అమరావతి:
ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం లేఖ రాసింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వారిద్దరినీ బదిలీ చేస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బదిలీలు చేయడం సరికాదని ప్రభుత్వానికి సూచించింది.
ప్రభుత్వంపై ఆధిపత్య పోరులో నిమ్మగడ్డ..
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వం చెప్పినప్పటికి న్యాయస్థానాలకు వెళ్లి మరీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ప్రస్తుతం ఆయన చర్యలు చూస్తే అడుగడుగునా ప్రభుత్వంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే అధికారుల బదిలీల విషయంలో నిమ్మగడ్డ దాగుడుమూతలు ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.