తెనాలి, జూలై 10: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపుల ప్రక్రియను అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.రైతుల పట్ల రాజకీయ కక్ష సాధింపు సరికాదు ఒక పార్టీ అధినేత గతంలో మనిషిని తొక్కించారని, నేడు రైతులు పండించిన మామిడికాయలను ట్రాక్టర్లతో తొక్కించారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘ప్రశ్నించే ధైర్యం ఉంటే, చర్చకు రండి’’ అంటూ నాదెండ్ల సవాల్ విసిరారు. తెనాలిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఖరీఫ్, రబీ 2024-25 కాలానికి సంబంధించి మొత్తం రూ.4575.32 కోట్ల విలువైన ధాన్యాన్ని 2,01,934 మంది రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఇందులో బకాయిలకై జూలై 10న ఒక్కరోజే రూ.659.39 కోట్లను 30,403 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు.
*దేశానికి ఆదర్శం*
ధాన్యం కొనుగోలు జరిగే 24 నుంచి 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇది దేశంలోనే తొలిసారి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. గడిచిన రబీ 2021-22 కాలంలో
2,29,248 రైతుల నుంచి 5,099.62 మేట్రిక్ టన్నుల ధాన్యం – రూ.26,23.53 కోట్లు విలువ గల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. ఇక రబీ 2022-23 కాలంలో 1,58,784 రైతుల నుంచి 14,12,881 మేట్రిక్ టన్నుల ధాన్యం – రూ.2,884.04 కోట్లు గల ధాన్యం సేకరించాం. గత రబీ 2023-24 కాలంలో 1,32,859 రైతుల నుంచి రూ.2,763.86 కోట్లు గల
12,64,845 మేట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం కాలంలో చెల్లించకుండా మిగిలిపోయిన రూ.1674.47 కోట్ల బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా చెల్లించినట్టు తెలిపారు.
*పారదర్శకతతో ముందుకు సాగుతున్నాం*
ప్రజాస్వామ్యంలో బాధ్యత గల రాజకీయం అవసరం
‘‘వ్యక్తిగత విమర్శలు, పోలీసులపై దాడులు, అధికారుల బెదిరింపులు ప్రజలకు పంపే సంకేతం ప్రమాదకరమని’’ మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటోంది.రైతుల పట్ల గౌరవంతో వ్యవహరిస్తున్నాం. ధాన్యం కల్లాలను సందర్శించినప్పుడు చెప్పులు విప్పి ధాన్యాన్ని పరిశీలిస్తామని… ఇది రైతుల పట్ల గౌరవానికి సంకేతమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షాన నిలుస్తుందని, వారి సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగుతుందన్నారు. సమగ్రత, పారదర్శకతతో ముందుకు సాగుతున్నాం. ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి నాదెండ్ల తేల్చి చెప్పారు.