ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో చాలెంజర్స్ 38 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మాక్స్‌వెల్(78; 49 బంతుల్లో 9×4, 3×6), డివిలియర్స్(76*; 34 బంతుల్లో 9×4,3×6) మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు. ఓపెనర్ విరాట్ కోహ్లీ(5), రజత్ పాటిదార్(1) త్వరగా ఔటైనా.. దేవ్‌దత్ పడిక్కల్(25; 28 బంతుల్లో 2×4)తో కలిసి మాక్సీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పడిక్కల్ ఔటయ్యాక.. డివిలియర్స్‌తో జోడీ కట్టిన మాక్సీ మరింత దూకుడుగా ఆడాడు. అయితే, కమిన్స్ వేసిన 17వ ఓవర్‌లో పుల్‌షాట్ ఆడబోయి హర్భజన్ చేతికి చిక్కాడు. అప్పటికి ఆర్సీబీ స్కోర్ 148/4గా నమోదైంది. ఇక చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. కైల్ జేమీసన్(11*)తో కలిసి 18 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ప్రసిద్ద్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక బెంగళూరు నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 166 పరుగులకే పరిమితమైంది. రసెల్(31; 20 బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(29; 23 బంతుల్లో 1×4, 2×6) రాణించిన ఫలితం లేకుండా పోయింది. ఆది నుంచీ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం.. చివర్లో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో కోల్కతా ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో జేమీసన్ మూడు, చాహల్ రెండు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశారు.