APpolitics: వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి?

tdp,janasena,bjp,

APpolitics:   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది. సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అంటూ ఎప్పుడూ గంభీరంగా పలికే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడడంతో ఉలిక్కిపడుతున్న తీరు చూస్తుంటే ‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని చెప్పకనే చెబుతున్నాయి. 

ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడమన్నది సర్వసాధారణం. అంతిమంగా ఎవరు గెలిచారు..? ఎవరు ఓడిపోయారన్నదే ప్రధానం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే లక్ష్యంతో జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుకు సిద్ధమైతే, అది నేరం అన్నట్లు గతంలో ఎవరూ పొత్తు పెట్టుకోనట్టు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. వివిధ పార్టీలు పెట్టుకునే పొత్తులను ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. 

2004లో టీడీపీని గద్దె దించడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఆరాధ్యదైవం, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ కూడా 2014లో  తెలంగాణలో సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీని ఓడిరచడానికి కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమిని ఏర్పటు చేస్తే, మూడోసారి గెలవడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చిన్నచిన్న పార్టీలతో సైతం పొత్తులు కుదుర్చుకుంటున్నారు. పొత్తులు పెట్టుకున్న దివంగత నేత డా.వైఎస్‌ఆర్‌, నరేంద్ర మోదీ సింహాలు కాదా..? వారు పిల్లులా..? దీనికి వైఎస్‌ఆర్‌సీపీ నేతల వద్ద సమాధానం ఉందా?

జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరితే వైఎస్‌ఆర్‌సీపీకి ఒక్క సీటు కూడా రాదని పందేలకు పేరు గాంచిన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పందేలు కాస్తున్నారు. ఉత్తరాంధ్రాతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకూ ఈ పొత్తు ప్రభావం బలంగా ఉండే అవకాశాలున్నాయి. 

దేశంలోని ప్రముఖ సంస్థలు ఏపీలో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే గతంలో కంటే టీడీపీ`జనసేన`బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చిన వివిధ సామాజికవర్గాలు, సమూహాలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యాయన్న విషయాన్ని కూడా ఈ సర్వే  ఫలితాలను బట్టి తేటతెల్లమవుతుంది. క్షేత్రస్థాయిలో ఇలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఎలా సాధ్యం? ఈ సాధ్యాసాధ్యాలు పక్కనపెడితే, ప్రతిపక్షాలను సున్నా చేయడమే లక్ష్యంగా ఏ అధికార పార్టీ పనిచేసినా అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం! ప్రతిపక్షం లేకపోతే, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి.

 ఎన్నికలకు సంబంధించి శాస్త్రీయంగా విశ్లేషణ చేసే ముందు రెండు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అందులో మొదటిది ప్రైమరీ డేటా, రెండవది సెకండరీ డేటా. క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా వెల్లడయ్యే డేటా ప్రైమరీ డేటా. గత ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, వివిధ సామాజికవర్గాలు ఏయే పార్టీలకు మద్దతు ఇచ్చాయి తదితర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన సంస్థలు విడుదల చేసిన డేటా సెకండరీ డేటాగా పరిగణించాలి. 

జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు ఏ విధంగా ఉండబోతోందో పరిశీలించడానికి ప్రముఖ సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్థ వివిధ అధ్యయనాల ద్వారా వెల్లడిరచిన డేటాను పరిగణలోనికి తీసుకుంటున్నాం. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీచేయగా జనసేన మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 44.5 శాతం, మిత్రపక్షం బీజేపీకి వచ్చిన 2.18 శాతం ఓట్లు కలిపి మొత్తం 46.68 శాతం ఓట్లు రాగా, వైఎస్‌ఆర్‌సీపీకి 44.12 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 2.56 శాతం తేడాతో టీడీపీ అధికారం చేపట్టింది. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన టీడీపీకి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం, బీజేపీకి 0.84 శాతం ఓట్లు రాగా వైఎస్సార్సీపీ 49.95 శాతం ఓట్లు సాధించి, 151 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టింది. టీడీపీ 24 సీట్లలో గెలిచింది. విడివిడిగా పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు సాధించిన ఓట్లను కలిపితే వారికి మరో 34 స్థానాల్లో గెలిచే అవకాశాలుండేవి. అదేవిధంగా 1 నుండి 2 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 10 కాగా, 3 నుండి 5 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 11 ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే తక్కువ ఓట్ల శాతంతో ఓడిపోయిన ఈ 21 సీట్లలో అత్యధికంగా ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. 

