janasena: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశం; మంత్రి నాదెండ్ల మనోహర్.

Nadendlamanohar:

‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశమ‌న్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా స్వీకరించి కష్టకాలంలో వారికి అండగా నిలవాలన్న మనోహన్నత లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టార‌న్నారు. సభ్యత్వ నమోదు ద్వారా క‌ష్ట‌కాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తలో ధైర్యం, భరోసా నింపగలిగామ‌ని అన్నారు. జనసైనికులు, వీర మహిళలు సైతం ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వాములయ్యారని. . ఈ రోజున పెద్ద దిక్కు కోల్పోయిన 344 కుటుంబాలకు అండగా నిలిచేలా చేసిందని స్పష్టం చేశారు. జన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామ‌ని తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమ ఆవశ్యకతను ప్రజలకు వివరించి వారిని కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

గురువారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాదెండ్ల‌ లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడకు చెందిన జన సైనికుడు వటాల హరిప్రసాద్, నాగమణి దంపతులకు ఆయ‌న‌ తొలి సభ్యత్వాన్ని అందచేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆపత్కాలంలో కార్య‌క‌ర్త‌ల‌ కుటుంబాలకు అండ‌గా నిలిచేందుకు జ‌న‌సేన అధినేత ఆలోచనలో నుంచి పుట్టినదే క్రియాశీలక సభ్యత్వమ‌ని ఆయ‌న కొనియాడారు. కోవిడ్ కష్టకాలంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మొదటి ఏడాది లక్ష, రెండో ఏడాదికి మూడున్నర లక్షలు.. గత ఏడాది 6.47 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయయ‌ని తెలిపారు. ఈ ఏడాది 10 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని అన్నారు. గడచిన మూడేళ్లలో రూ. 20 కోట్లు పరిహారంగా ఆయా కుటుంబాలకు అందచేశామ‌ని .. గత మూడేళ్లుగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ఆనవాయితీని కొనసాగించేందుకే తెనాలి కంటే ముందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చామ‌ని.. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల సభ్యత్వాలు నమోదు చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి మ‌నోహ‌ర్‌ స్ప‌ష్టం చేశారు.

ప్రభుత్వానికీ… ప్రజలకీ మధ్య వారధిగా నిలవాలి..

గత పదేళ్లుగా జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో పార్టీని నడిపిస్తున్నారని నాదెండ్ల అన్నారు. గత ఆరేళ్లుగా మనం చేస్తున్న పోరాటాలను ప్రజలు కూడా ఆదరించారని. . ఇప్పుడు అధికారంలో ఉన్నాం క‌నుక‌ జన సైనికులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార‌ధిగా నిల‌వాల‌ని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడంలో పాలుపంచుకోవాలని నాదెండ్ల మ‌నోహ‌ర్ సూచించారు.

Optimized by Optimole