Telangana: స్వ‌డ‌బ్బా..ప‌ర‌నింద‌.. బిఆర్ఎస్ స‌భ‌..!!

Telangana: 

టీపీసీసీ అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ
బొమ్మ మ‌హేష్ కుమార్ గౌడ్‌

=============

బీఆర్ఎస్(భారాస )సిల్వర్ జూబ్లీ  వేడుకలు ఊరించి ఉసురుమనిపించినట్టు  సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం ఆ  పార్టీ కార్యకర్తలకే నిరాశ, నిస్పృహలకు గురి చేసింది.  ప్రసంగం ఆద్యంతం పాత చింతకాయ పచ్చడిలా రోటీన్‌గా, జీర్ణించుకోలేని విధంగా సాగిందని బీఆర్ఎస్ శ్రేణులే చప్పడాన్ని బట్టి, ఈ సభ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.మరోవైపు సభా వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే కనిపించడం బీఆర్ఎస్‌లో అంతర్గత రాజకీయ కలహాలను స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందనే వాదనకు బలం చేకూర్చింది. కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను మాత్రమే చూస్తున్నారని, కవిత, హరీష్ రావులు తమ దారి తాము చూసుకోవాలని సభ సాక్షిగా సంకేతాలు పంపారని స్పష్టమైంది. సభ మధ్యలోనే కవిత వెళ్లిపోయారనే వార్తలు, హరీష్ రావు పరిస్థితి  బబ్రజమానం భజగోవిందంలా మారిందని..   ఇక తన దారి తాను చూసుకోవాలని పరోక్షంగా సభా స్థలంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు స్పష్టం చేసింది.

కేసీఆర్ ప్రసంగం వచ్చే ఎన్నికల కోసం పార్టీ ఎజెండా, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఆయన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీపై  విమర్శలతో నిండిపోయింది. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని ‘నకిలీ గాంధీలు’ అని పిలవడం కేసీఆర్ దుస్సాహసానికి నిదర్శనం. కాంగ్రెస్ బిక్షతో ముఖ్యమంత్రి అయిన సంగతిని మరచి, గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనాన్ని తెలియజేస్తోంది. ఈ విమర్శలను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్లి, తాను ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులు, అప్పుల వల్ల రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర పట్టింది. మహిళల మనసు గెలుచుకున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేసీఆర్ విషం కక్కి, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారు. ఆయన నియంతృత్వ పాలనలో రాష్ట్రంలో అనేక పౌర సంఘాలు హక్కుల కోల్పోయారు. అయినా తన కేసీఆర్ తన తప్పు తెలుసుకోకుండా… ఇంకా నియంతృత్వ ధోరణిలోనే సాగుతున్నారు. పార్టీ అధినేత తప్ప ఇంకెవరూ సభలో మాట్లాడకపోవడం ఆయన నియంతృత్వ మనస్తత్వానికి నిదర్శనం.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నా, కేసీఆర్ ఆ పార్టీపై సున్నితమైన విమర్శలతో సరిపెట్టారు. ఈ సభ బీజేపీ-బీఆర్ఎస్ రహస్య మైత్రిని మరోసారి బయటపెట్టింది. ఎన్నికల సమయంలో బీజేపీకి పరోక్షంగా సహకరించడం, ఎన్నికల తర్వాత రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు నీచమైన విమర్శలు చేసుకోవడం బీఆర్ఎస్-బీజేపీల పరిపాటిగా మారింది.  కేసీఆర్ పదేళ్ల పాలనలో బీజేపీకి సాగిలపడి, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. నిధులు తీసుకుకురావడంలో విఫలమయ్యారు. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేశారు.  అవినీతి, అక్రమ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ మోచేతి నీళ్లు తాగడం ఆయనకు అలవాటుగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి మేలు చేసి గురు దక్షణం చెల్లించుకున్న కేసీఆర్ బీజేపీని విమర్శించడం హాస్యస్పదంగా మారింది.

తెలంగాణ ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపాలని గర్జించిన కేసీఆర్, పార్టీ పేరు నుంచి ‘తెలంగాణ’ పదాన్ని తొలగించినప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తిని మరచిపోయారు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల సమరం గురించి ఈ సభలో ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం బీఆర్ఎస్ ఉద్యమ విలువలకు దూరమైందనడానికి నిదర్శనం. గజ్జె కట్టిన గద్దర్‌ను అవమానించిన చరిత్ర, ఉద్యమకారులను, తెలంగాణ కోసం పని చేసిన మేథావులను, కవులను, కళాకారులను పక్కనపెట్టి నియంతృత్వ పాలన చేసిన కేసీఆర్ ఆయన రాజకీయ దోపిడీని స్పష్టం చేస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన వినూత్న పథకాలు,  చారిత్రాత్మక నిర్ణయాలైన బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్ట సవరణలపై కేసీఆర్ నోరు మెదపలేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపింది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్‌కు ప్రజలు ఎప్పటికీ క్షమించరు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు గోదారిలో పోసినట్లైంది. రుణమాఫీ, ఉద్యోగాలు, రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానన్న హామీలు ఎక్కడ?

తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నాం అంబాసిడర్ కార్లలో డీజిల్ పోసుకునేందుకు డబ్బులు లేని రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న డబ్బు కాదా?  కాళేశ్వరం పేరుతో లక్షా 25 వేల కోట్లు దోచుకున్నారు కదా? మీ ఇంట్లో నలుగురికి రాజకీయ పదవులు ఇచ్చుకున్న మీరు,  అమరవీరుల కుటుంబాలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా ? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి? వక్ఫ్ చట్ట సవరణలను ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఇవేం చెప్పడకుండా… కేవలం కాంగ్రెస్ మీద నిందలు వేయడానికే బీఆర్ఎస్ ఈ సభ పెట్టుకుంది.

మొత్తంగా, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లా స్వంత డబ్బా కొట్టుకోవడానికి జరిగినట్లు అనిపించింది. జనాల కంటే విస్కీ సీసాలు ఎక్కువ కనిపించాయని, మహిళలు సభకు రాలేదని ప్రజలే చర్చించుకుంటున్నారు. బీజేపీ-బీఆర్ఎస్ రహస్య ప్రేమను ఈ సభ మరోసారి బయటపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న ఈ రెండు పార్టీల ఉద్దేశాలను ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు.

Optimized by Optimole