శాస్త్రీయ అధ్యయనంలో భాగంగా 2019 గణాంకాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టీడీపీ`జనసేన`బీజేపీ పైన పేర్కొన్న మొత్తం 79 స్థానాలకుగాను 70కిపైగా సాధించే అవకాశాలున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీని ఈ కూటమి సునాయాసంగా సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

2019లో పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఓట్లలో వైసీపీకీ 45.55, టీడీపీకి 27.32 శాతం వచ్చాయి. ప్రస్తుతం  ఒపీనియన్‌ మేకర్స్‌గా పేరున్న ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్‌ రద్దు, సమయానికి జీతాలు రాకపోవడం, బెనిఫిట్స్‌ అందకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ అస్మదీయులే తస్మదీయులుగా కాబోతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం కారణాలతో నిరుద్యోగ యువత జగన్‌ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉంది.  

శాసనమండలి ఎన్నికల్లో (పట్టభద్రులు) మూడు సీట్లనూ టీడీపీ గెల్చుకుంది. 2019లో టీడీపీకి వచ్చిన ఓట్లతో పోలిస్తే 2023 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్రాలో 4.27%, తూర్పు రాయలసీమలో 5.28%, పశ్చిమ రాయలసీమలో 3.78% ఓట్లను పెంచుకుంది. వైసీపీ ఉత్తరాంధ్రాలో 18.89%, తూర్పు రాయలసీమలో 19.10%, పశ్చిమ రాయలసీమలో 13.37% ఓట్లను కోల్పోయింది. అయితే, ఈ ఓటమిపై విశ్లేషించుకోకుండా, పట్టభద్రులు తమ ఓటర్లు కాదని వైసీపీ ప్రకటించుకోవడం అవివేకం! వాలంటీర్ల సాయంతో తిరిగి అధికారంలోకి రాగలమని ప్రభుత్వం భావిస్తుండగా ఎమ్మెల్సీ ఫలితాలను పరిశీలిస్తే వీరి ప్రభావం నామమాత్రమే అని చెప్పవచ్చు.

రాష్ట్రంలో పథకాల నుంచి పార్టీ టికెట్ల వరకు ప్రతిదీ కులం చుట్టే తిరుగుతుంది. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఆంధ్రాలో ఎప్పటిలాగే ఈసారి కూడా ‘క్యాస్ట్‌ వార్‌’ ఉంటుంది కానీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే ‘క్లాస్‌ వార్‌’ మాత్రం కాదు. సీఎస్డీఎస్‌-లోక్‌నీతి డేటా ప్రకారం 2014లో వైఎస్‌ఆర్‌సీపీకి 64 శాతం రెడ్లు ఓట్లు వేయగా, 2019లో అది 86 శాతానికి పెరిగింది. 2014లో వైఎస్‌ఆర్‌సీపీకి 57 శాతం వచ్చిన ఎస్సీ ఓట్లు 2019కి 76 శాతానికి, 2014లో 37 శాతం వచ్చిన బీసీ ఓట్లు 2019లో 39 శాతానికి పెరిగాయి. 

 టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలే ఆ పార్టీకి వెన్నెముకగా ఉంటున్నారు. బీసీల్లో మార్పు వచ్చినప్పుడల్లా టీడీపీ ఓడిపోతూ వస్తున్నది. 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇదే ప్రతిబింబించింది. 2014లో టీడీపీకి 54 శాతం బీసీ ఓట్లు రాగా, 2019లో 46 శాతం మాత్రమే వచ్చాయి. బీసీల్లో 8 శాతం ఓట్లు కోల్పోవడం వల్ల,  టీడీపీకి ప్రధాన మద్దతుదారులైన కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా 2014 తో పోలిస్తే 12 శాతం తగ్గడంతో ఆ పార్టీ ఘోర ఓటమిపాలయ్యింది. 2019లో 7 శాతం రెడ్లే టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుండి రెడ్డి సామాజికవర్గం ఇంత తక్కువ మద్దతిచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. 

2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన జనసేనకు వచ్చిన మొత్తం ఓట్లలో 26 శాతం కాపులవే! టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తే కొన్ని బీసీ కులాలు ఈ కూటమికి ఓటు వేయరని వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారం చేస్తోంది. కానీ, 2014లో జనసేన టీడీపీకి మద్దతిచ్చినప్పుడు బీసీ కులాల ఓట్లు 54 శాతం టీడీపీకి పొందడాన్ని ఇక్కడ గమనించాలి. ఈ పొత్తుతో కుల సమీకరణాలు తిరిగి 2014లాగా మారి, కూటమికి సానుకూలంగా మారే అవకాశాలున్నాయి.

బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడల్లా టీడీపీకి ముస్లిం ఓట్లు తగ్గుతున్నాయి. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి 33 శాతమే ముస్లిం ఓట్లు రాగా, 2019లో బీజేపీకి ఎదురు తిరగడంతో అవి 46 శాతానికి పెరిగాయి. 

