MakaraSankranti: మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే?

Sankranti2024:  సంక్రాంతి పండుగలో రెండవ రోజుకు మకర సంక్రాంతి అని పేరు. ఇది అపూర్వ పుణ్యకాలం. సూర్యుడు మేషం  మెుదలుకుని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రమణం నాడు దర్భాసనంపై కూర్చుని దేవతారాధన చేసిన వాడు జన్మ జన్మల దారిద్ర్యము నుండి విముక్తి పొందుతాడు. 

సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పవిత్ర దివసం. ఈనాడు గుమ్మడికాయను దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశాభివృద్ధి అవుతుంది. సంక్రాంతి నాడు గోపూజ చేయడం చాలా మంచిది. నారాయణుడు నారదుని ద్వారా ఈ విషయాలను భూలోకంలో ప్రచారం చేయించాడు. ఈ విషయాలను ఆచరణలో పెట్టినవారిని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించి, సంపన్నులను చేయడం మెుదలు పెట్టింది. ఆనాటి నుండి శ్రీ లక్ష్మికి “పౌష్యలక్ష్మి” అనే పేరు వచ్చింది. 

సంక్రాంతి పురాణ గాథ(బ్రహ్మ వైవర్త పురాణం)

పూర్వకాలంలో ఒక ఆవిడ చాలా కాలం పాటు దాదాపు 40సంవత్సరముల పాటు కటిక దారిద్ర్యము అనుభవించింది. ఈ దారిద్ర్యము నుండి బయట పడటానికి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉన్నది. అదృష్టవశాత్తూ అగస్త్య మహర్షి వచ్చాడు. అప్పుడు అతనిని చూసి కాళ్ళు పట్టుకుని “నేను నలభై ఏళ్ళ వయసులోకి అడుగు పెట్టాను. ఇప్పటివరకు దారిద్ర్యము అనుభవిస్తున్నాను. సంపదలు రావాలంటే ఏమి చెయ్యాలండి?” అని అడిగింది. అందుకు అగస్త్యుడు సంక్రాంతి నాడు స్నానం చేసి దర్భలతో తయారుచేసిన చాప మీద కూర్చుని, లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవికి చెరకుగడలు, పానకము ఈ రెండూ నైవేద్యంగా పెట్టి, తామర పువ్వులతో పూజించు, నీ దారిద్ర్యము  పోతుంది అన్నాడు. ఆవిడ అలాగే చేసింది. అమ్మ ప్రత్యక్షమై ఈ సంక్రాంతి నాడు నేను పౌష్యలక్ష్మి అనే పేరుతో తిరుగుతూ ఉంటాను. ఈ సమయంలో నన్ను పూజించావు, కనుక నీ దారిద్ర్యము తొలగించి సంపదలు కలిగిస్తున్నాను అన్నది. 

ఇతిహాస కథ:

మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో  ఒక కథ ఉన్నది. ఒకప్పుడు శ్రీమహాలక్ష్మీదేవి భూలోకమంతా తిరుగుతూ చివరికి ఇంటికి వెళ్లి ఎవరిని అనుగ్రహించాలని చూసింది. కానీ ఆమెకు ఏ గృహము నచ్చలేదు. ఆ తల్లి ఒక గోశాల వద్దకు వెళ్ళింది. లోనికి వెళ్ళబోయింది. అప్పుడు గోవులు మీరెవరు? అని ప్రశ్నించాయి. తాను విష్ణుపత్ని అని వివరించింది. అయితే మా గోశాల లోపలికి నీవు రావద్దని గోవులు అన్నాయి. లక్ష్మీదేవి తెల్లబోయింది. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి. నీవు చంచలత్వం గల దానివి. ఎక్కడా స్థిరంగా ఉండవు. పైగా నీ గృహములో సంపదలలో నివసిస్తావు. అందువల్లనే మా గృహములోకి రావద్దు అన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి గోవులతో ఇలా అన్నది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోకులంలో రాధతో గోవుల తిరస్కారానికి గురయిన వారికి ముఖ్యంగా దేవతలకు పూజార్హత ఉండదు అని అన్నాడు. ఇప్పుడు మీరేమో నన్ను వద్దంటున్నారు అనగా గోవులు లక్ష్మీదేవికి వినయంతో నమస్కరించి ఇలా అన్నాయి. అమ్మా! నువ్వు జగదంబవి. నీకు పూజార్హత ఇచ్చే శక్తి మాకెక్కడిది? మేము త్వరపడి రావద్దు అన్నందుకు మమ్మల్ని క్షమించు, నీ కోరికలను మన్నిస్తూ ఉన్నాము. ఈ నాటి నుండి మా మూత్రములలో, పేడలో, పాలల్లో, గిట్టల్లో నుండి వచ్చే ధూళిలో మా శరీరంలో నీవు నివసించు. మమ్ము పూజించే వారికి సంపదలు అందించు, అన్నాయి. ఆనాటి నుండి శ్రీ లక్ష్మీదేవి గోవులు ప్రసాదించిన ఆ శరీర ప్రదేశాల్లో, గోవుల మూత్రము, గోమయములలో నివసించడం మెుదలుపెట్టింది. గో–లక్ష్మీ  సంవాదం జరిగిన పవిత్ర దినం మకర సంక్రమణ దినం. అందువల్లనే మకర సంక్రాంతి  లక్ష్మీకాలంగా ప్రసిద్ధికెక్కింది. ప్రజలతో ఒకసారి లక్ష్మీదేవి ఇలా అన్నది, “గోవులు మకరసంక్రమణం నాడు నాకు వరాలిచ్చాయి. కనుక నాకు సంక్రాంతి అంటే ఇష్టం. సంక్రాంతి నాడు గోపూజ చేసిన వారిని, గోక్షీరంతో పాయసం వండి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించిన వారిని, ఆవుపేడతో ఇంటిముందు కళ్ళాపి చల్లి , ముగ్గులు పెట్టిన వారిని, అనుగ్రహిస్తానని” చెప్పింది. లక్ష్మీదేవి వాక్కులను శిరోధార్యంగా  భావించి ప్రజలు అలా చేసి తరిస్తున్నారు. 

