నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయం నుండి గత నెల 21 న 110 మంది మెస్రం వంశస్తులు కెస్లాపూర్ లో కంకణం కట్టుకొని పాదయాత్రకు బయలుదేరారు. జల సేకరణ మహా పాదయాత్ర నిమయ నిష్టలతో రాళ్లు రప్పలు దాటుతూ కొండ కోనల్లో శ్వేత నాగులా 110 కిలోమీటర్లు దట్టమైన అడవుల గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి హస్తినమడుగుకు చేరుకుంది. పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరించారు. అమావాస్య అర్థరాత్రి..ఎటుచూసినా చీకటిమయం. కానీ అక్కడి గిరిజనులు అదే చీకటిలో వెలుగు వెతుక్కుంటారు. తమ జీవితాల్లో వెలుగులు నింపమని నాగదేవతను ప్రార్థిస్తారు…
పూజా జల సేకరణకు పాదయాత్ర..
పుష్యమాసం పౌర్ణమిరోజు మేస్రం వంశీయులు గిరిజనులతో కలసి కొత్త కుండలతో కెస్లాపూర్ నుంచి కలమడుగు దాదాపు 80 కిలోమీటర్లు పాదయాత్ర మొదలెట్టారు. స్నానమాచరించి గోదారమ్మకి ప్రత్యేక పూజలు చేసి అక్కడే దంపుడు బియ్యంతో ప్రత్యేక వంటకాలు చేసి నైవేద్యం సమర్పించి పవిత్ర జలం కోసం కళశ పూజ చేసి, కుండలలో గోదావరి జలాలు సేకరించి కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లని దుస్తులు ధరించి కాలినడనకన చేపట్టిన మెస్రం వంశీయుల పాదయాత్ర రహదారిలో చెట్టు గుట్టల మధ్యలో చీమల బారులా కనిపిస్తున్నది. పవిత్ర గంగాజలంతో బయలుదేరిన పాదయాత్ర తిరిగి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చేరుకుని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పుష్యమాస అమావాస్య అర్థరాత్రి ఫిబ్రవరి 9 న నాగోబాకి అభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది.
నాగశేషుడిని పూజించే అతిపెద్ద జాతర నాగోబా ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయం నుండి గత 21 న 110 మంది మెస్రం వంశస్తులు కెస్లాపూర్ లో కంకణం కట్టుకొని ఈ పాదయాత్రకు బయలుదేరారు. జల సేకరణ మహా పాదయాత్ర నిమయ నిష్టలతో రాళ్లు రప్పలు దాటుతూ కొండ కోనల్లో శ్వేత నాగులా 110 కిలోమీటర్లు దట్టమైన అడవుల గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి హస్తినమడుగుకు చేరుకుంది. పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరించారు. ఐదు మండలాలు, 18 గ్రామాలు, 26 మారుమూల గ్రామాల మీదు సాగుతున్న మెస్రం వంశీయుల గంగాజల మహా పాదయాత్ర. శ్వేత నాగులా కదిలే రూపం.. తెల్లని వస్త్రం.. దట్టమైన కవ్వాల్ అభయారణ్యం గుండా సాగుతున్న మహా పాదయాత్ర.. చూసేందుకు రెండు కనులు చాలవన్నట్టు మంత్ర ముగ్దులను చేస్తోంది.
గోదావరి పూజ అనంతరం తిరుగు పయనమైన మేస్రం వంశీయులు కాలికి పాదరక్షలు ధరించకుండా.. అత్యంత నియమనిష్టలతో సాగే ఈ గంగా జల పాదయాత్ర ఈనెల 5 న ఇంద్రవెల్లిలోని ఇంద్రదేవి ఆలయానికి చేరుకోనుంది. పూజ అనంతరం తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఐదు మండలాలు, 18 గ్రామాలు, 26 మారుమూల గ్రామాల మీదు గా దట్టమైన కవ్వాల్ అభయారణ్యం గుండా సాగి ఈ పాదయాత్ర చేసిన వారికి ఘన స్వాగతం పలికి వారికి సేవలు చేసుకోవడం ఆదివాసీ గ్రామాల ఆచారం. ప్రతి ఏడాది తమ మార్గాన్ని మార్చుకుంటూ సాగడం ఆ వంశీయులు ఆచారం. తమ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఆదివాసీలను ఐక్యం చేసేందుకు ఈ పాదయాత్ర తోడ్పడుతుందని భావిస్తారు మేస్రం వంశీయులు. తొమ్మిది తెగలను ఏకం చేసే జాతర కూడా నాగోబానే.
ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ..
నాగోబా జాతర వేడుక ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం. పుష్యమాస అమావాస్య అర్థరాత్రి వేళ నాగశేషుడికి గంగాజలాభిషేకంతో ఈ జాతర ప్రారంభం అవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని గిరిజన మెస్రం వంశీయుల అపార నమ్మకం. పుష్య మాస అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల నమ్మకం.
