కార్మికుల సొమ్ములు మాయం చేసిన వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మ‌నోహ‌ర్‌

* కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ.12 వందల కోట్లు ఏం చేశారో జవాబు చెప్పాలి
* కార్మిక ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం
* ఇసుక కొరతను సృష్టించి కార్మికుల కడుపు కొట్టారు
* శ్రమ జీవుల తరుఫున బలంగా పోరాడే నాయకుడు  పవన్ కళ్యాణ్ 
* విశాఖపట్నంలో మే డే వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ 
* భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనం

‘కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వైసీపీ సర్కారు దిగమింగిందన్నారు జ‌న‌సేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ . కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు దారి మళ్ళించిందిని ఆరోపించారు. కార్మికులకు కనీస సాయం అందడం లేదన్నారు. కార్మిక దినోత్సవం మే డే సందర్బంగా విశాఖపట్నంలో సోమవారం వివిధ కార్యక్రమాల్లో మనోహర్ పాల్గొన్నారు. గాజువాక దుర్గా నగర్ లో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని మే డే జెండా ఎగురవేశారు. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.

 

అనంత‌రం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వైసిపి ప్రభుత్వం నాలుగుసార్లు ఇసుక విధానాన్ని మార్చిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిందన్నారు. కార్మికులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇష్టానుసారం వాడేసిందని మండిప‌డ్డారు. సెస్ రూపంలో జమ అయిన రూ.12 వందల కోట్లు ఎలా మాయం చేశారో కార్మికులకు సమాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమ బోర్డును భ్రష్టు పట్టించిందన్నారు. కార్మికులకు సంబంధించిన పెళ్లి కానుక, ప్రసూతి సమయంలో అందించే డబ్బులను నిలుపుదల చేసిందని.. కార్మికులు మరణిస్తే అంత్యక్రియలు నిమిత్తం ఇచ్చే రూ. 20వేల సాయాన్ని కూడా ఆపేయడం సిగ్గుచేటని దుయ్య‌బ‌ట్టారు. కార్మికులు ప్రభుత్వం నుంచి సహాయం ఏమి అడగడం లేదన్నారు. వారు దాచుకున్న డబ్బులు ఇమ్మని అడుగుతున్నా సమాధానం లేదన్నారు. నవరత్నాల పేరుతో కార్మికుల డబ్బులను పక్కదారి పట్టించిన వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో చూపిందని మ‌నోహ‌ర్ ఎద్దేవా చేశారు.

కార్మికుల తరఫున పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్..
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక కష్టాలు మొదలయ్యాయన్నారు మ‌నోహ‌ర్‌. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇసుక విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళిందర‌న్నారు. ఫలితంగా ఇసుకలో అవినీతి రాజ్యమేలిందని.. కనీసం దానిని నిలువరించే పనులు వైసీపీ చేయలేదని విమ‌ర్శించారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిందని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇసుక దెబ్బకు పనులు లేక పస్తులు ఉన్న భవన నిర్మాణ కార్మికుల తరఫున నిజాయతీగా నిలబడిన నాయకుడు పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. విశాఖపట్నంలో జరిపిన లాంగ్ మార్చ్ కార్మిక పోరాటాల్లో చిర స్థాయిగా నిలిచిపోతుందని.. కార్మిక సమస్యలు తీర్చాలానే నిబద్ధత జ‌న‌సేనానికి తప్ప మరెవరికి లేదని తేల్చిచెప్పారు. కేవలం వారి గురించి పోరాడమే కాదు… కష్టాల్లో ఉన్న కార్మికుల కడుపు నింపాలని డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను జనసేన పార్టీ సమర్థంగా నిర్వహించిందని .. రాష్ట్రంలోని కార్మికుల కడుపు నింపే ఆలోచన చేశామ‌ని మ‌నోహ‌ర్ స్ప‌ష్టం చేశారు..

కార్మికులతో కలిసి భోజనం..
మే డే సందర్భంగా కార్మికుల సమస్యలు తెలుసుకోవడమే కాక వారి సమస్యలపై మ‌నోహ‌ర్‌ ఆరా తీశారు. కార్మికులతో కలిసి భోజనం చేశారు. వారితో మచ్చటిస్తూ ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల మీద ఆరా తీశారు.

కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందజేత..
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇండస్ట్రియల్ బెల్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు బియ్యం, నిత్యావసరాల పంపిణీను ఆయ‌న‌ చేతుల మీదుగా అందజేశారు. కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా జనసేన పార్టీ కార్మికుల లోకానికి అండగా నిలబడుతుందని భరోసా మ‌నోహ‌ర్ ఇచ్చారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole