– బ్రిస్బేన్ టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం
– గిల్, పుజారా , పంత్ అర్ధ శతకాలు..
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. 329పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఆటగాళ్లు శుభమన్ గిల్(91) రిషబ్ పంత్(89 నాటౌట్) చటేశ్వర పుజారా(56) అర్ధ సెంచరీలు సాధించడంతో మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు(4/55) నాథన్ లియన్ రెండు(2/85)హజలవుడ్(1/74) వికెట్లు పడగొట్టారు.
‘గిల్’ క్లాస్..
329 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ(7)ను కమిన్స్ ఔట్ చేసి ఆసీస్ కు శుభారంభం అందిచాడు. వన్డౌన్లో వచ్చిన పుజారా గిల్తో కలిసి114 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకోల్పి ఒత్తిడిని తగ్గించాడు. ముఖ్యంగా గిల్ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీ సాధించాడు. పుజారా సైతం చెత్త బంతులు దొరికినప్పుడల్లా బౌండరీ తరలించాడు. గిల్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్లో ఔటవడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానే ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు.
పంత్ ‘మాస్’ టచ్..
కెప్టెన్ అజింక్యా రహానే ఔటవడంతో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు పంత్ తనదైన శైలిలో ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్న ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు.ఈక్రమంలోనే టెస్టులో 1000 పరుగులు మైలు రాయిని చేరుకున్నాడు. మరో వైపు వికెట్లు పడుతుండడంతో పంత్ దూకుడుగా ఆడుతూ మయాంక్, వాషింగ్టన్ సుందర్ తో కలిసి మిగిలిన తతంగానీ పూర్తిచేశాడు.