ఆలయ పీఠాధిపతి వెంకట్‌రావ్ పర్యవేక్షణలో 22 కితల వారు తమకు కేటాయించిన బాధ్యతలు నిర్వహిస్తారు. ఇందులో పటేల్, కటోడ, గాయికి, జాడియల్, నాయక్‌వాడి, సాంకేపాయిలాల్, ఎంపాలియల్, వాడే, సపాలి, ప్రధాన్, బేజిలికర్, హవాల్దార్, డివేకర్, ఎవితి, కోర్కార్, డప్, డాకలి, రంకం, బండే, బొడ్డిగూడియల్, గారుడి, కాంటేలకార్ కితలు ఉంటాయి. జాతర ప్రారంభం నుంచి మహాపూజ ముగింపు వరకు వీరంతా ఆలయ సమీపంలోని ప్రత్యేక గుడారాల్లో బస చేస్తూ మహాకార్యంలో భాగస్వాములవుతారు. పటేల్.. మహాపూజతో మొదలైన పూజ కార్యక్రమాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ప్రస్తుతం వెంకట్‌రావ్ ఆలయ పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ప్రధాన ఘట్టమైన మహాపూజతో పాటు ఉట్నూర్ మండలం బుడుందేవ్ పూజలు ముగిసే వరకు కటోడా కీతదే కీలక పాత్ర. గాయికి, జాడియల్ .. కితలకు చెందిన ఈ రెండు తెగల వారు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతోపాటు ఝరి (కలశం) కు రక్షణగా ఉంటారు. మిగతా కితలకు చెందిన వారు కలసి సంప్రదాయ పూజా కార్యక్రమాల్లో సహాయ, సహకారాలు అందిస్తూ జాతరను ముందుకు నడిపిస్తారు.
అడుగడుగునా విశేషాలతో నిండి ఉంటే కేస్లాపూర్ నాగోబా జాతర గురించి ప్రచారం కోసం ఎడ్లబండితో 7 గ్రామాల్లో రథయాత్ర, తెల్లటి దుస్తుల్లో మెస్రం వంశీయుల సందడి మొదలవుతుంది. గ్రామంలోని పురాతన నాగోబా దేవస్థానం (మురాడి)లో సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం సమావేశం నిర్వహించి నాగోబాకు ఫిబ్రవరి 9న నిర్వహించే మహాపూజలతోపాటు గ్రామాల్లో వారం రోజులపాటు ప్రచారం నిర్వహించే సమావేశంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ పటేల్, వంశీయులు పాల్గొన్నారు.
ఆదివాసులు మిగిలన కొద్దిపాటి మూలవాసి సమూహాల గుర్తులు … ఆదునిక సమాజం హైందవం పేరుతో వారి ఆహారానికి, ఆహార్యానికి దూరం చేస్తోంది.. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో గోండు గిరిజనుల్లోని మెస్రం వంశస్థులు జరిపే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఈ జాతర వారి జివితానికి సంబందించింది. చెట్టు కొకరు గుట్ట కొకరు నివసించే గోండులు, కోలామ్ లు, పరదాన్ లు అనే గిరిపుత్రులు ఈ జాతరతో కలుస్తారు. తమ బందువులను కలవడమే కాదు కోత్త బందాలకు నాంది ఈ నాగోబా జాతర. వారం పది రోజుల పాటు జాతర కోసం ఎడ్ల బండ్లపై , కాలి నడకన ఇంద్రవెళ్లి మండలంలోని కెస్లాపుర్ కు తరలివస్తారు. దారిలో ఎంతో నిష్టగా క్రమశిక్షణతో ప్రకృతితో మమేకమవుతునే నాగోబా చెంతకు చేరుకుంటారు. నాగోబా జాతరలో ప్రధానంగా జంతువుల బలి ఇచ్చి తర్వాత వాటితో పండుగను ఆస్వాదించడం గిరిజనులు ఆనవాయితి., కాని ఇప్పుడు ప్రభుత్వాలు అదికారిక జాతరగా జరపడం జంతు బలులు నిషేదించడం అంతా జరిగిపోయింది…
సాంప్రదాయాలు పోయి ఆదునిక పోకడలు..
