు, శూద్ర జర్నలిస్టుల ఆరోగ్య కారణాలూ ఎంతో కొంత దోహదం చేశాయనే అనుమానం వస్తోంది.
ఫర్టిలిటీ సెంటరా? ఇన్ ఫర్టిలిటీ సెంటరా?
మెడికల్ లేదా హెల్త్ గ్రౌండ్స్ అనే ఇంగ్లిష్ పదాలు వచ్చినప్పుడు ఆరోగ్యమా? అనారోగ్యమా? అనే గందరగోళం తెలుగు జర్నలిస్టులను పీడిస్తున్నట్టే– ఇటీవల బాగా డబ్బు సంపాదించే ఒక రకం వైద్యులకు కూడా ఇలాంటి సమస్య ఒకటి ఉన్నట్టు కనిపిస్తోంది. పాతికేళ్ల క్రితం పిల్లలు పుట్టకపోతే జనం చుట్టాల పిల్లల్నో, ఇతరుల సంతానాన్నో తీసుకొచ్చి పెంచుకునే వారు. ఇప్పుడు తమ ‘రక్తం పంచుకుని పుట్టిన’ పిల్లలే కావాలని అత్యధిక జంటలు కోరుకుంటున్నాయి. పిల్లలు కనడంలో ‘ఆరోగ్య లేదా అనారోగ్య’ సమస్యలున్న కొందరు దంపతులకు సంతాన సాఫల్యం కోసం ఐవీఎఫ్ సెంటర్లు ఇప్పుడు అన్ని చోట్లా చక్కగా నడుస్తున్నాయి. ఈ ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్–శరీరం వెలుపల సాఫల్యం) కేంద్రాలకే మరో రెండు రకాల ఇంగ్లిష్ పేర్లున్నాయి. సాధారణ ప్రజానీకానికి ఐవీఎఫ్ అంటే అంత బాగా అతుక్కోదు కాబట్టి–ఫర్టిలిటీ సెంటర్ లేదా ఇన్ ఫర్టిలిటీ సెంటర్–ఇలా రెండు రకాలుగా తమ ఆస్పత్రులకు పేర్లు రాస్తున్నారు. పైన చెప్పినట్టు ఏది ఆరోగ్యమో, ఏది అనారోగ్యమో తెలియని గందరగోళం ఉన్నట్టే సంతాన సాఫల్య కేంద్రాల వైద్యులు కూడా ఫర్టిలిటీ, ఇన్ ఫర్టిలిటీ (Fertility/Infertility) అనే రెండు పరస్పర విరుద్ధమైన అర్ధాలు ఇచ్చే పదాలను ఒకే విధమైన సేవల కేంద్రాలకు వాడేస్తున్నారు.