Telangana:అసెంబ్లీ సాక్షిగా బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయటపడింది: హరీష్ రావు

Telangana: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు.కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనకపోవడం బంధంలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని..అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీతోనైనా, అటు కాంగ్రెస్ తో నైనా సమానమైన దూరంలో ఉంటదని హరీష్ స్పష్టం చేశారు.

కాగా రెండు పార్టీలతోనూ బిఆర్ఎస్ ఒంటరి పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అన్నారు. తాము తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతామని.. బీజేపీ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. అయినాకూడా రేవంత్ రెడ్డి బీజేపీని పల్లెత్తు మాట అంటలేడని చెప్పుకొచ్చారు. బీజేపీ మహేశ్వర్ రెడ్డి సైతం బడ్జెట్ చర్చలో అధికార కాంగ్రెస్ మీద మాట్లాడిన దానికంటే బీఆర్ఎస్ మీదనే ఎక్కువ మాట్లాడారని అన్నారు. బీజేపీ – కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని.. ఎవరెన్ని బురద చల్లినా ప్రజలకు వాస్తవాలు తెలుసని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

SDF నిధుల కోసం సీఎంని కలిశాం..

సీతాఫల్ మండిలో పెండింగ్ లో ఉన్నటువంటి SDF నిధుల కోసం పద్మారావు గౌడ్ తో కలిసి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిశామని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. సీతాఫల్ మండిలో హై స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే చోటా ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ హయంలో 32 కోట్లు విడుదల చేశారని.. ఎన్నికల కోడ్ రాగానే నిధులు ఆగిపోయాయని గుర్తు చేశారు.SDF నిధులు విడుదల చెయ్యమని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని ..ఈ విషయంపై వారికి రిప్రజంటేషన్ ఇవ్వడం జరిగిందని మాజీ మంత్రి పేర్కొన్నారు.

Optimized by Optimole