ముందు నాగోబా జాతర అంటే గిరిజనులది మాత్రేమే కాని ఇప్పుడు మైదాన ప్రజలు వస్తుండడంతో వీరి సాంప్రదాయాలు పోయి వారి ఆదునిక పోకడలు పెరిగి పోతున్నాయ్…ఇదే మాట నలబై యెండ్ల కింద నాగోబాను సందర్శించిన హైమన్ డార్ప్ తన పరిశోధనా పుస్తకాల్లో రాశారు…. ప్రతియేట తమదైన పండగను తమకు కాకుండా చెస్తున్నారనే కోపాన్ని గిరిజనులు పంటి కింద అనుచుకుంటున్నారని, పాత తరానికి చెందిన సాంప్రదాయ గోండు పెద్దలు ఎక్కడికో పరాయిదేశానికి వచ్చామన్న భావనతో ఉన్నారని రాసారు. గోండుల కోసం గోండుల చేత జరుపుకునే స్వంత ఉత్సవంలో ఇప్పుడు పూర్తిగా బయటి వారమై పోతున్నామనే బాదపడుతున్నారు… సురుజి మహరాజ్ సంస్కరణోద్యమం పేరుతో పూర్తిగా హైందవీకరణ జరిగిందనీ కొందరు అవేదన చెందుతున్నారు.
ట్రైబ్స్ అఫ్ ఇండియా …ద స్ట్రగుల్ సర్ వైవల్ అనే పుస్తకంలో హైమన్ డార్ఫ్ గోండుల స్థితిగతులపై నాగోబా జాతర పై పరిశోదించి రాసిన వ్యాసాలలో అప్పటి పరిస్థితి వివరించారు. పూర్తిగా మెస్రం వంశస్థులదే అయిన నాగోబా ఆలయం… 1977 లో కేస్లాపుర్ లోని నాగోబా దేవాలయ కమిటిలో మర్సకోల కాశిరాం (అధ్యక్షుడుగా) ఉన్న సమయంలో దేవాదాయ శాఖ సిబ్బంది కోశాదికారిగా ఉండేవారు…ఆ సమయంలోనే పూర్తిగా మెస్రం వంశస్థులు పట్టు కోల్పోయి.. గోండులకు హిందువులకు కలిపి ఓకే దేవాలయంగా మార్చేసారు…ఈ ఆలయాన్ని గణ పూజారి మెస్రం నాగు వ్యతిరేకించాడు…మన సంప్రాదాయలన్ని పోయి హైందవ సాంప్రదాయంలో మనం మగ్గిపోవాల్సి వస్తుందని తన జాతికి అధికారులకు వివరించాడు..కాని ఆయనను పట్టించుకోలేదు…
ఈ మాటలు మనవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ తన పుస్తకం లో రాసారు. సంవత్సరానికోసారి కలుసుకునే బందువులంతా సంతోషంగా ఉండే పండుగను ఆఎ ఆంక్షలూ లేకుండా మాకే వదిలేయాలని కోరుతున్నారు. గోండులకే పరిమితమైన ఆచారాలలో ఇతరుల జోక్యం పెరిగి చేసేదేం లేక గుడి వెనక దూరంగా ఓ చిన్న గుడిసెలో తమ పెంపుడు కోళ్లు, మేకలను బలి ఇస్తు తింటున్నారు…గుడి ముందు మాత్రం హిందు సాంప్రదాయలను పాటిస్తు తమకు అంతకు మందెన్నడు తెలియని కోబ్బరికాయలు కోట్టే సంస్కృతిని అలవాటు చేసుకున్నారు.
పూజా విధానం..
జలంతో నిండిన కలశాన్ని ‘పూసిగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక్క రోజు ఉన్న తరువాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు, ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు.
గోదావరి నదినుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంతీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్షికమంలో పాట్లాల్, గయిక్ వాడి, హవాల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు.
నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.
3 సంవత్సరాలకొక పూజారి ఆనవాయితీ.
జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం సిరికుండలు తయారుచేయడం ఆచారం. గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయులమధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి! పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిల్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆదేశిస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.
భేటింగ్ కియ్ వాల్ / వధూవరుల పరిచయ వేదిక..
మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాక్షిగిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్షికమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.
దర్బార్..
జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు 1942లో మొదట ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.
నాగోబా చరిత్ర..
నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్ గ్రామంగా మారి పోయింది.
నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.
సిరికుండలు..
మెస్రం వంశీయులు తొలినాళ్ళలో నాగోబా దేవత వెలిసిన పుణ్యస్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను, 1995లో సిమెంట్, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. 2022లో శిలలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు.
విగ్రహ ప్రతిష్ఠాపన..
మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా దేవాలయాన్ని ప్రారంభం, విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమం 2022 డిసెంబరు 19న వైభవంగా జరిగింది. ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్ఛారణల నడుమ మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నిర్మించిన దేవాలయంలోని గర్భగుడిలో నాగోబా విగ్రహాన్ని, సతీక్‌దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. దేవాలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటుచేశారు. వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగోబా జాతర ఆచార, వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వందల ఏళ్ల క్రితం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండే వారు. మూల పురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈ నాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మోస్త్రం అనే ఏడుగురు సోదరులుండేవారు.
ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబా పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మోస్త్రానికి అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మోస్త్రం వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మోస్త్రం, రెండవది భూయ్యాడే మోస్త్రం. ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిపోయినారు. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మోస్త్రం వంశస్థులకే దక్కింది.