మానుకొండూరులో ఏ పార్టీ స‌త్తా ఎంత‌? గెలిచేదెవరు?

Manakondur : క‌రీంన‌గ‌ర్ కూత‌వేటు దూరంలో ఉన్న మాన‌కొండూరులో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు ప‌ర్యాయాలు కొన‌సాగుతున్న‌ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ ప‌రంగా బ‌లంగా క‌నిపిస్తున్న హ‌స్తం పార్టీ గెలిచేందుకు క‌స‌ర‌త్తుల‌ను ప్రారంభించింది. ఇక నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. ఇక్క‌డ‌ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపి.. బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.

మానుకొండూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వు స్థానంగా ఉంది. నియోజ‌క‌వ‌ర్గం నుంచి అధికార పార్టీకి చెందిన ఉద్య‌మ‌కారుడు ర‌స‌మ‌యి బాల‌కిష‌న్..2014, 2018 ఎన్నిక‌ల్లొ గెలిచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నాడు. మూడోసారి ఆయ‌న ఎమ్మెల్యేగా పోటిచేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ర‌స‌మ‌యి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేక‌పోయార‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తకి తోడు.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ద‌ళిత బంధు ఎఫెక్ట్.. వచ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికితోడు బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేటికెట్ ఆశిస్తున్న ఆశవాహులు అధికంగా ఉండ‌టం కూడా ఎమ్మెల్యే మైన‌స్ అనే చెప్ప‌వచ్చు.


గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటిచేసి ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే ఆరెప‌ల్లి మోహ‌న్ బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.ఒక‌వేళ బిఆర్ఎస్ నుంచి టికెట్ రాక‌పోతే.. కాంగ్రెస్ నుంచి పోటిచేసే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు ప్రచారం జ‌రుగుతుంది. కాంగ్రెస్ నుంచి పోటిచేస్తే ఆయ‌న గెలిచేందుకు ఆస్కారం ఉంటుంద‌ని హ‌స్తం పార్టీ నేత‌ల‌ మాట‌గా తెలిసింది.
ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ బలంగా క‌నిపిస్తుంది. పార్టీ నుంచి క‌వ్వంప‌ల్లి స‌త్య‌నార‌య‌ణ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అన్ని గ్రామాల్లొ తిరుగుతు కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరెప‌ల్లి మోహ‌న్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరితే.. క‌వ్వంప‌ల్లికి టికెట్ క‌ష్ట‌మ‌నే భావ‌న హ‌స్తం పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

ఇక బీజేపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటిచేసి ఓడిపోయిన గడ్డం నాగ‌రాజు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు మంచి పేరున్నా.. రాజ‌కీయాల్లో ప‌నికిరాడు అన్న ముద్ర ఆయ‌న‌కు మైన‌స్ గా క‌నిపిస్తోంది. ద‌రువు ఎల్ల‌న్న అజ‌య్ వ‌ర్మ వంటి వాళ్లు టికెట్ ఆశిస్తున్న‌ప్ప‌టికీ.. మాజీ ఎంపీ వివేక్ ను పోటికి దింపే ఆలోచ‌న‌లో కాషాయం పార్టీ ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బ‌లంగా ఉన్న వివేవ్ కు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిచ‌యాలు ఉండ‌టం.. ఎంపీగా సంజ‌య్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టంతో ఆయ‌న గ‌నుక బ‌రిలోకి దిగితే గెలుపు న‌ల్ల‌రేపై న‌డ‌కే అన్న‌ది క‌మ‌లం పార్టీ నేత‌ల మాట‌గా తెలిసింది.

మొత్తంగా రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మానుకొండూరులో త్రిముఖ పోటి ఖాయంగా క‌నిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాల‌ని బిఆర్ఎస్ .. బ్యాక్ బౌన్స్ త‌ర‌హాలో స‌త్తాచాటాల‌ని హ‌స్తం పార్టీ..   ఉమ్మడి కరీంనగర్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా  పెట్టుకున్న బీజేపీ గెలుపు గుర్రం కోసం వ్యూహాలకు పదును పెడుతుంది.

Related Articles

Latest Articles

Optimized by Optimole