తెలుగు నాట వై.ఎస్.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రాజకీయ నేతలకు మార్గదర్శకంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు చేరువై జననేతగా ఎదిగిన వైఎస్‌ఆర్ పాదయాత్ర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైఎస్‌ఆర్ అడుగుజాడల్లోనే పాదయాత్రలు చేపట్టి అందలమెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టారు.
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఆగస్టు 31 నాటికి 200 రోజులకు చేరుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలనే సంకల్పంతో ప్రారంభించిన ‘యువగళం’ ఒక్కో కిలోమీటరుకు సగటున 1300 అడుగులతో సాగుతుందని అంచనా వేయవచ్చు. ఈ లెక్కన చూస్తే లోకేశ్ మొత్తం 52 లక్షల అడుగుల పాదయాత్ర చేస్తున్నట్టు లెక్క. లోకేశ్ వేసే ఒక్కో అడుగు టీడీపీకి ఒక్కో ఓటును తెచ్చిపెడితే ‘యువగళం’ పాదయాత్ర విజయవంతం అయినట్టే.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 33.83 లక్షలు. ‘యువగళం’ ఒక్కో అడుగుతో టీడీపీ ఒక్కో ఓటు రాబడితే 52 లక్షల అడుగుల పాదయాత్రతో టీడీపీ లక్ష్యం నెరవేరినట్టే. లోకేశ్ పాదయాత్రతో 2019లో వచ్చిన ఓట్ల వ్యత్యాసాన్ని అడుగులతో చూసుకుంటే టీడీపీకి 2024 ఎన్నికల్లో దాదాపు 19 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతతో భారీ ప్రయోజనం చేకూరవచ్చని అంచనా వేయవచ్చు. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం మొత్తం మీద 6 లక్షలకుపైగా ఉంది. ఈ ఎన్నికల్లో పరాజయం పొందిన జగన్ 3500 కి.మీలకు పైగా ‘ప్రజా సంకల్ప’ యాత్ర చేపట్టి 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో అందలమెక్కారు. 3500 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ సగటున 1300 అడుగులతో పూర్తి చేసినట్టు లెక్కేసుకుంటే దాదాపు 45 లక్షలకు పైగా అడుగులయ్యాయి. ఈ లెక్కన ఒక్కో అడుగును ఒక్కో ఓటుతో పోల్చుకుంటే 2014లో వచ్చిన 6 లక్షల ఓట్ల వ్యత్యాసం కంటే 2019లో 39 లక్షలకుపైగా అదనపు ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలను పోల్చుకుంటే ‘యువగళం’తో టీడీపీకి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రయోజనాలుంటాయి. క్షేత్రస్థాయిలో ‘యువగళం’ పాదయాత్రను పరిశీలిస్తే అనేక బలాలు, బలహీనతలు బయటపడ్డాయి.
లోకేశ్ 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ‘యువగళం’ పాదయాత్రని 2023 జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభించారు. ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియనుంది. ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్రను ముగించుకొని ఆగస్టు 31న పశ్చిమగోదావరి జిల్లాలో 200 రోజులకు చేరుకుంటున్న ‘యువగళం’ 77 నియోజకవర్గాలు, 185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా 2710 కిలోమీటర్లు సాగింది. 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సమావేశాలు, 10 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాగుతున్న ఈ పాదయాత్రలో లోకేశ్‌కు వివిధ సమస్యలపై 3800 పైగా వినతిప్రతాలు అందాయి. విజయవంతంగా కొనసాగుతున్న ‘యువగళం’ లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు సోపానంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేశ్ ‘తండ్రి చాటున బిడ్డ’ అని అతనికి రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదని, ఎమ్మెల్యేగా ఓడిపోయన లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టడానికే ఎమ్మెల్సీని చేశారనే అనేక విమర్శలు ‘యువగళం’ పాదయాత్రతో పటాపంచలయ్యాయని చెప్పవచ్చు. లోకేశ్ ముందున్న పెద్ద సవాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతోపాటు మంగళగిరిలో ఎమ్మెల్యేగా విజయం సాధించడం. ఈ రెండు లక్ష్యాలు నెరవేరితే ఆయన తిరుగులేని నాయకుడిగా మారతారు.
రాజకీయంగా ఎవరెన్ని మాటలు చెప్పినా, విమర్శలు చేసినా ‘యువగళం’ పాదయాత్రతో లోకేశ్ ఒక కీలక నేతగా ఎదిగారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ‘కష్టే ఫలి’ సూత్రాన్ని నమ్ముకొని కష్టపడుతున్న తీరు చూస్తుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో నాలుగు గోడల మధ్య ఉంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన లోకేశ్ ప్రజాక్షేత్రంలోకి వచ్చాక రాజకీయ పరిణితిని సాధించారు. లోకేశ్ వ్యూహాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించాలనే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పలువురు టీడీపీ నేతలు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన లోకేశ్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలలో ధైర్యం నింపుతున్నారు. ఆయా నియోజకవర్గ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే, నేతలను లక్ష్యంగా చేసుకొని వారి అవినీతిని ఆధారాలతో సహా ధైర్యంతో ఎండగడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.
