EDUCATION: సినిమా గురించి చెప్పేముందు..
నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్‌కి కూడా సెవన్త్ దాకానే వెళ్లాను. ఆ తర్వాత టెన్త్ ప్రైవేటుగా రాసి పాసై ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అదంతా ఓ ప్రహసనం. మా అమ్మానాన్నలకున్నది Minimum Education. చిన్నప్పటి నుంచి చదువు.. చదువు అని కర్ర పట్టుకుని నన్ను వెంట తరిమే పరిస్థితి లేదు. నేను బాగానే చదవడం ఓ కారణమైతే, వాళ్ల ideologyలో ‘చదవాలనిపిస్తే వాడే చదువుతాడు’ అని ఫిక్స్ అయిపోవడం మరో కారణం. ఉదయం పరీక్ష పెట్టుకుని కూడా ముందు రోజు సాయంత్రం అందరం కలిసి సినిమాకు వెళ్లిన సందర్భాలు చిన్నప్పుడు చాలా! స్కూల్లో Progress Report ఇవ్వగానే ఇంటికి తెచ్చి, నాన్న చేత సంతకం చేయించడం తప్పించి, మార్కుల మీద డిస్కషన్ పెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదు. మిగతా ఇళ్లల్లో రకరకాల పరిస్థితులు ఉండటం నేను గమనిస్తూనే ఉన్నాను.
ఉదయం 6 నుంచి 8 దాకా ట్యూషన్, మళ్లీ సాయంత్రం 6 నుంచి 8 దాకా ట్యూషన్.. ఇంట్లో కూడా చదువు.. చదువు అనే Parents అప్పుడూ ఇప్పుడూ చాలా మందే ఉన్నారు. నా ఇంట్లో భిన్నమైన స్థితి ఉండటం వల్ల అప్పట్లో నాకా బాధలు తెలియవు కానీ, పిల్లల Mental Torcher గురించి ఇప్పుడు ఆలోచిస్తే పాపం అనిపిస్తుంది. పేపర్లో నచ్చని News Item ఉంటేనే మరో పేజీ తిప్పేసే తల్లిదండ్రులు, తమ పిల్లలు మాత్రం ఇష్టం ఉన్నా, లేకున్నా చచ్చినట్టు చదవాల్సిందే అని ఆంక్షలు పెట్టడం దారుణం. ఇదంతా పిల్లల కోణం నుంచి చెప్తున్నా! Parents Version మరోలా ఉండొచ్చు. భవిష్యత్తు, తోటి వారిలో పరువు, తమ ఆశయాలు పిల్లలపై రుద్దడం, స్టేటస్ సింబల్.. రకరకాల కారణాలు. ఎవరి వాదన వారిది. ఒక్క చర్చతో తేలే అంశం కాదు ఇది. మార్పు రావడానికి టైం పడుతుంది.
ఇప్పుడు సినిమా సంగతికొస్తే, శ్వేత ఏడో తరగతి చదువుతోంది. సంగీతం అంటే ఇష్టం. నాన్నంటే భయం. ఆ నాన్నకేమో తనని కలెక్టర్‌ని చేయాలని ఆశ. అదే ఆయన ఆశయం. దీంతో శ్వేతని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతూ ‘చదువు.. చదువు’ అంటూ తరుముతూ ఉంటాడు. పుస్తకం చేతిలో లేకపోతే శ్వేతకు తిట్లు తప్పవు. ఎవరితో ఆడుకోనివ్వకుండా, వేరే ఏ పనీ చేయనివ్వకుండా పుస్తకం, చదువుతోనే ఆమెని కట్టి పడేస్తాడు. చివరకు జ్వరంగా ఉన్నప్పుడూ వదిలడు.
అలా జ్వరంతోనే పరీక్ష రాసేందుకు వెళ్లి ఇబ్బంది పడి ఇంటికి వచ్చేస్తుంది. పరీక్ష రాయని కారణంగా తండ్రి చేత దెబ్బలు తిని ఆసుపత్రి పాలవుతుంది. నిద్రలో కూడా ‘కొట్టొద్దు నాన్నా’ అని కలవరిస్తూ ఉంటుంది. డాక్టర్లకు విషయం అర్థమవుతుంది. తండ్రిని పిలిచి సంగతి చెప్తారు. ఆశయం కోసం చిన్నారిని అలా శారీరకంగా, మానసికంగా హింసించడం ఎంత ఘోరమో వివరిస్తారు. పిల్లల్ని ప్రేమతో కాకుండా భయపెట్టి, తిట్టి చదివించాలనుకోవడం సరికాదని సూచిస్తారు. తండ్రి మారాడా? కూతుర్ని అర్థం చేసుకున్నాడా అనేది మిగిలిన కథ.
2004లో ఎన్.ఎన్.శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బాలల చిత్రం ఇది. బేబీ శ్రీహిత, ఆహుతి ప్రసాద్, రజిత, గుండు హనుమంతరావు, వల్లం నర్సింహారావు ఇందులో నటించారు. తన ఆశయం కోసం కూతుర్ని ఇబ్బంది పెట్టే తండ్రి పాత్రలో ఆహుతి ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ద్వితీయ ఉత్తమ బాలల చిత్రంగా నంది అవార్డు అందుకుంది. మేకింగ్ పరంగా ప్రస్తుత కాలానికి ఈ సినిమా యావరేజ్‌గా అనిపించింది. తెలుగులో బాలల చిత్రాలకు ఈ ఇబ్బంది తప్పదనుకుంటా! అయితే కాన్సెప్ట్, నటీనటుల నటన మాత్రం చాలా బాగుంది.
సినిమా కోసం:
PART1: https://youtu.be/WdMF8IZbx-E
PART2: https://youtu.be/2VEns0O5MuQ