డెల్టా వేరియంట్ తో ప్రపంచం ప్రమాదంలో ఉంది: డబ్ల్యూహెచ్వో

కరోనా రూపాల్లో ఒకటైన డెల్టా వేరియంట్ తో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. దాదాపు 100 దేశాలలో కరోనా డెల్టా వేరియంట్‌ను గుర్తించారని తెలిపారు. భారత్‌లో మొదటిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ఇది చాలా దేశాలలో ప్రమాదకరంగా మారిందని చెప్పారు.

వచ్చే ఏడాది ఈ సమయానికి కల్లా ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకాలు వేసేలా చూడాలని.. అన్ని దేశాల నేతలను తాను కోరినట్లు అథనోమ్ వెల్లడించారు. కరోనా డెల్టా వేరియంట్ దశను సమర్థంగా అడ్డుకోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా పలు ధనిక దేశాలు.. పేద దేశాలకు ఒక బిలియన్ కొవిడ్‌ వ్యాక్సిన్లు విరాళంగా ఇస్తామని వెల్లడించినట్లు డబ్ల్యుహెచ్వో స్పష్టం చేసింది.