తప్పులు దొర్లడం సహజం. జరిగిన తప్పిదాలను మరోసారి జరుగకుండా.. చూసుకుంటు ముందుకు సాగడం ఆనవాయితీ. కాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను అధిష్ఠానం గుర్తించలేక పోతుందా..? లేదా తెలిసి ఊరుకుంటుందా..? అనే సందేహాలు అందరిని ఆలోచనల్లో పడేశాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు చేసిన మేలుకు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను కొత్త రాష్ట్రంలో ఇచ్చారు. తొలిసారిగా2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు, 2018లో జరిగిన అసెంబ్లీఎన్నికల్లో 18 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించారు. రెండు మార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డజన్ మంది చొప్పున అధికార పార్టీలో చేరి పార్టీకి అన్యాయం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన మేలుకు మూడోసారైనా అధికారంలోకి రావడానికి హైకమాండ్ చేసిన ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రానికి కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడం తప్పా మరోకటి లేదు. టీ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై హై కమాండ్ అందరిని అడిగి ఈ నిర్ణయం తీసుకుందో లేదో కాని..ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక రకంగా చూస్తే డోలాయామనంలో పడిరదనే చెప్పచ్చు. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరోగమన దిశలో పయనిస్తుందా..?పురోగతి దిశలో పరుగులు పెడుతుందా..అనే అంశం కొత్తగా టీ పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి చెప్పాలి. అధ్యక్ష పదివి చేపట్టిన రేవంత్‌రెడ్డి సీనియర్లను కలుపుకొని ముందుకు వెళ్లడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సీనియర్లు అతనికి సహకరించడంలేదని మరోవాదన.
పోరాటాలు మరిచారు..పోట్లాటలపైనే దృష్టి పెట్టారు.
కాంగ్రెస్ పార్టీలో అందరిని కలుపుకొని ముందుకు సాగడంలో పార్టీ అధ్యక్షుడు విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న.. స్వేచ్చా మరొక రాజకీయ పార్టీలో ఉండదు. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వడంపై మొదటి నుంచి అందరిలోను ఒకింత కినుకు ఉంది. ఈ సమస్యను అధిగమించలేక పోయిన రేవంత్‌రెడ్డి కనీసం ప్రజా శ్రేయస్సు కోసమైన పోరాటాలు చేయడంలోను తనదైన ముద్ర వేసుకోలేక పోయారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ బీజేపీతో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే కుట్రలు చేసిందనే ఆరోపణలు చేయడం మినహా ఇంత వరకు రేవంత్‌రెడ్డి ప్రజల పక్షాన నిలబడి చేసింది ఏమి లేదు. నిత్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏదో చోటా కుమ్ములాటనో.. కుతంత్రమో జరుగుతున్న తీరు వెలుగులోకి వస్తుంది. వీటన్నంటని అధిగమించి పార్టీని అధికారంలోకి తీసుకరావాలనే ఆలోచనలు అధ్యక్షుడి మొదలుకొని పార్టీలో సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న వారందరు చేయ లేదు. మనుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు నల్లగొండ బ్రదర్స్‌లో ఒకరు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెలుతున్నారని తెలసినా రాష్ట్ర నాయకత్వం పార్టీని వీడకుండ అడ్డుకోలేక పోయారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దిక్కంచుకునే ప్రయత్నాల్లో అందరు విఫలమాయ్యరు.
ఇదే సమయంలో తెలంగాణలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర ప్రారంభమయ్యింది. జోడో యాత్ర తెలంగాణలో పాలమూరు జిల్లాలో మొదలయ్యింది. జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా ముందుకు సాగాల్సిన క్రమాన్ని వీడనాడీ కుమ్ములాటలకు తెర లేపారు. మహబూబ్‌నగర్‌లో మొదలైన కుమ్ములాటలు ఉమ్మడి మెదక్ జిల్లా వరకు కొనసాగాయి. ఎక్కడ కూడ కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు వెళ్లింది అనే సంకేతాలు ప్రజల్లోకి పంపలేక పోయారు. మునుగోడులో డిపాజిట్ కూడా దక్కని ఘోరవైఫల్యానికి కారణాలేమిటి? సమీక్ష కూడా జరుపుకోలేని స్థితి పార్టీది.
సీనియర్ల మధ్య విభేదాలు..తలోదారిలో నడుక..
నాయకులంతా కలిసి నడిచే సంస్కృతి లేపోవడం కాంగ్రెస్‌కి పెను ప్రమాదంగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు చోటా మోటా లీడర్ల పనితీరు ఉండడం పార్టీకి తలనొప్పిగా మారింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి కొత్తగా జాతీయ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఖర్గే వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడీలో పెట్టడానికి ప్రయత్నాలు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీరితోపాటు రాష్ట్ర ఇంచార్జీగా కొనసాగుతున్న వారు కూడ పార్టీ బాగోగులతోపాటు అందరిని కలిసి కట్టుగా నడిపించడానికి కృషి చేసిన దాఖలాలు లేవు. గాంధీ భవన్‌లో మంతనాలు మినహా ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు
గట్టి ప్రయత్నాలు చేపట్టిన సంఘటనలు లేవు. ఈ వ్యవహారాలు చూసిన కాంగ్రెస్ నాయకులు కొందరు పార్టీలో విభేదాలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీటిని చూసిన కొందరు నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగు పడదని భావించి పక్క పార్టీల్లో చేరడానికి అడుగులు కదుపుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో చాల మంది సీనియర్ నాయకులు తలో దారిలో ప్రయాణిస్తున్నారు.
ఒక నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాలకు మరొకరు హాజరు కాకపోవడం, మరో అడుగు ముందుకు వేసిన చేసిన ప్రయత్నాలను మీడియా ముందు మాట్లాడడంతో తెలంగాణలో పార్టీ రోజు రోజుకు బలహీనపడుతు వస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో కొనసాగుతున్న విభేదాలు, కుట్రలు, కుతంత్రాలు వీడి నాయలంతా కలిసి ముందుకు సాగుతారనే భరోస ప్రజల్లో కల్పించలేక పోవడంతో పార్టీ రాష్ట్రంలో బలహీన పడుతూ వస్తుంది.
తిరోగమనంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యం..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో నడుస్తుంది. దీనికి కారణం పార్టీలో ఎవ్వరన్నది నేటికి ప్రశ్నార్థకంగా ఉంది. పార్టీ బాగుపడక పోవడానికి మొదటి కారణం పార్టీలో నేతల మధ్య ఐక్యత రాగం కానరాక పోవడం ఒకటైతే..అందరిని కలుపుకొని ముందుకు సాగలేక పోతున్న సారథ్యం పార్టీకి నష్టం తెచ్చి పెడుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బాగుకు బడా, చోటా నాయకులను కలుపుకొని యువతను ఆకర్షించడానికి చేపట్టాల్సిన ప్రణాళికలకు పార్టీ సారథి చేపట్టక పోవడంతో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ప్రశార్థకంగా మారుతు వస్తుందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో గౌవరం, పార్టీ పట్ల శ్రద్ద కనబరిచే వ్యక్తిగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
పార్టీ మారడమే కాదు.. పార్టీ నాయకులపై కూడ చాల తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలకు సమాధానలు ఇవ్వడానికి, పార్టీని రక్షించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేయక పోవడం చూస్తే …పార్టీ ఏ స్థాయిలో పని చేస్తుందో ఇట్టే తెలిసి పోతుంది. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అంటే గిట్టక పోవడంతో రాజగోపాల్‌రెడ్డి బ్రదర్స్ వ్యతిరేకించి, బీజేపీలోకి వెళ్లారని అనుకోవచ్చు. కాని పార్టీ పట్ల నిబద్దత కలిసిగి వ్యక్తిగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడిపై తీవ్రంగా విమర్శలు చేయడం పార్టీకి నష్టం కలిగించే అంశంగా మారింది. పార్టీ అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు చేయడంపై పార్టీ వర్గాల్లో దుమారం లేపుతుంది. జూన్`2021 లో టీ పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి తొలుతగా మేడ్చల్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గంలోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో ఆగుస్టు 21న మూడు రోజుల పాటు నిర్వహించిన దళిత, గిరిజన అత్మగౌరవ దీక్షతో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాలతో కాంగ్రెస్ పార్టీలో చలనం మొదలయ్యింది. కాంగ్రెస్ వర్గాల్లో చోటు చేసుకున్న ఉత్సాహాన్ని ఏడాదిగా కొనసాగించడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ధరణితోపాటు ఇతర రైతు సమస్యలు, పోడు భూములపై పోరాటాలు చేసి కాంగెస్ర్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాల్సిన అవసరముంది. కాని పోరాటాలను పక్కన పెట్టి కేవలం ప్రెస్‌మీట్లకు, బహిరంగల సభలకు, విమర్శించుకోవడానికి నాయకులు పరిమితమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదనే ప్రచారం ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వివాదాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ వివాదాలను కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు కూడ చేయలేక పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. మారుమూల పల్లెల్లో జనంలో కాంగెస్ర్ పార్టీ అంటే అభిమానం ఉంది. మంచి నాయకుడు వస్తే బాగుండు అనే ఆవేదనలో ఉన్నారు. జనంలో ఉన్న అభిమాన్ని ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది కూడ పార్టీ వర్గాలు చేయడం లేదనే విమర్శ ఉంది. మునిగిపోతున్న నావకు చుక్కాని ఎంత అవసరమో.. కాంగ్రెస్ పార్టీకి చుక్కానిలా నాయకుడు, నాయకులు అవసరం ఉందని కాంగ్రెస్ నేతులు గుర్తించాల్సిన అవసరముంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చివరి అవకాశంగా ఉంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోకుంటే మాత్రం ఏపీలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నాయకులంతా కలిసి నడుస్తారో.. కుమ్ములాటలలో కొట్టుకు చస్తారో.. జరిగిన పరిణామాలను గుర్తించి గుణపాఠాలు నేర్చుకుంటారో కాంగ్రెస్ నాయకులే తేల్చుకోవాల్సిన అవసరముంది.
____________________
బొజ్జ రాజశేఖర్,
పీపుల్‌పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి