విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపూల్!

బాలీవుడ్ స్టార్స్ రిలేషన్స్ విషయములో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు . వారి మధ్య బంధాలు గాలి బుడగలాంటివి. ఇట్టే కలిసిపోతారు.అట్టే విడిపోతారు. తాజాగా మరో స్టార్ కపూల్ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పిల్లాడి బాధ్యతను ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు.

విడాకుల విషయమై స్పందిస్తూ..15 సంవత్సరాల వైవాహిక బంధం జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులుగా ఉండాలనుకుంటున్నాం. ఎంతోకాలం నుంచి మేము విడిపోవాలని అనుకుంటున్నాం. విడాకులు తీసుకోవడానికి ఇదే సరైన సమయంగా మేము భావిస్తున్నాం. మా కుమారుడు ఆజాద్‌కి తల్లిదండ్రులుగా ఉంటూ అతని బరువు, బాధ్యతలు ఉమ్మడిగా చూసుకుంటాం. అలాగే, పానీ ఫౌండేషన్‌, ఇతర వృత్తిపరమైన విషయాల్లో మేమిద్దరం కలిసే పనిచేస్తాం. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మాకు ఎంతగానో సపోర్ట్‌ చేసిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. మా వైవాహిక బంధానికి ముగింపులా చూడకుండా.. కొత్త ప్రయాణానికి నాందిగా భావించండి అని అమిర్ ఖాన్ దంపతులు ప్రకటించారు.

కాగా అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకుని .. కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమిర్‌ కథానాయకుడిగా నటించిన ‘లగాన్‌’ సినిమాకి కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం 2005 డిసెంబర్‌ 28 వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 2011లో ఆజాద్‌ అనే బాబుకి సరోగసి పద్ధతిలో ఈ దంపతులు జన్మనిచ్చారు.