Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?

Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల  హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా  బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు. గత  పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని గర్వంగా చెబుతున్నామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రధానమంత్రి ఎవరో ప్రకటించే దమ్ముందా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.

ఇక పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ సీటు తనకు కేటాయించడంపై సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితమని.. కరీంనగర్ అభ్యర్ధిగా ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు.కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతానని.. తనను మరోసారి ప్రజలు భారీ మెజారిటీతో  గెలిపించి సత్తా చాటాలని పిలునిచ్చారు. ఎంపిగా గెలిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి  కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి చేస్తానని  సంజయ్ హామీ ఇచ్చారు.