వరంగల్ జిల్లా వర్థన్నపేట రాజకీయం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందా? అధికార బిఆర్ ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం ఝలక్ ఇచ్చిందనే ప్రచారంలో నిజమెంత? బిఆర్ ఎస్ నేతలతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టచ్ లో ఉన్నాడా? కోమాలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
వర్థన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేత అరూరి రమేష్ కొనసాగుతున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ.. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యథిక మెజార్టీతో రమేష్ గెలుపొందారు. మరోసారి ఎమ్మెల్యేగా పోటిచేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే విషయంలో కేడర్ డిసప్పాయింట్లో ఉంది. దేవాదుల ప్రాజెక్టు నీటిని నష్కల్ ,ఉప్పుగల్లు , రామారం ,దివిటిపల్లి ,దామన్నపేట మీదుగా తీసుకొస్తామన్న హామీ నెరవేర్చకపోవడం ఇందుకు కారణమన్న వాదన ప్రధానంగా వినిపిస్తుంది.దళిత బంధు, డబుల్ బెడ్ రూం, 100 పడకల ఆస్పత్రి వంటి విషయాలపై వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేను ప్రజలు నిలదీసిన పరిస్థితి . ల్యాండ్ పూలింగ్ చేసే క్రమంలో నిలదీసిన బాధితులను పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రి పేరుతో వేధింపులకు గురిచేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనికితోడు ఎమ్మెల్యే అనుచరులుగా పేరున్న కార్పొరేటర్లు భూకబ్జాలలో ఆరితేరారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన టికెట్ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన స్థానంలో ఎంపీ పసునూరి దయాకర్ లేదా ఓ పోలీస్ ఆఫీసర్ ను పోటిచేయించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోటిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా నియెజకవర్గంలో బీజేపీకి బలం బాగా పెరిగింది. దీనికి తోడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ నియోజకర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ఉప ఎన్నికల్లో తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యేల్లో అరూరి రమేష్ ఉన్నారని భావిస్తున్న ఈటల.. ఆరునూరైనా సరే అంతుచూడాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను, ద్వితీయ శ్రేణి కార్యకర్తలను చేరదీసినట్లు.. కొంతమంది అధికార కార్పొరేటర్లతో ఆయన రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఎన్నికల నాటికి నియెజకవర్గంపై పూర్తి పట్టుసాధించే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వర్థన్నపేట కాంగ్రెస్ నుంచి నమిండ్ల శ్రీనివాస్ పోటిచేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అంతర్గత కుమ్ములాటలకు తోడు కేడర్ నిరాశలో కూరుకుపోయింది. దీంతో ఆయన గెలుపు అవకాశాలు తక్కువనే భావించవచ్చు. ఒకవేళ పోటిచేసిన మూడోస్థానానికే పరిమితమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా వర్థన్నపేటలో మరోసారి గెలవాలని బిఆర్ఎస్ .. ఆరునూరైనా సరే గెలిచితీరుతామని బీజేపీ నేతలు పట్టుదలతో కనిపిస్తున్నారు.