‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ 10% పైగా వృథాగా  ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వ్యాక్సిన్‌ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  వ్యాక్సిన్‌ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని పర్యవేక్షించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ తో పాటు కేసులు‌ నిరంతరం పెరుగుతోందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు.  కరోనా నియంత్రణకు ఔషధం తీసుకున్నామన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచడం ముఖ్యమని, తద్వారా కొత్త కేసులు త్వరగా వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు.

మొదటి రెండు స్థానాల్లో తెలంగాణ, ఏపీ..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వృథాలో మొదటి రెండు స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో 17.6%, ఆంధ్రప్రదేశ్‌లో 11.6%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 9.4% వ్యాక్సిన్‌ వృథా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇది భారతీయ సగటు వృథా 6.5%కంటే చాలా ఎక్కువని చెప్పారు. రోజువారీ సగటున డోసులు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. మార్చి 1 నుంచి 15వ తేదీ మధ్యకాలంలో కేసుల సంఖ్య పరంగా ఏపీలోని కృష్ణాజిల్లాలో 171.4%, తూర్పుగోదావరి జిల్లాలో 150%, విశాఖపట్నం జిల్లాలో 100%, చిత్తూరు జిల్లాలో 92%, గుంటూరు జిల్లాలో 70% పెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు.