MLCElections2024:
ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్థులు..ఆశావహులు ప్రచారాన్ని మొదలెట్టారు. రోజువారీగా వివిధ కార్యక్రమాల పేరిట ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సమంగా సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచించడంలోనిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరునూరైనా సరే బలమైన అభ్యర్థిని రంగంలో నిలిపి గెలిచి తీరాలని దృడ నిశ్చయంతో కనిపిస్తోంది.
టికెట్ కోసం మంత్రుల లాబీయింగ్..
కరీంనగర్, ఆదిలాబాద్ ,నిజామాబాద్ మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన పోటీలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉండడంతో..టికెట్ కోసం పోటీ తీవ్రతరమైంది. ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి.. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ కోసం ఇద్దరు మంత్రులు లాబీయింగ్ మొదలెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పోటీ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విద్యావంతుడు పులిపాక ప్రసన్న హరికృష్ణ గౌడ్ సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పరిధిలో పలు విద్యాసంస్థల పట్టభద్రులు, వేలల్లో పూర్వ విద్యార్థులు ఉండడం నరేందర్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
బలాలు;
– అధికారంలో ఉండటం
-ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు అధికం
-ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు బలంగా ఉండటం
బలహీనతలు;
– సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వ వ్యతిరేకత
– పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం
– మంత్రుల మధ్య వర్గపోరు
బీజేపీ టికెట్ ఎవరికో..?
ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో బీజేపీకి నాలుగు ఎంపి స్థానాలు ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ప్రధానంగా పార్టీ టికెట్ కోసం సీనియర్ నేత పొల్సాని సుగుణకార్ రావు..మంచిర్యాల జిల్లాకు చెందిన వెరబెల్లి రఘునాథ్ పోటీపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరూ నేతలు ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు మెదక్ నియోజక వర్గానికి చెందిన వ్యాపార వేత్త అంజిరెడ్డి సైతం పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెల్సింది. వీరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రఘునాథ్ మాత్రం పలుమార్లు కేంద్రమంత్రిని కలిసి మద్దతు కోరినట్లు తెలిసింది.
బలాలు;
– ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో నలుగురు ఎంపీలు
– అధికార పార్టీపై వ్యతిరేకత
– పార్టీ పట్ల యువత సానుకూలంగా ఉండటం
బలహీనతలు;
– పార్టీలో వర్గపోరు
– టికెట్ ఆశించే అభ్యర్థులు బలంగా లేకపోవడం
– ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం
బిఆర్ఎస్ సత్తా చాటేనా.?
లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయిన బిఆర్ఎస్.. ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవాలని తీవ్ర పట్టుదలగా కనిపిస్తుంది. పార్టీ టికెట్ కోసం కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, రాజారాం యాదవ్, ప్రముఖ డాక్టర్ బీఎన్ రావు పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.వీరితో పాటు ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేషగిరిరావు టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన గుడ్ మార్నింగ్ పేరిట వివిధ నియోజకవర్గాల వాకర్స్ తో సమావేశాలు ఏర్పాటు చేయడం గమనార్హం. మిగతా అభ్యర్థులు సైతం విద్యావంతులు, మేధావులను కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బలాలు;
– ప్రభుత్వ వ్యతిరేకత
– పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత
_ అధికార పార్టీ తర్వాత ఎమ్మెల్యేలు అధికంగా ఉండటం
బలహీనతలు;
– పార్టీ కేడర్లో నైరాశ్యం
– పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం
– టికెట్ ఆశించే అభ్యర్థులు బలంగా లేకపోవడం
మొత్తంగా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికారికంగా టికెట్ కన్ఫమ్ కాకున్నా.. పార్టీ టికెట్ తమకే దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.