అయితే లోకేశ్ చేస్తున్న శ్రమను పార్టీ నేతలు అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. వారి నియోజకవర్గాలకు పాదయాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా హడావుడి చేస్తూ ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియాలో పోస్టర్లకే పరిమితమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఖాయం చేసుకోవాలనే దృష్టితో పాదయాత్ర ఖర్చులను భరిస్తూ హంగామా చేయడం తప్పించి, పాదయాత్ర అనంతరం అదే ఉత్సాహాన్ని పార్టీలో కొనసాగించలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలు, బలహీనతలను గుర్తిస్తున్న లోకేశ్‌కు పార్టీలో బలమైన వారు ఎవరు..? కష్టపడుతున్న వారెవరు..? షో చేస్తున్న నేతలు ఎవరనే వారిపై స్పష్టత వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మొహమాటాన్ని సాకుగా తీసుకొని కొందరు సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ఇప్పుడు లోకేశ్ ఇందుకు భిన్నంగా ఎలాంటి మోహమాటాలకు పోకుండా కిందస్థాయి కార్యకర్తల నుండి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకుంటూ ఉన్నదున్నట్లు సీనియర్ నాయకులతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి దిశ నిర్ధేశం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను అంచనా వేసి అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలతో, స్థానిక కార్యకర్తలతో, అభిమానులతో ‘సెల్ఫీ విత్ లోకేశ్’ పేరిట ఫొటోలు దిగుతుండడంతో అందరికీ చేరువవుతున్నారు. ఇప్పటి వరకు ఆయన మూడు లక్షల మందితో ఎంతో సహనంగా ఫొటోలు దిగడం గమనార్హం.
‘యువగళం’లో భాగంగా వందకు పైగా వివిధ సమావేశాలలో పాల్గొన్న లోకేశ్ స్థానిక సమస్యలను తెలసుకోవడానికి ప్రాధాన్యతిచ్చారు. రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వ్యాపారస్తులతో పాటు పలువురితో చర్చిస్తూ వారి సమస్యలకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే పరిష్కారం చూపుతామని హామీ ఇస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నారు.
లోకేశ్ వ్యవహారశైలీలో వచ్చిన మార్పును పాదయాత్రలో గమనించవచ్చు. గతంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ ‘జగన్మోహన్‌రెడ్డి’ అని సంబోధించే లోకేశ్ ‘జగన్మోహన్’ అని మాట్లాడుతున్నారు. ‘రెడ్డి’ అంటూ విమర్శలు చేస్తూ ఆ సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకోదల్చుకోలేదు. వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సమస్యలపైనే దృష్టి పెడితే ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశాలుంటాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనుల గురించి చెబుతూ, తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెబితే ప్రజలు ఆదరిస్తారు. పాదయాత్రలో పార్టీకి మొదటి నుండి వెనుముక్కగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన అంశాలకు ప్రాధాన్యతిస్తే వారు ఆకర్షితులవుతారు.
‘యువగళం’ విజయవంతంగా సాగుతున్నా, పాదయాత్రలో కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఏర్పాటు చేసుకున్న ‘షో టైమ్ కన్సల్టెన్సీ’ సంస్థపై లోకేశ్ మితిమీరి ఆధారపడ్డారనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వినిపించింది. ‘యువగళం’లో కన్సల్టెల్సీకి ప్రాధాన్యత తగ్గించి పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న కొన్ని ఈవెంట్స్ కూడా కృత్రిమంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. పాదయాత్రకు ఎంచుకున్న మార్గంలో కూడా లోపాలు కనిపించాయి. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరు మీదుగా పాదయాత్రను ఏర్పాటు చేయకపోవడం ప్రణాళిక లోపం. ఎన్టీఆర్ శతజయంతి జరుపుకుంటున్న ఈ సందర్భంలో నిమ్మకూరును ‘యువగళం’లో చేర్చుంటే అభిమానుల్లో సెంటిమెంట్ పండి ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా ‘యువగళం’ పాదయాత్రకు గుర్తింపు లభిస్తున్నా, జాతీయ మీడియాను ఆకర్షించడంలో మాత్రం టీడీపీ యంత్రాంగం విఫలమైంది.
పాదయాత్రపై అధికార వైఎస్‌ఆర్‌సీపీ ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఆ పార్టీ ‘యువగళం’తో ఆత్మరక్షణలో పడిందని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర ఆ జిల్లా దాటకముందే రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మూడు శాసనమండలి స్థానాలను గెలుచుకోవడంతోపాటు పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ‘ఇండియా టుడే’ సంస్థ సర్వేలో టీడీపీ ఏపీలో 15 ఎంపీ స్థానాలను గెల్చుకుంటుందని ప్రకటించడం ‘యువగళం’కు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని చేకూర్చాయి. పాదయాత్రను వైఎస్‌ఆర్‌సీపీ తేలిగ్గా తీసుకుంటున్నట్టు పైకి కనిపిస్తున్నా ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందని చెప్పవచ్చు. పాదయాత్రకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అనేక ఆటంకాలు కలిగించారు. చిత్తూరు జిల్లా మొదలుకొని కృష్ణా జిల్లా వరకు పలు చోట్ల ఘర్షణ వాతావరణం, పోలీసుల కేసులు నమోదయ్యాయి. పలువురు టీడీపీ కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా లోకేశ్‌పై మూడు కేసులు నమోదు చేశారు.
‘యువగళం’ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఏమాత్రం ఉండదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నా లోకేశ్ పాదయాత్ర కచ్చితంగా నిర్ణయాత్మకంగా మారబోతుంది. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘జోడో యాత్ర’ ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని పలు సర్వేల్లో వెల్లడి కావడం ఇక్కడ గమనార్హం. ‘యువగళం’ అనే పదంలో ‘యువ’ అంటే యువతకే ప్రాధాన్యత అనిపించేలా ఉన్నా, లోకేశ్ తన పాదయాత్రలో యువతతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు. ‘యువగళం’ రాబోయే ఎన్నికల్లో ఓట్లను కురిపిస్తే టీడీపీ భవిష్యత్తరాలకు లోకేశ్ ఒక దిక్సూచిలా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
============================================
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,