30 రోజుల్లో ప్రేమించటం ఎలా : రివ్యూ

చిత్రం : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?

తారాగణం : ప్రదీప్ మాచిరాజు , అమృత అయ్యర్ , పోసాని కృష్ణ మురళి, హైపర్ ఆది ,రాంప్రసాద్, మహేష్
సంగీతం : అనూప్ రూబెన్స్

నిర్మాత : ఎస్వి బాబు

రచన దర్శకత్వం : మున్నా

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న ప్రదీప్ మొదటి సారి హీరోగా నటించిన చిత్రం కావడం విశేషం. అంతేగాక చిత్రానికి సంబంధించి విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’ పాటకి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందన్నా ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి తరుణంలో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకుల అంచనాలు నెరవేరాయా లేదా అన్నది చూద్దాం!

కథ : అర్జున్ (ప్రదీప్) , అక్షర ( అమృత) పక్క పక్క ఇళ్లలోనే ఉంటూ ఒకే కాలేజీలో చదువుతుంటారు. వారికి ఒకరంటే ఒకరు పడదు. నిత్యం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు. ఓ రోజు కాలేజ్ స్నేహితులతో కలిసి అరకు టూర్ కి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఇద్దరూ ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఒకరి శరీరం లోకి మరొకరు ప్రవేశించడానికి గల కారణం ఏంటి? తెలియాలంటే చిత్రం చూడాల్సిందే!

ఎలా ఉందంటే : పూర్వజన్మల ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాల చిత్రీకరణ అంతగా ఆకట్టుకోలేదు. వారిద్దరూ కలిసినప్పుడు, విడిపోయినప్పుడు వచ్చే సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. ప్రథమార్థం కాలేజీలో హీరో హీరోయిన్స్ మధ్య జరిగే అల్లరి సన్నివేశాలు , కామెడీ, పాటలు కొంత మేర ఒకే అనిపిస్తోంది. ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. హీరో హీరోయిన్ ప్రేమకు కారణమైన ప్రేమ కథను ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్ కుటుంబాల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి.

ఎవరెలా చేశారంటే:

యాంకర్ ప్రదీప్ నటిస్తున్న మొదటి చిత్రమైన తన నటన చూస్తే ఎక్కడ తన మొదటి చిత్రంగా అనిపించదు. కామెడీ, భావోద్వేగాల సన్నివేశాలలో ప్రదీప్ నటన మెచ్చుకోవాల్సిందే. అమృత తన అందం అభినయంతో పాత్ర పరిధిమేర నటించింది. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అనూప్ సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడి పనితీరు ఓకే అనిపిస్తుంది.
చివరగా : అనేక ప్రేమకథల్లో ఓ ప్రేమ కథ.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడికి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే.