Telangana:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై బీఆర్ఎస్ ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు, కేసీఆర్ కుటుంబ సమస్యలు, స్థానిక నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ సతమతమవుతుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీటికి తోడు తాజాగా బీఆర్ఎస్‌ను కల్వకుంట్ల కవిత టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కవిత పోటీ చేయబోతున్నారనే ప్రచారం ఆ పార్టీని కలవరపెడుతున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్‌ను వీడిన అనంతరం కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లో తన బలాన్ని పరీక్షించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్‌కు నష్టం చేస్తుందని, కవితకు దక్కే ప్రతి ఓటు బీఆర్ఎస్ ఓటే అని, తద్వారా పార్టీ ఓటు బ్యాంకును ఆమె చీల్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ మదనపడుతున్నట్టు సమాచారం.
కవిత సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్టు కనపిస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా, పార్టీలో కీలక నేతగా ఉన్న కవిత ఎగ్జిట్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఇటీవల వోటా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు నష్టం చేకూరుస్తారని ప్రాథమిక అంచనా.
కవిత నిరూపించుకోవాల్సిందే..!
‘తెలంగాణ జాగృతి పార్టీ, లేదా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త రాజకీయ శక్తిని తెరపైకి తీసుకురావాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని యోచిస్తున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒక వేళ ఆమె పోటీ చేయకపోయినా తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని బరిలో నిలపాలని ఆమె చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందకంటే, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత.. తానేంటో నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఆమెపై ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్‌తో విభేధించిన అనంతరం రాజకీయంగా తన ప్రభావం చూపించకుండా సైలెంట్‌గా ఉంటే అది తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందని జాగృతి మేధావులు కవితకు సూచించినట్టు సమాచారం. లేదంటే, కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్‌ను తప్పించేందుకు కవిత డ్రామాలు ఆడుతున్నారనే ప్రచారం ప్రజల్లో మరింత బలపడుతుందని చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై గురిపెట్టినట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే జాగృతి బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ కలవరపాటుకు గురైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలక కవిత కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారని ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన రహమత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ముఖ్య నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో సెటిలర్ల ప్రభావం అధికంగా ఉన్నా కూడా.. కవిత బీఆర్ఎస్‌కు నష్టం చేస్తారని, జాగృతి నేతలు సంప్రదాయ తెలంగాణ మహిళా ఓటర్లను పెద్దఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
క్షేత్రస్థాయిలో అంతర్గత కుమ్ములాటలు…
మరోవైపు మాగంటి సునీత, మాగంటి వజ్రనాథ్ వర్గాల మధ్య ఉన్నవిభేదాలు, అటు ఉపఎన్నిక టికెట్ ఆశించి భంగపడిన రావుల శ్రీధర్ రెడ్డి వర్గం పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నారు. అంతర్గత కలహాలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు తగాదాలు, కవిత రూపంలో సమస్యలు వంటి కారణాలతో జూబ్లీహిల్స్‌పై బీఆర్ఎస్ ఆశలు వదులుకున్నట్టే అని ఆ పార్టీ శ్రేణులు చెవులుకొరుక్కుంటున్నాయి.
_(పొలిటికల్ ఎనలిస్ట్)