మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు పథక రచన చేసిన సూత్రధారులు ఎవరో తేలిపోయిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఈ హత్య వెనుక అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. హత్యకు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును ఏర్పాటు చేస్తామని ఎవరైనా గాడ్ ఫాదర్ చెప్పారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్య చేసిన వారు ముందే దొరికారని, ఇప్పుడు లెవెల్ వన్ సూత్రధారుల పేర్లు బయటకు వచ్చాయని తెలిపారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి, ప్రకాష్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ప్రణాళిక రచించగా, ఆ పథకాన్ని మరో నలుగురు అమలు చేశారని హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన సునీల్ యాదవ్ బెయిల్ అభ్యంతర పిటిషన్ లో పేర్కొందన్నారు. ఈ విషయాన్ని కొన్ని పత్రికలు స్పష్టంగా రాశాయని కానీ సాక్షి దినపత్రిక దీనిపై కనీసం ఒక్క లైను కూడా రాయలేదన్న ఆయన.. సాక్షి దిన పత్రికలో రాయనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని అన్నారు. పులివెందులలో ఈనాడు, ఆంధ్ర జ్యోతి దినపత్రిక ప్రతులను దగ్ధం చేసినంత మాత్రాన ప్రయోజనం ఏముంది అని రఘురామ ప్రశ్నించారు.