2019 ఎన్నికల్లోలాగా ఏకపక్షంగా రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు నిలబడేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. వాలంటీర్లను తీసుకొచ్చి, స్థానికంగా తమ నాయకత్వాన్ని దెబ్బ తీశారని వైఎస్‌ఆర్‌సీపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ప్రతి సామాజికవర్గంలో, సమూహాల్లో  వైసీపీకి 2019లో వచ్చిన ఓట్ల శాతంలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. 

రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలోని నేతలు మొదలుకొని కార్యకర్తల వరకూ క్షేత్రస్థాయిలో పొత్తుపై మానసికంగా సిద్దపడడం  కలిసి వచ్చే అంశం.  ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్‌పై ఉన్న అభిమానం, వ్యక్తిగత ఆరాధన ఆ కూటమికి కలిసి రావచ్చు. ఈ రెండు జిల్లాల్లో జనసేనకు 15`25 శాతం వరకూ ఓట్లుంటాయి. కొన్ని స్థానాల్లో 30 శాతం వరకూ ఉన్నాయి. కొన్ని ఇతర జిల్లాల్లో కూడా 10`15 శాతం వరకూ ఆ పార్టీకి ఓట్లుండడం కూటమి విజయానికి సోపానం అవుతాయి. రాయలసీమలో జనసేనకు కనీసం 5 శాతం వరకు నిర్ణయాత్మక ఓట్లున్నాయి. 

ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి అకౌంట్లల్లో డబ్బులు వేయడం, సంక్షేమ పథకాలే వైఎస్‌ఆర్‌సీపీని  గెలిపిస్తాయనుకుంటే అత్యాశే అవుతుంది. దివంగత ఎన్టీఆర్‌ తాను హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ 1983`89 వరకు అమలు చేసినా, 1989లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతోపాటు ఆయన కూడా కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. 2004`2009 మధ్య దివంగత నేత డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా 2009 ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో మరోసారి అధికారంలోకి  వచ్చారు. ఆ ఎన్నికల ఫలితాల తరువాత మీడియా సమావేశంలో, శాసనసభ సాక్షిగా కూడా కేవలం పాస్‌మార్కులు మాత్రమే తమకు వచ్చాయని వైఎస్‌ఆర్‌ నొక్కివక్కాణించారు. 

దివంగత నేత వైఎస్‌ఆర్‌ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని 2014 వరకు కాంగ్రెస్‌ కొనసాగించినా తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులోనూ జయలలిత మరణానంతరం ఆమె చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం అమలు పరిచినా అన్నాడీఎంకే ఓడిరది. తెలంగాణలో పది సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందించిన బీఆర్‌ఎస్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. చరిత్రలో ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. 

ప్రభుత్వం పథకాలు ఇస్తున్నా నిత్యవసర ధరలు, అధిక కరెంటు, బస్‌చార్జీలు, వివిధ పన్నుల రూపేణ వసూలు చేస్తున్న వాటితో పోలిస్తే ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటున్నట్లు ఉందని విమర్శలున్నాయి. సంక్షేమం పేరిట అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే  అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. రోడ్ల దుస్థితిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి జనసేన`టీడీపీ`బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రచార ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు మరింత పెరుగుతాయనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడమే కారణం.

‘ఒక్క చాన్స్‌ ఇస్తే, రాజన్న పాలన తీసుకొస్తా’ అన్నందుకు 2019లో వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలా ఇప్పుడు    దూరమయ్యారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలలో ఇప్పుడు అలాంటి కసి, పట్టుదల కనిపించడం లేదు. కేవలం ఈ ఐదేళ్లలో సీఎంగా ఆయన పాలనే ఈ ఎన్నికల్లో గీటురాయిగా మారుతుంది కాబట్టి, ఈసారి దివంగతనేత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సానుభూతి, ‘‘రాజన్న కార్డూ’’ పనిచేయదు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చిన సామాజికవర్గాలు దూరమవుతుండగా, టీడీపీకి దూరమైన సమూహాలు, ముఖ్యంగా బీసీలు, రైతులు తిరిగి దగ్గరవుతున్నారు. 

జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిగా పోటీచేస్తే 2019లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ స్థానాల్లో కూటమి సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి.  ఇన్ని సానుకూలతల మధ్య ‘సంక్షేమం-అభివృద్ధి’ సమపాలళ్లో తమ ఎజెండాలో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి చేర్చుకుని ముందుకెళ్తే నిస్సందేహంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘వై నాట్‌ టీడీపీ-జనసేన`బీజేపీ?’.

============================

ఐ. వీ. మురళీకృష్ణ శర్మ,

రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.