Nancharaiah merugumala senior journalist:
‘ పది మంది ఉత్తమ సమకాలీన తమిళ రచయితల్లో ఐదుగురు దళితులే ఉండగా తెలుగు రచయితల్లో ఇద్దరైనా ఉన్నారా? ‘
‘ పది మంది సమకాలీన ఉత్తమ తమిళ రచయితల పేర్లు చెప్పమంటే ఐదుగురు దళితులు నాకు కనిపిస్తారు. తమిళంలో దళిత సాహిత్యం ముందుకొచ్చాకే తమిళ రచనలను ఇంగ్లిష్‌లోకి అనువదించడం బాగా పెరిగింది,’ అని చెన్నైలో జరగుతున్న ‘ద హిందూ లిట్ ఫెస్ట్ 2024’ కార్యక్రమంలో శనివారం ప్రసిద్ధ తమిళ దళిత రచయిత అళగియ పెరియవాన్ అభిప్రాయపడ్డారు. మరి, తెలుగులో పది మంది సమకాలీన ఉత్తమ రచయితల్లో ఇద్దరైనా దళిత రైటర్లు ఉన్నారా? అని అడిగితే– సమాధానం దళిత తెలుగు కవులే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే ఓబీసీ, దళిత కుటుంబాల్లో పుట్టిన రచయితలు, జర్నలిస్టులు, నటీనటులు, సినీ సంగీత దర్శకులు, గాయకులు తమిళనాడు, కేరళలోనే చాలా ఎక్కువ కనిపిస్తారు. కమ్యూనిస్టు, ఇతర రాజకీయ–సామాజిక ఉద్యమాలు ఇది వరకు ఎప్పుడో ఉధృతంగా నడిచిన తెలుగు ప్రాంతాల్లో పైన చెప్పిన రంగాల్లో బీసీ, ఎస్సీ కులాలకు చెందినవారి ప్రాతినిధ్యం సంతృప్తికరమైన స్థాయిలో లేదు. హిందీ, మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లోనే ఈ రంగాల్లో దళిత, బీసీల వాటా చాలా మెరుగ్గా ఉంది. తెలుగునాట ఈ పరిస్థితికి కారణాలేంటో ఎవరూ అధ్యయనం చేయడం లేదనిపిస్తోంది.

 
                         
                         
                         
                         
                         
                         
				
			 
				
			 
				
			 
				
			