లక్ష్మీపూజ ఆచరించవలసిన విధివిధానాలు – సత్ఫలితాలు:

మకర సంక్రమణం రోజున దర్భాసనంపై కూర్చుని లక్ష్మీదేవిని పూజించండి. పూజించేటప్పుడు అమ్మవారికి చెరుకు ముక్కలు, చెరుకు పానకం, నైవేద్యంగా సమర్పించి, తామర పూలతో పూజించినట్లయితే వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 

ఒక కటిక దరిద్రురాలిని దివ్యసంపన్నురాలిగా మార్చిన దివ్య పర్వదినం మకర సంక్రమణం పర్వదినం. కాబట్టి సంక్రాంతి నాడు మనమంతా యథాశక్తిగా లక్ష్మీదేవిని పూజించాలి. పిల్లలు లేని వాళ్ళు, ఈ సంక్రమణం రోజున ఆవుపాలతో వండిన పాయసాన్ని, అమ్మకు నైవేద్యంగా చేసి, తాము తిని, పది మందికి పంచి పెడితే సత్సంతానం కలుగుతుంది. ఈ రోజు పిల్లలకు ప్రసాదం పెట్టిన వాళ్ళు సత్సంతానం పొందుతారు.

అప్పటికే సంతానం కలిగిన వారైతే ఆ సంతానానికి సమృద్ధి ఇవ్వగలిగిన వారు అవుతారు. 

సంక్రాంతి నాడు శ్రీ సూక్తం, హరి నామస్మరణ చేసిన హరిదాసుల నెత్తిమీద ఉన్నటువంటి పాత్రలో బియ్యం వేసినా, స్వయంపాకం దానం చేసినా, వాడు సకల సంపదలు, శుభాలు పొందుతాడు. 

అనారోగ్యం నుంచి బయటపడటానికి సాంబుడు అనే వాడు ఈ పని చేసాడు. ఈయన శ్రీకృష్ణ జాంబవంతులకు పుత్రుడు. ఆయనకు ఒకసారి కుష్ఠు రోగం వచ్చింది. ఈ కుష్టురోగం  నుండి బయటపడటానికి నారదమహర్షి సలహా మీద మకరసంక్రమణం రోజు మహాలక్ష్మిని పూజించాడు. పూజించిన తరువాత మూడు అరటి ఆకులు తీసుకు వచ్చి, మూడూ విడివిడిగా పెట్టి, దానిమీద బియ్యం, కూరలు, ఉప్పు, పప్పు అని పెట్టాడు. ఆ మూడు ఆకుల మీద మూడు గుమ్మడి కాయలు పెట్టాడు. స్వయంపాకంతో పాటు ఈ గుమ్మడికాయ లని గర్గాచార్యుల వారికి, దుర్వాసమహర్షి, విశ్వామిత్ర మహర్షికి ఇచ్చాడు. ఆ ముగ్గురికి దానిని ఇవ్వటంతోటే ఠక్కున అతనికున్న కుష్టురోగం పోయింది. అందమైన శరీరం వచ్చింది. 

భయంకరమైన శరీర రోగములను తగ్గించే శక్తి మకరసంక్రమణం రోజున గుమ్మడికాయ దానం చేయడం వల్ల కలుగుతుంది. వీలుంటే ముగ్గురు పండితులకు ఇవ్వడం మంచిది. ముగ్గురికి ఇవ్వకపోతే శక్తికొలది ఒక్కరికైనా ఇవ్వడం మంచిది. 

మకర సంక్రమణం నాడు సూర్యాస్తమయం అయ్యాక భగవద్గీత చదవాలి. ఈ రోజున బ్రహ్మ వైవర్త పురాణం, భాగవతం వినాలి, లేదా మీ ఇష్ట దేవతలకు చెందిన చరిత్ర ను సూర్యాస్తమయ సమయంలో వినాలి. ఈ రోజు పురాణం వింటే సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు.

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు వారి కుమార్తె కవయిత్రి శ్రీవిద్య గారు రచించిన వ్యాస విద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)